డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 58వ రోజుకు చేరిన ఉద్యోగుల నిరసనలు
హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు విశ్వవిద్యాలయ ఇంచార్జ్ ఉపకులపతి ఎస్. ఏ. ఎం. రిజ్వీ ని శనివారం తెలంగాణ సచివాలయంలో కలిసి ఉన్నత విద్యా శాఖ జారీ చేసిన లేఖను ఉపసంహరించుకునేలా చూడాలని కోరారు.
వీసీని కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ డా. పి. వేణు గోపాల్ రెడ్డి, నేతలు డా. రజిని , డా.కె. కృష్ణా రెడ్డి, డా. యాకేష్ దైద ఉన్నారు. మరోవైపు విశ్వవిద్యాలయంలో గత 58 రోజులుగా కొనసాగుతున్న మధ్యాహ్నా భోజన విరామ సమయంలో జరిగిన నిరసనలో జేఎసీ నేతలు కాంతం ప్రేమ్ కుమార్; బ్రహ్మానంద నాయుడు; డా. అవినాష్; డా. కిషోర్; డా. రాఘవేంద్ర, డా. రజిత; అంబేద్కర్, దివాకర్, అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read-