హైదరాబాద్ : పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆయన కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ దిక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో, రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ కేసీఆర్ ప్రాణం ముఖ్యమైందని దీక్ష విరమించాలని వేడుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలకు గుర్తు చేస్తున్నానని కేటీఆర్ అన్నారు. తెలంగాణ బిడ్డల నెత్తురుతో కాంగ్రెస్ నేతల చేతులు తడిచాయన్నారు. తెలంగాణ కథలో ముమ్మాటికి కాంగ్రెస్ విలన్ అని, శాశ్వత శత్రువు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే తెలంగాణ లేదు అన్నది సత్యం. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన దీక్షను తక్కువ చేసి, అవమానకరంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి.
హీరోలు మౌనంగా ఉంటే విలన్లు కూడా మేమే హీరోలని ఫోజులు కొడతారు. అందుకే ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆనాటి ఉద్యమ ఘట్టాలను, దీక్షా దివాస్ ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పిన సంస్కారం మాది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిరి ఏనాడు తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని మేము అనలేదు. మమ్మల్ని అవమానపరిస్తే ఊరుకుంటాం కానీ తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిస్తే ఊరుకునేది లేదు. 60 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ప్రతిసారి తెలంగాణను ముంచింది కాంగ్రెస్ పార్టీనే. 1950 నుంచి 2025 వరకు తెలంగాణ తొలి శత్రువు, విలన్ కాంగ్రెస్ పార్టీనే. ఆనాటి నుంచి ఈనాటి దాకా తెలంగాణ ప్రజా ప్రతినిధులను పార్టీలో కలుపుకొని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనే. దమ్ముంటే చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

తెలంగాణ ప్రజలు ఉద్యమాల కోసం, ప్రజల కోసం నిలబడిన వీరులు. 60 ఏళ్ల పాటు బానిసలుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులే. తల్లి తెలంగాణను తీసివేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టుకున్నది కాంగ్రెస్ బానిసలే. సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి తల్లి తెలంగాణ విగ్రహం బరాబర్ పెడతాము అని కేటీఆర్ ప్రకటించారు.
Also Read-
దీక్షా దివాస్ ప్రాధాన్యత – పునరంకితం అవుదామని పిలుపు
ఈ దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని, అమరవీరుల త్యాగాలను, ప్రజల పోరాటపటిమను గుర్తుచేసుకొని మరోసారి పునరంకితం కావాల్సిన అవసరం ఉన్నది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని, అమరుల ప్రాణాలు తీసుకున్న తీరుని, తెలంగాణకు నిరంతరం చేస్తున్న ద్రోహాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఈ సందర్భంగా కేటీఆర్ సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కీలక ఘట్టం కేసీఆర్ దీక్షతో పాటు, తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ప్రస్థానానికి సంబంధించిన అనేక అంశాలను వివరించారు.
సాధారణంగా ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి తరం మారుతుందని, వారి ఆలోచన విధానం మారుతుందని అయితే ప్రతి తరం తన ఏడు తరాల కథను తెలుసుకోవాలన్న మాట కేటీఆర్ చెప్పారు. ఎన్నో యుగాలు దాటిన తర్వాత కూడా రామాయణ, మహాభారతంలోని హీరోలు ఎవరు, విలన్లు ఎవరు, పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు, రాముడెవరు, రావణుడెవరో అన్ని రకాల అంశాలు ఇప్పటి తరానికి గుర్తున్నాయి అంటే కేవలం గత చరిత్రను పదే పదే మననం చేసుకోవడం వల్లనే అని కేటీఆర్ అన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దశాబ్దాల చరిత్రను, అందులోని విలన్లను, హీరోలను, పోరాట వీరులను, వారి త్యాగాలను, వారి దీక్షలను గుర్తుంచుకోవాలని, దీక్షా దివాస్ కి సంబంధించిన ప్రాధాన్యతను వివరించారు.
ఒకవేళ మన చరిత్రను మనమే తెలుసుకోకుంటే, మననం చేసుకోకుంటే, హీరోల స్థానంలో విలన్లే హీరోలమంటూ చరిత్రను వక్రీకరిస్తారన్నారు. ఒకప్పుడు దోపిడీ, వివక్ష, కన్నీళ్లలో మగ్గిపోయిన తెలంగాణ ఆ బానిస సంకెళ్ళను తెంచుకున్న పోరాట కథను, దాని కథానాయకుడు కేసీఆర్ గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ దీక్ష ఒక చారిత్రక ఘట్టం
స్వతంత్ర సంగ్రామ పోరాటంలో సిపాయిల తిరుగుబాటు, జలియన్‌వాలా బాగ్, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి అనేక ముఖ్య ఘట్టాలు ఉన్నాయి. అదే తీరుగా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలోనూ అపూర్వమైన ఘట్టాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. చరిత్రను మలుపు తిప్పిన సమున్నత సందర్భాలలో కేసీఆర్ ఆమరణ దీక్ష ఒకటి అని నవంబర్ 29, 2009వ సంవత్సరం ఉద్యమ చరిత్రలో ఒక ఉజ్వల దృశ్యంగా నిలిచిపోతుందన్నారు. “కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో”, “కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా” అంటూ ఆనాడు కేసీఆర్ ఇచ్చిన నినాదం సమరనాదంగా పనిచేసి మొత్తం తెలంగాణ జాతిని ఏకం చేసిందని, 11 రోజుల పోరాటంతో తెలంగాణలో పోరాటం పోటెత్తిందన్నారు. కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణలోని సబ్బండ వర్గాలు (రైతు, కార్మికుడు, ఉద్యోగి, లాయర్, డాక్టర్, జర్నలిస్ట్, ఎన్నారైలు) అందరూ కలిసి వచ్చి తెలంగాణ కావాలని కొట్లాడారన్నారు. కేసీఆర్ దీక్షకు దిగివచ్చి డిసెంబర్ 9 తేదీన తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వచ్చిందన్నారు.
కేసీఆర్ దిక్ష కన్నా ముందు దాదాపు పది సంవత్సరాలపాటు మొండి ధైర్యంతో, గుండె ధైర్యంతో గులాబీ జెండా ఎగరేసిన కేసీఆర్ మార్టిన్ లూథర్ కింగ్ మాదిరి ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ అని ముందుకు సాగారన్నారు. తెలంగాణ కోసం కలకంటూ, తెలంగాణ జాతి కోసం తన పోరాటాన్ని ఇచ్చి సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. 1952 నుంచి కేసీఆర్ తెలంగాణ కోసం గులాబీ జెండా ఎత్తే వరకు అన్ని సందర్భాల్లోనూ కాంగ్రెస్ పార్టీతో పాటు సమైక్యవాద శక్తులు ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమానికి చేసిన ద్రోహాలను, మోసాలను గుర్తుంచుకొని మలిదశ పోరాటంలో ఆ సవాళ్లు అన్నింటిని దాటుకుంటూ ముందుకు సాగిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు.
ఉద్యమంలో పట్టువిడుపులతో ముందుకు సాగిన కేసీఆర్ చాణక్యం వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, ఇందులో భాగంగా ఎన్నో పదవి త్యాగాలు, ఎన్నో రాజీనామాలు చేసిన పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నారు. మా పార్టీ ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామా చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు పదవుల కోసం బానిస లెక్క పెదవులు మూసుకుని తెలంగాణకు విద్రోహం చేశారని తెలిపారు.
బాలనాగమ్మ బంధనాలు తెంపిన కొడుకు బాలవర్ది రాజు లెక్క తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ అని కీర్తించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతే, ఇప్పుడు తెలంగాణ ప్రజల అమ్మను తీసి కాంగ్రెస్ బొమ్మను ఆ పార్టీ నేతలు ప్రతిష్టించారని, తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను తీసివేశారని తెలిపిన కేటీఆర్, దీక్షా దివాస్ సందర్భంగా మరోసారి తెలంగాణ తల్లిని తిరిగి సచివాలయంలో పునః ప్రతిష్ట చేసేందుకు ప్రతిజ్ఞ పూనాలని అన్నారు.
దిక్షా దివస్ – ఒక పండుగ, ఒక ప్రతిజ్ఞ
దిక్షా దివస్ అంటే కేవలం కేసీఆర్ దీక్ష చేసిన రోజు మాత్రమే కాదని, దీక్షా దివాస్‌ని ఎప్పటికప్పుడు ఒక దసరా, దీపావళి మాదిరి జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఆ పండుగలో ఉన్న స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ పండగలు చేసుకున్నట్లుగానే, దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ సోయికి సాన పెట్టుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని రగిలించుకోవాలని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని కేటీఆర్ అన్నారు. దీక్షా దివాస్ అంటే ఒక సందర్భం, ఒక సంఘటన కాదు అని, 60 సంవత్సరాల తెలంగాణ చరిత్రను తలుచుకొని, తెలంగాణ కోసం మరోసారి పునరంకితం కావాల్సిన రోజు అన్నారు.
ఆగస్టు 15 రోజు జాతీయ జెండా ఎగరవేసి తెల్లదొరల దోపిడీని, బ్రిటిష్ వాళ్ల దుర్మార్గాలను గుర్తుచేసుకున్నట్లుగానే, నవంబర్ 29 దీక్షా దివాస్ నాడు, డిసెంబర్ 9 విజయ్ దివాస్ నాడు, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన మాట తప్పి 1,000 మందికి పైగా బిడ్డల చావుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని, లేలేత పిల్లల ఉసురు పోసుకున్న కాంగ్రెస్ ద్రోహాన్ని గుర్తుంచుకోవాల్సిన రోజు అన్నారు.
మరోసారి రాణి రుద్రమ, సమ్మక్క సారక్క, కొమురం భీమ్, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ వంటి వీరులందరి స్ఫూర్తితో ఈ తెలంగాణకు దక్కిన స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ, ఢిల్లీ సామంత రాజుల నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం మరోసారి ఉన్నదని కేటీఆర్ తెలిపారు. 16 మంది ఎంపీలను జాతీయ పార్టీలకు కట్టబెడితే తెలంగాణ గొంతుక పార్లమెంటులో మూగబోయింది అని ఉద్యమ పార్టీగా, తెలంగాణ కడుపున పుట్టిన పార్టీ, తెలంగాణను కడుపులో పెట్టుకునే పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నారు. అలాంటి పార్టీ వల్లనే తెలంగాణకు బలం వస్తుందని, కేసీఆర్ గళంతోనే తెలంగాణ మరోసారి నిలబడుతుంది అన్నారు. కేసీఆర్ మాట, మౌనం రెండు సంచలనమే అని, రెండు సంవత్సరాలుగా తెలంగాణలో కేసీఆర్ మాట లేకుండా రాజకీయం నడవడం లేదని, అంతటి బలమైన ముద్ర కేసీఆర్‌దని అన్నారు. మాయ మాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, అవినీతిని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ తెలంగాణను కాపాడుకుందాం అన్నారు.
