హైదరాబాద్ : “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రజలకు చేసిన సూచనలను కాంగ్రెస్ పార్టీ కావాలనే వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రయోజనం, ఆర్థిక క్రమశిక్షణ, స్వావలంబన, దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని చేసిన సూచనలను రాజకీయ కోణంలో చూడడం సరైంది కాదు.” భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు మీడియా సమావేశంలో అన్నారు.
రాంచందర్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి నాయకులు ప్రధాని మోదీ చేసిన సూచనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీపై, మోదీ ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు.
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని పాలించింది. ఆ సమయంలో దేశం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు దేశానికి సైనిక సామర్థ్యం కూడా పరిమితంగానే ఉండేది.
ఆ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహకారాన్ని కోరారు. చైనా యుద్ధ సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు భారత సైన్యానికి సహకారం అందించి దేశభక్తిని చాటారు. ఆ సేవలను గుర్తించి అనంతరం జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనాలని జవహర్లాల్ నెహ్రూ గారే ఆర్ఎస్ఎస్ను ఆహ్వానించారు. ఇది చరిత్రలో నమోదైన విషయం.

దేశభక్తి అంటే కేవలం దేశం కోసం చనిపోవడం మాత్రమే కాదు. దేశం కోసం బ్రతికి సేవ చేయడం కూడా దేశభక్తే. దేశ ప్రయోజనం కోసం కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా కూడా త్యాగాలు చేయాల్సి వస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అదే భావనతో ప్రజలకు సూచనలు చేశారు. సోలార్ పంపులను వినియోగించండి, ప్రజా రవాణాను ఉపయోగించండి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించండి, స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయండి, వోకల్ ఫర్ లోకల్‌కు మద్దతు ఇవ్వండి అని ప్రధాని మోదీ చేసిన పిలుపులో తప్పేముంది?
ఈరోజు కూడా లండన్, అమెరికా, యూరప్ దేశాల్లో హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, మంత్రులు, ప్రధానులు ప్రజా రవాణానే ఉపయోగిస్తారు. లండన్‌లో “ట్యూబ్స్” పేరుతో అండర్‌గ్రౌండ్ మెట్రో వ్యవస్థను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అది వారికి డబ్బుల్లేక కాదు. ఆర్థిక క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం. వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. “Individual financial discipline will make a nation financially disciplined” అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
ఆంధ్రా యూనివర్సిటీలో కాలుష్య నియంత్రణ కోసం నెలలో ఒకరోజు కార్లు, స్కూటర్లు వాడకుండా సైకిళ్లు లేదా నడకనే ప్రోత్సహిస్తారు. సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో కూడా ప్రధానులు సైకిళ్లపై ప్రయాణించే సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు కోసం తీసుకుంటున్న చర్యలే. ప్రధాని మోదీ సూచనలను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ గత చరిత్రను పరిశీలించాలి.
Also Read-
జవహర్లాల్ నెహ్రూ ప్రజలకు బియ్యం వినియోగం తగ్గించాలని చెప్పారు. ఉత్తర భారతదేశ ప్రజలను రొట్టెల వినియోగం తగ్గించాలని కోరారు. రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలని కూడా ప్రజలకు సూచించారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రతి సోమవారం భోజనం మానేయాలని దేశ ప్రజలను కోరారు.
ఇందిరా గాంధీ హయాంలో “టాక్ లెస్ – వర్క్ మోర్” నినాదం తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేశారు. పత్రికా స్వేచ్ఛను నియంత్రించారు. ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపించారు. 1976లో బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమాలు అమలు చేశారు. ప్రజలపై ఒత్తిడి తెచ్చి వాసెక్టమీ ఆపరేషన్లు చేయించారు. ఎమర్జెన్సీ కాలంలో బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.
మన్మోహన్ సింగ్ “Money does not grow on trees” అంటూ సబ్సిడీలను తగ్గించాల్సిందే అన్నారు. ఆర్థిక సంక్షోభ సమయంలో “We must tighten our belts” అని కాంగ్రెస్ నాయకులే ప్రజలకు చెప్పారు. 1949లో జవహర్లాల్ నెహ్రూ విందుల పేరుతో ఆహారాన్ని వృథా చేయడం దేశానికి వ్యతిరేకమైన చర్య అని చెప్పారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజలు ఆడంబరాలు తగ్గించాలని సూచించారు.
1950 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆహార ధాన్యాలను కొందరు దాచిపెడుతున్నారని, ఆహార కొరత ఉందని నెహ్రూ చెప్పారు. విభజన తర్వాత పంటలు పండే భూముల్లో పెద్ద భాగం పాకిస్తాన్‌కు వెళ్లిపోయిందని, అందుకే ప్రజలు ఆహారాన్ని పొదుపుగా వినియోగించాలని సూచించారు. 1951లో కొరియా యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయని, భారతదేశంలో కూడా ద్రవ్యోల్బణం పెరిగిందని నెహ్రూ ప్రస్తావించారు.
1967లో ఇందిరా గాంధీ “బంగారం కొనవద్దు” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ విదేశీ మారక నిల్వలు ఒత్తిడిలో ఉన్నాయని, జాతీయ క్రమశిక్షణ అవసరమని చెప్పారు. 2013లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా “Please, stop buying gold” అంటూ ప్రజలను కోరారు. అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదు?
ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రయోజనం కోసం బంగారం కొనుగోళ్లు తగ్గించండి, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించండి, ఇంధన పొదుపు పాటించండి అని చెబితే కాంగ్రెస్ విమర్శించడం దురదృష్టకరం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి. పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. అనేక దేశాల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి.
అమెరికాలో పెట్రోల్ ధరలు సుమారు 59 శాతం పెరిగాయి. కెనడాలో 43 శాతం, దక్షిణాఫ్రికాలో 31 శాతం, టర్కీలో 27 శాతం పెరిగాయి. అయితే భారత్‌లో పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉంచింది. ఇండోనేషియా, సౌదీ అరేబియా, భారత్, బ్రెజిల్ వంటి కొన్ని దేశాలు మాత్రమే ధరలను అదుపులో ఉంచగలిగాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోంది.
యూపీఏ ప్రభుత్వం ఆయిల్ బాండ్ల రూపంలో భారీ భారం భవిష్యత్ ప్రభుత్వాలపై మోపింది. మోదీ ప్రభుత్వం ఆ భారాన్ని భరిస్తూనే దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచింది. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇంధన రేషనింగ్ పరిస్థితులు ఉన్నాయి. కొన్ని దేశాల్లో లీటర్ల వారీగా పరిమితులు విధిస్తున్నారు. భారత్‌లో అలాంటి పరిస్థితులు రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో పని చేస్తోంది.
యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల మధ్య తేడా గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. యూపీఏ కాలంలో రూ.2 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు ఉండగా, ఇప్పుడు రూ.12.75 లక్షల వరకు పన్ను రాయితీ కల్పించారు. యూపీఏ కాలంలో బ్యాంకుల ఎన్పీఏలు 11 శాతం ఉండగా, ఇప్పుడు 0.6 శాతానికి తగ్గాయి. యూపీఏ కాలంలో మౌలిక వసతులపై రూ.1.57 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, ఎన్డీఏ కాలంలో రూ.44.3 లక్షల కోట్లకు పెంచారు.
యూపీఏ కాలంలో రూ.13 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగితే, ఎన్డీఏ కాలంలో రూ.320 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. 2014లో దేశ విదేశీ మారక నిల్వలు సుమారు 304 బిలియన్ డాలర్లు ఉండగా, ఇప్పుడు 655 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2014లో ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్‌లో భారత్ 10వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 5వ స్థానానికి చేరుకుంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. యూపీఏ కాలంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయి. ఎన్డీఏ పాలన పారదర్శకంగా కొనసాగుతోంది. రిటైల్ ఇన్ఫ్లేషన్ గణనీయంగా తగ్గింది. స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగింది. తయారీ రంగం బలోపేతమైంది. సెన్సెక్స్ భారీగా పెరిగింది.
ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రధాని మోదీ చేసిన సూచనలు బలవంతపు ఆంక్షలు కావు. దేశ ప్రయోజనం కోసం ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సిన సూచనలు మాత్రమే. అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గించాలి, విదేశీ పర్యటనల కంటే దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలి, స్వదేశీ వస్తువులను కొనాలి, ఇంధన పొదుపు పాటించాలి అనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సూచనలు చేశారు.
దేశం కోసం మంచి విషయాలు మాట్లాడినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ “నేషన్ ఫస్ట్” సిద్ధాంతంతోనే పని చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం “పవర్ ఫస్ట్” రాజకీయాలు చేస్తోంది. దేశ ప్రయోజనం ముందు రాజకీయాలు ఉండకూడదు. దేశ ఆర్థిక బలోపేతం కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ చేసిన సూచనలను ప్రజలందరూ పాటించాలని కోరుతున్నాం.
