హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి రాగానే 111 జీవో ఎత్తివేస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈ జీవో కారణంగా బాధపడుతున్న వారందరికీ ఉపశమనం కలిగిస్తామన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా శనివారం మొయినాబాద్ లో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మొయినాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ లక్ష్యాల కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యాలను గత 12 ఏళ్లలో సాధించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కులను పరిరక్షించుకునేందుకే టీఆర్ఎస్ ఏర్పాటు చేశామన్నారు.

111 జీవో ఎత్తివేస్తాం
111 జీవో పరిధిలోని బాధితులందరికీ టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గుడ్ న్యూస్ చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈ జీవో ను ఎత్తివేస్తామన్నారు. ఇతర పార్టీల మాదిరిగా తాము మోసం చేయమని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఇక్కడి ప్రజలకు 111 జీవో ఎత్తేస్తామంటూ మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశాయని విమర్శించారు. 111 జీవో పరిధిలో ఉన్న 120 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. చుట్టు పక్కల భూములు ఎకరాకు వంద కోట్లకు పైగా ధర పలుకుతుంటే 111 జీవో పరిధిలోని ప్రజలు మాత్రం తమ భూములను ఎక్కువ రేటుకు అమ్ముకోలేని పరిస్థితి ఉందన్నారు. పిల్లల పెళ్లిళ్ల కోసం ఒక పావు ఎకరం భూమి అమ్మితే సమస్యలు తీరుతాయని భావించినప్పటికీ ఈ జీవో అడ్డంకిగా ఉందన్నారు. గుంపు మేస్త్రీ తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కటే తెలుసని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ వ్యాపారాన్ని ఊడగొట్టారని మండిపడ్డారు. చేవెళ్ల, మొయినాబాద్ లో ఎక్కువగా రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారని వారికి మేలు చేసేలా ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదని మండిపడ్డారు. అందుకే గుంపుమేస్త్రీ పై పోరాటానికి ఈ ప్రాంత ప్రజలంతా ముందుకు రావాలని కోరారు.
Also Read-
హక్కుల పరిరక్షణకే కొత్త పార్టీ
తెలంగాణ వచ్చాక అన్ని సమస్యలు తీరుతాయని భావిస్తే అలా జరగలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లక్ష్యాల కోసం రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యాలతో పాటు తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసమే తాము కొత్త రాజకీయ శక్తిగా పుట్టుకొచ్చామన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆడబిడ్డల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆడబిడ్డగా, మీ సోదరిగా మీకు ఏం కావాలో నాకు తెలుసు. తప్పకుండా మన పార్టీ ద్వారా మహిళలకు మంచి జరుగుతుందని హామీ ఇస్తున్నా అన్నారు. అదే విధంగా యువత కోసం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సృజనాత్మక ఆలోచన కలిగిన యువత వ్యాపారం చేసేలా ప్రోత్సహించేందుకు వారికి ఎలాంటి గ్యారంటీ లేకుండా 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. చేవెళ్ల, మొయినాబాద్ నుంచి మైనార్టీలు పెద్ద ఎత్తున చేరటంతో ఈ ప్రాంతంలో పార్టీ మరింత బలపడిందని చెప్పారు. ఇక్కడి గంగా జమున తెహజీబ్ ను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్లకు బుద్ది చెప్పాల్సిన అవసరముందని కవిత అన్నారు.

చిలుకూరు బాలాజీ స్వామి వారి దర్శనం
అంతకుముందు కవిత చిలుకూరు బాలాజీ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజాలు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన తమ పార్టీకి స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చామని చెప్పారు. బాలాజీ ఆశీస్సులతో తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రైతులకు మంచి చేసే బుద్ది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాలని స్వామి వారిని కోరుకున్నానని కవిత చెప్పారు. జెండా పండుగ కార్యక్రమం అనంతరం మొయినాబాద్ మండలం సొరంగల్ లో టీఆర్ఎస్ నాయకుడు సంతోష్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బస్ షెల్టర్ కు శంకుస్థాపన చేశారు.

