[Note- ఈ వ్యాసంపై పాఠకులు తమ అభిప్రాయాన్నిtelanganasamachar1@gmail.com
or 9492925120 కు పంపగలరు. ఫోటోతో ప్రచురించగలము]
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఉద్యమ సమయంలో తరుచుగా ఒక మాట చెప్పేవారు. తాను టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది హేళన చేశారని, మఖలో పుట్టి పుబ్బలో పోతుందని నవ్వుకున్నారనే వారన్నారు. నవ్విన నాపచేను పండింది అన్నట్లుగానే టీఆర్ఎస్ పార్టీ ఇంతింతై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని గుర్తు చేసేవారు. ఇప్పుడు టీఆర్ఎస్ ను కాస్త, బీఆర్ఎస్ గా మార్చారు. దేశ రాజకీయాలను శాసిస్తామని శపథం చేస్తున్నారు. కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీలక విషయం ఒకటుంది.
టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించినా, తెలంగాణలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఏకైక ఆకాంక్ష స్వరాష్ట్ర సాధనగా ఉండేది. ఎవరు తెలంగాణకు జై అన్నా యావత్ తెలంగాణ సమాజం వారి వెనుక నిలిచేది. అందుకే, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి బలమైన మద్దతు ఉండేది. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ఉన్నా, అంతిమ లక్ష్యంగా తెలంగాణ సాధన దిశగానే కొనసాగింది. అందుకే కేసీఆర్ కు తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు లభించింది. వారి సాకారంతోనే తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. చివరకు సక్సెస్ అయ్యారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితులు వేరు.
కేసీఆర్ ఏ ఆలోచన చేసినా దాని వెనుక కనిపించని ఓ రహస్య ఎజెండా ఉంటుంది
రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్, చెప్పే మాటలకు, చేసే చేతలకు అస్సలు పోలికే లేదని సాధారణ జనాలకు సైతం అర్థం అయ్యింది. ఆయన ఓ విషయాన్ని పదే పదే చెప్తున్నాడు అంటే, త్వరలో అది కోల్డ్ స్టోరేజ్ కి వెళ్తుందని భావించే పరిస్థితి నెలకొంది. కేసీఆర్ ఏ ఆలోచన చేసినా దాని వెనుక కనిపించని ఓ రహస్య ఎజెండా ఉంటుంది. బీఆర్ఎస్ మార్పు వెనక కూడా అలాంటి ఉద్దేశం లేకపోలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై చుట్టూ మోహరిస్తున్న నేపథ్యంలో దాని నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారే మాటలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్, టీఆర్ఎస్ తో ఇక్కడ ఉద్దరించింది చాలక, బీఆర్ఎస్ తో దేశాన్ని ఉద్దరిస్తాడా? తల్లికి తిండి పెట్టని వాడు పిన్నికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా ఉంది పరిస్థితి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముందు రాష్ట్రాన్ని చక్కగా పాలించి, తర్వాత దేశం మీద పడితే బాగుంటుందనే మాటలు వస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం కేసీఆర్ కు కలిసి వచ్చే అవకాశం. ఎంత అవున్నా, కాదన్నా కేసీఆర్ వ్యూహాలను తట్టుకునే పార్టీలు ప్రస్తుతం తెలంగాణలో లేవనే చెప్పుకోవచ్చు.
ఇది కూడ చదవండి
బీఆర్ఎస్ హస్తినలో సత్తా చాటేనా?
దేశంలో గుణాత్మక మార్పుకోసం టీఆర్ఎస్ బీఆరెస్ అయ్యిందని గులాబీ నేతలు చెప్పినా, పార్టీ పేరు మార్చినంత ఈజీగా గుణాత్మక మార్పు సాధ్యం కాదని గుర్తుచుకోవాలి. తాజాగా ఢిల్లీలో ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తే కనీసం నేషనల్ హెల్ లైన్ గానూ రాలేదంటే ఆయన పార్టీ ఏమేరకు ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో కమ్యూనిస్టులను మునుగోడు ఎలక్షన్ లో దగ్గరికి తీసుకున్నాడు వచ్చే ఎన్నికల్లో వాళ్లకు కొన్ని సీట్లను కేటాయించడానికి సిద్ధపడ్డాడు కెసిఆర్ బీఆర్ఎస్ మద్దతు కోసమే కానీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంతవరకు ఈయన వెంట ఉంటారనేది కూడా ప్రశ్నార్థకమే. మొన్న కర్నాటక, యూపీ మాజీ ముఖ్యమంత్రులు కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ మాత్రమే ఈ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు. త్వరలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కుమార స్వామి ఫోకస్ అయ్యేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడనే టాక్ వినిపిస్తోంది.
అటు కర్నాటకలోని పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. వారిని మచ్చిక చేసుకునేందుకు కుమారస్వామి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తరచుగా కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నారట. అయితే, ఒక పార్టీ జాతీయ కార్యాలయం ఓపెన్ అయితే, ఇతర పార్టీల నాయకులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ కార్యక్రమానికి ఎందుకు వెళ్తారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్ ను ఎందుకు నెత్తికి ఎత్తుకుంటాయి ? అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. అటు కేంద్ర దర్యాప్తు సంస్థల భయంతోనే కొత్త పార్టీ పేరుతో జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఇంకొందరు వాదిస్తున్నారు.
ఆప్ ఎందుకు సక్సెస్ అయ్యింది?
లోక్ పాల్ బిల్లు ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన అరవింత్ కేజ్రీవాల్, ప్రజా సమస్యలను ఫోకస్ చేసి ఢిల్లీ ముఖ్యమంత్ియ పీఠాన్ని దక్కించుకున్నారు. ఆయనకున్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే..? ఢిల్లీ నుంచి భారీగా ఆదాయం వస్తోంది. దాన్ని మెరుగైన విద్య, వైద్యం, రవాణా వైపు మళ్లిస్తున్నారు. భారీ సాగు నీటి ప్రాజెక్టుల లాంటి అవసరాలు ఆయనకు లేవు. వచ్చిన ఆదాయాన్ని మూడు ప్రధాన రంగాలనైనే ఖర్చు చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన అతి ముఖ్యమైన విద్య, వైద్యం, రవాణా సౌకర్యం చాలా మెరుగ్గా అందిస్తున్నారు. అందుకే ఆయన సక్సెస్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ ప్రపంచంలోనే ఇంజినీరింగ్ అద్భుతం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉందంటే? చారాణా కోడికి బారానా మసాలా మారిదిగా తయారైంది. ఆ ప్రాజెక్టు మూలంగా వచ్చే ఆదాయం కంటే పెట్టే పెట్టుబడే ఎక్కువ అయ్యింది. మున్ముందు ఆ ప్రాజెక్టు మనుగడ ఏంటి? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. సుమార ఓ ఏడాది బడ్జెట్ అంతా కాళేశ్వరానికే తరలించిన కేసీఆర్, భారీ వరదల్లో ఆ డబ్బును ముంచేశారని చెప్పుకోవచ్చు. ఇవాళ రాష్ట్రం ఈ స్థాయిలో అప్పుల కుప్పగా మారిందంటే దానికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు.
ముందస్తుకు రెడీ అవుతున్న కేసీఆర్!
గతంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్, ఈసారి కూడా అదే మాదిరిగా ముందస్తుకు పోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ పోకడ ఈ మధ్యకాలంలో తెలంగాణ మీద పెట్టిన ఫోకస్ ని చూస్తుంటే కచ్చితంగా ముందస్తుకు వెళ్తారని ఘంటాపథంగా చెప్తున్నారు ప్రతిపక్షాలు. అందులో భాగంగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కొత్త సచివాలయ ప్రారంభోత్సవం, ఆ తర్వాత భారీగా ఉద్యోగుల బదిలీలకు శ్రీకారం చుట్టి ముందస్తుకు పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా మూడోసారి తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ ని సీఎం చేయడం కోసం … జాతీయస్థాయిలో తన స్థానం కోసం కేసీఆర్ ప్రయత్నం కూడా జరుగుతుంది.
టీఆర్ఎస్ తో సత్తా చాటిన కేసీఆర్, బీఆర్ఎస్ పేరుతో ఏం సాధిస్తారో
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ మరోసారి విజయం సాధించడం అంత కష్టమైన పని ఏమీ కాదనిపిస్తోంది. కారణం, ఆయనను ఢీకొట్టే స్థాయి వ్యూహాలను అమలుపరిచే ప్రత్యర్థి పార్టీలు లేకపోవడం. తెలంగాణలో బీఆర్ఎస్ ఓకే అనిపించినా, దేశ వ్యాప్తంగా ఏమేరకు సత్తా చాటుతుందనేది చూడాలి. నిజానికి కొత్తగా దేశారాజకీయాలకు వెళ్లిన ఆ పార్టీకి తెలంగాణలో మినహా మరెక్కడా అంతగా బలం లేదు. దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొంత ప్రభావితం చేసిన ఉత్తర భారత దేశంలో మన పప్పులు ఉడకవు ఎందుకంటే వాళ్లు మనని రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండారు. అయినా ఏదో జాతీయ పార్టీ పేరుతో కేసీఆర్ కాస్త కొత్త వంటకాలు వండటానికి తప్ప దేనికీ బీఆర్ఎస్ పనికిరాదనే వాదనలూ ఉన్నాయి. ఏది ఏమైనా టీఆర్ఎస్ తో సత్తా చాటిన కేసీఆర్, బీఆర్ఎస్ పేరుతో ఏం సాధిస్తారో చూడాలి.

శేఖర్ కంభంపాటి జర్నలిస్ట్ నల్గొండ
