హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వారికి తోడుగా ప్రతి బూత్‌లో స్థానిక జూబ్లీహిల్స్ పార్టీ శ్రేణులు, నాయకులు కూడా కష్టపడ్డారు. వారందరికీ ధన్యవాదాలు. వారు కూడా మా అభ్యర్థికి రాజకీయ అనుభవం లేకపోయినా, చాలా కష్టపడి ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేశారు. మాగంటి సునీత గారికి కూడా అభినందనలు చెప్తున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు. ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదు అయింది.
ప్రతి ఎన్నికల్లో గెలవాలని పోటీ చేస్తాము. గత రెండు సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో…
ఎన్నికల్లో మా పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా పోరాడింది. ఎన్నికలు ఎలా జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారు. ప్రతి సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వే ఏజెన్సీలు చెప్పాయి. ఈ ఎన్నిక కొత్త ఉత్సాహాన్ని, కొత్త బలాన్ని ఇచ్చింది. ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైన ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి అని ప్రజలు తీర్పునిచ్చారు. ఈ అంశాన్ని సానుకూల అంశంగా పార్టీ పరిగణిస్తున్నది. 2014 నుంచి 2023 వరకు 7 ఉప ఎన్నికలు జరిగాయి. అన్ని ఉప ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఒకటి, రెండు సీట్లకే పరిమితమైంది. ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా, డిపాజిట్లు కోల్పోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారెంటీల అమలును, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయాము. కులము, మతము పేరుతో రాజకీయం చేయలేదు. ప్రజలకు అవసరమైన అంశాలను మాత్రమే ప్రచారంలో చర్చకు పెట్టాం. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బూతులు మాట్లాడినా, ప్రచారం సందర్భంగా మేము హుందాగా ఉన్నాం. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీగా మేము చేసిన అభివృద్ధిని చూపించాము. 5300 కోట్ల అభివృద్ధిని నియోజకవర్గానికి చేశామని ప్రజల ముందుకు పెట్టాము. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టిన ప్రతి ఒక్క అంశాన్ని ‘బాకీ కార్డు’ రూపంలో ప్రజల ముందుకు తీసుకుపోయాం.
హైడ్రా నుంచి మొదలుకొని, ఆటో అన్నల సమస్యల వరకు అనేక అంశాలను ప్రచారం సందర్భంగా ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేశాం. ఈ విధంగా మా ప్రభుత్వం మాట్లాడక తప్పని పరిస్థితి తీసుకు వచ్చాం. మా ఒత్తిడి కారణంగానే గ్యారెంటీల అమలుపైన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసే స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చాం. మంత్రివర్గంలో మైనారిటీలకు స్థానం లేదని, ఆటోలకు జరుగుతున్న అన్యాయం పైన మా పార్టీ గళమెత్తితే, ప్రభుత్వం ఒత్తిడికి లోనై వారికి స్థానం కల్పించాల్సి వచ్చింది. గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు అని నమ్మే పార్టీ మాది. ఈ ఎన్నిక ఏ విధంగా జరిగిందో ప్రజల్లో, మీడియాలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ఎన్ని రకాలుగా అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో నెల రోజుల ముందు చెప్పాం. స్వయంగా అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండడం, దొంగ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్ మొదలు పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాల గురించి ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేశాం.
Also Read-
కానీ ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేశాం. ఎలక్షన్ కమిషన్ మరియు పోలీస్ పనితీరుపైనా చర్చ జరగాలి. ఈ విధంగా ఎన్నికలు జరిగిన తీరుపైన ప్రజాక్షేత్రంలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ఏదేమైనా ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం. ఈ ఎన్నిక ఫలితం పైన కూడా ఆత్మ విమర్శ చేసుకుంటాం. ఈ ఎన్నికల్లో మరింత ఓటింగ్ జరిగి ఉండాల్సింది. మాకు ఈ ఎన్నికల్లో మంచి ఓటింగ్ వచ్చింది. సింగిల్ డిజిట్‌లో ఉండి డిపాజిట్ బీజేపీ కోల్పోయింది. ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నది. ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం బానే వర్కౌట్ అయినట్టు కనిపించింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని ప్రజలు నిరూపించారు.
ఎన్నికల ఫలితం వలన నిరాశ చెందము. మా పనిని ప్రధాన ప్రతిపక్షంగా చేసుకుంటూ పోతూనే ఉంటాం. ప్రజలతోనే ఉంటాం. ప్రజల కోసమే ఉంటాము. ప్రజల్లోనే ఉంటాం. తిరిగి కెసిఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా పోరాటం చేస్తూనే ఉంటాం. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన లగచర్ల నుంచి మొదలుకొని అనేక అరాచకాలను, అక్రమాలను, అవినీతిని ఎండగడుతూనే ఉన్నాము. ఇదే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పనిచేసుకొని ముందుకు వెళ్దాం. సోషల్ మీడియా ద్వారా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, అవినీతిని ఎండబెడుతున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్‌కు, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, పార్టీ నేతలు అందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు ఈ ఎన్నికతో నిరాశ చెందవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో ఉనికి కోల్పోయే పరిస్థితిలో ప్రజలు తీర్పునిచ్చారు. ఎన్నిక తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో నిమగ్నమై ముందుకు పోదాం.
పశ్చిమ బెంగాల్లో జరిగిన మాదిరి ఇక్కడ కూడా పార్టీ మారిన నేతలను డిస్క్వాలిఫై చేసి ఉప ఎన్నికలు వస్తాయి అని శిస్తున్నాము.
ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకే ఇన్ని అపసోపాలు పడిన కాంగ్రెస్ పార్టీ, 10 ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తాం.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడతాం. ఈ ఎన్నిక సందర్భంగా మా పార్టీ సీనియర్ నేత హరీష్ రావు తండ్రి మరణం తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఇంటి నుంచి ఎన్నికల కోసం పనిచేశారు. మా పార్టీ ఎమ్మెల్సీ రవీందర్ రావు సోదరుడు చనిపోయిన తర్వాత కూడా ఒకే రోజులోనే పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. దీపావళి లాంటి పండగను సైతం పక్కనపెట్టి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క పార్టీ నేతకు, కార్యకర్తకు ధన్యవాదాలు.”
మాగంటి సునీత…
మాగంటి సునీత మీడియాతో మాట్లాడతూ… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాప్ అయింది అని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉప ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాప్ అయ్యింది అని ధ్వజమెత్తారు. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీడియాతో మాట్లాడారు. రౌడీల కనుసన్నుల్లో … రౌడీయిజంతో ఈ ఎన్నికలు జరిగాయని అన్నారు. ఒక ఆడబిడ్డను ఎంత హింసపెట్టాలో అంతాపెట్టారని మాగంటి సునీత ఆరోపించారు.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్‌లు చేయించి, రౌడీయిజంతో గెలిచింది అని అన్నారు. పోలింగ్ సెంటర్‌లోనూ తమపై ర్యాగింగ్ జరిగింది అని మాగంటి సునీత ధ్వజమెత్తారు.
నైతిక గెలుపు మాదే

రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారని మాగంటి సునీత అన్నారు. కాంగ్రెస్ గెలుపు అడ్డదారి గెలుపుగా అభివర్ణించారు.ఎన్నికల ప్రచారంలో తమను టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్స్ చేశారని ఆరోపించారు. తాము నవ్వినా…ఏడ్చినా తమదే తప్పు అన్నట్లు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా నైతికంగా విజయం మాత్రం తమదేనని మాగంటి సునీత తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి ఓటు వేసిన వారందరికీ మాగంటి సునీత ధన్యవాదాలు తెలిపారు.అసలు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు గెలుపు కాదు అని మండిపడ్డారు. అడ్డదారిలో గెలిచారు అంటూ విమర్శించారు. అన్ని పార్టీలు కలిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ ఇది. మేము సింగిల్‌గా పోటీ చేశాం. కౌంటింగ్ సెంటర్‌లో కూడా ర్యాగింగ్ చేశారు. వాళ్లు ఇచ్చిన చీరలు కట్టుకున్నట్లుగా మాట్లాడారు. డబ్బు, రౌడీయిజం, రిగ్గింగ్‌తో కాంగ్రెస్ గెలిచిందని మాగంటి సునీత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
“అడ్డదారిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రిగ్గింగ్ చేసి గెలవడం గెలుపే కాదు. నైతికంగా బిఆర్ఎస్ గెలిచింది. ఆడబిడ్డ పైన ఎంత చెయ్యాలో అంత చేశారు. అప్రజాస్వామికంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. రౌడీలతో భయపెట్టి ఓట్లు వేయించుకొని రౌడీ రాజ్యం మొదలైంది. నాలుగు, ఐదు పార్టీలు కలిసి గెలిచారు. ఇది గెలుపు కాదు. ప్రతి చోట రిగ్గింగ్ చేశారు కాబట్టి అన్ని రౌండ్స్ లో కాంగ్రెస్ లీడ్ కనబర్చింది. మూడు నెలల నుంచి ఏం జరుగుతుందో అందరూ చూశారు. కేసీఆర్ ప్రచారం చెయ్యకపోవడం వల్ల మేము ఓడిపోయాము అని అనుకోవడం లేదు. గోపినాథ్ ఉన్నంత కాలం రౌడీలు అలుగులో దాక్కున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి బిల్డప్ లు ఇస్తున్నారు. కౌంటింగ్ లోపట మా పైన ర్యాగింగ్ చేశారు. మేము కట్టుకున్న చీరల పైన ర్యాగింగ్ చేశారు. జూబ్లీ హిల్స్ లో అప్పుడే రౌడీయిజం మొదలైంది.”
