బీఆర్‌ఎస్‌కు రాజముద్ర.. పార్టీ పేరు మార్పునకు ఈసీ ఆమోదం

హైదరాబాద్‌: భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారింది. 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన సైనికులు కలిసి భారతదేశ తలరాతను మార్చేందుకు నడుం బిగించారు. ‘తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకొన్నామో.. అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు కదులుదాం’ అని సీఎం కేసీఆర్‌ దసరా రోజు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘మన పార్టీ పేరు ఇకపై భారత రాష్ట్ర సమితి’ అని నాడు ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. పేరు మార్పును ఆమోదిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు గురువారం లేఖ రాసింది. దీంతో టీఆర్‌ఎస్‌ నేటి నుంచి బీఆర్‌ఎస్‌గా అవతరించింది.

ప్రజలను గెలిపించేందుకే..

‘మన దేశంలో రాజకీయాలు ఒక పార్టీ గెలుపు.. మరో పార్టీ ఓటమి అన్నట్టుగానే సాగుతున్నాయి. గెలువాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే నా అభిమతం’ అని బీఆర్‌ఎస్‌ ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు. ప్రజలను గెలిపించేందుకు బీఆర్‌ఎస్‌ ద్వారా జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి అనేక రాష్ట్రాల అధికార బృందాలు వచ్చి అధ్యయనం చేశాయి. శభాష్‌ అని పొగిడాయి. ఈ పథకాలు మా రాష్ట్రంలోనూ వస్తే బాగుండునని కొందరు అనుకొంటే.. సీఎం కేసీఆర్‌ పాలన మా దగ్గర కూడా ఉంటే బాగుపడతామని మరికొందరు భావించారు. నేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి పార్టీని విస్తరించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల్లోకి వస్తే కలిసి నడుస్తామని తెలిపారు. ఓ వైపు పార్టీని విస్తరించాలన్న విజ్ఞప్తులు, మరోవైపు కేంద్రంలోని బీజేపీ దుర్మార్గాలు వెరసి ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావానికి పునాది వేశాయి. ‘అన్ని పార్టీలకు రాజకీయాలంటే ఒక ఆటలాంటిది. టీఆర్‌ఎస్‌కు మాత్రం అదొక యజ్ఞం’ అని కేసీఆర్‌ తరుచూ చెప్తుంటారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించేందుకు ఉద్యమం చేసినా.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రభాగాన నిలిపినా.. ఒక యజ్ఞం మాదిరిగా కఠోర దీక్షతో చేశారు. ఇప్పుడు దేశంలోని 140 కోట్ల ప్రజలను గెలిపించేందుకు మరో మహా యజ్ఞాన్ని చేపడుతున్నారు.

గురువారం రాత్రి హైదరాబాద్‌లోని రాంనగర్‌ చౌరాస్తాలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సంబురాలు

ఉద్యమ నాయకుడిగా.. అభివృద్ధి రథసారథిగా..

‘కేసీఆర్‌ పడితే మొండిపట్టు పడుతడు’ అని సీఎం తరుచూ అంటుంటారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పుడు దేశానికే తలమానికంగా ఎదిగిన తీరును పరిశీలిస్తే ఇది నిజమని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సమైక్యపాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎదురొనేందుకు కేసీఆర్‌ ఒకరే బయల్దేరారు. 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో పిడికెడు మందితో ఉద్యమాన్ని నిర్మించేందుకు పూనుకొన్నారు. కేసీఆర్‌తో ఏమవుతుందిలే అని అనుకున్నవాళ్లకు కరీంనగర్‌లో మే 17న నిర్వహించిన ‘సింహగర్జన సభ’తో మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేశారు. ‘మఖలో పుట్టి పుబ్బలో రాలిపోతుంది’ అని వెక్కిరించినవాళ్లకు భయం మొదలైంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు జెడ్పీ చైర్మన్లు, 85 జడ్పీటీసీ స్థానాలు, వందకుపైగా ఎంపీటీసీ స్థానాలు, 3 వేల సర్పంచ్‌, 12 వేల వార్డులు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. దీంతో ‘కేసీఆర్‌ ఏదో చేయబోతున్నారు’ అన్న సత్యం ఇతర పార్టీల నేతలకు బోధపడింది. ఆ తర్వాత నిర్వహించిన వరుస బహిరంగ సభలతో కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ సత్తా తెలిసి వచ్చింది. ఎదురొచ్చి పొత్తు పెట్టుకున్నది. అంతేకాదు.. ‘మేం అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తాం’ అని వాగ్దానం చేసింది.

టీఆర్‌ఎస్‌ అండతో 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 26 ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలను గెలుచుకొన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టీఆర్‌ఎస్‌ భాగస్వామిగా చేరింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే చాలని, తనకు ఏ శాఖ అవసరం లేదని ఆనాడు కేసీఆర్‌ చెప్పారు. ఇది రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆయన నిబద్దతకు నిదర్శనం. 2004 జూన్‌ 7వ తేదీన రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఏర్పాటు అంశం చేర్చడంతోపాటు యూపీఏ ప్రభుత్వం రూపొందించిన కామన్‌ మినిమం ప్రోగ్రాం’ (సీఎంపీ)లో తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ ఉండేలా చేయడంలో కేసీఆర్‌ విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అధ్యయనం చేసేందుకు 2005 జనవరిలో ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ వేసింది. అయితే కాంగ్రెస్‌ నమ్మించి మోసం చేసేందుకు ప్రయత్నించడంతో 2006లోనే యూపీఏ నుంచి టీఆర్‌ఎస్‌ బయటకు వచ్చింది. ఆ తర్వాత స్వరాష్ట్ర ఆకాంక్ష ఉవ్వెత్తున ఎగసేలా, ప్రతి ఒక్కరిలోనూ ఉద్యమ జ్వాల రగిలేలా సీఎం కేసీఆర్‌ అనేక రూపాల్లో ఉద్యమాన్ని నడిపించారు.

దేశంలో 50కిపైగా రాజకీయ పార్టీలను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించడంలో విజయం సాధించారు. 2009 నవంబర్‌ 29వ తేదీన కేసీఆర్‌ అమరణ నిరాహార దీక్షకు దిగడంతో.. డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఆనాటి సమైక్య పాలకులు కుట్రతో రాష్ట్ర ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. అయినా కేసీఆర్‌ వెనక్కి తగ్గకుండా అనేక వ్యూహలు, ఎత్తుగడలతో ఉద్యమాన్ని ఉరికించడంతో 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నాడు పిడికెడు మందితో మొదలైన టీఆర్‌ఎస్‌ ప్రస్థానం.. నేడు 60 లక్షల మంది గులాబీ సైనికులతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగింది. స్వరాష్ర్టాన్ని సాకారం చేసిన టీఆర్‌ఎస్‌కే 2014 ఎన్నికల్లో ప్రజలు పట్టంకట్టారు. జూన్‌ రెండో తేదీన బాధ్యతలు స్వీకరించింది మొదలు.. విభజన సమస్యలను అధిగమిస్తూ, కేంద్రంలోని బీజేపీ సరారు వివక్షను ఎదుర్కొంటూ, అనేక ఆటుపోట్లను, అడ్డంకులను తట్టుకొంటూ రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించారు. ఇదే స్ఫూర్తితో బీఆర్‌ఎస్‌తో దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పును తెచ్చేందుకు ఇప్పుడు బయలుదేరుతున్నారు.

ప్రత్యామ్నాయం సీఎం కేసీఆరే..

మోదీ నియంతృత్వాన్ని, బీజేపీ ప్రభుత్వ అరాచకాలను ఎదురించి పోరాడే ఏకైక నాయకుడు కేసీఆరేనని దేశం మొత్తం నమ్ముతున్నది. ప్రతిపక్షంగా పోరాడాల్సిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు లేక కునారిల్లితే.. జాతీయ నేతలమని చెప్పుకొనే నాయకులంతా మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్‌ ఒక్కరే బీజేపీకి, మోదీకి ఎదరు నిలబడ్డారు. ‘నియంతృత్వ ప్రధాని’అని విమర్శించి దేశం మొత్తం ముక్కున వేలు వేసుకునేలా చేశారు. మోదీ ప్రభుత్వ చేతగానితనాన్ని దేశానికి తెలిసేలా చేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దుకొన్నామని, దేశంలో నీటి వసతి లేక దాదాపు 44 కోట్ల ఎకరాల భూమి సాగుయోగ్యం కాకుండా పోయిందని వెల్లడించారు. తెలంగాణలో గోదావరిని కాళేశ్వరం ద్వారా ఎత్తుకు నడిపించామని, దేశంలో ఏటా 70 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నా ఎందుకు మళ్లించలేకపోతున్నారని నిలదీశారు. మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా చేయగలిగినప్పుడు దేశమంతా ఇవ్వలేమా? అని ప్రశ్నించారు.

4 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా కూడా భారతదేశం ఏ రోజునా 2 లక్షల మెగావాట్లకు మించి వినియోగించడం లేదనే వాస్తవాన్ని ఎత్తిచూపారు. ‘విధ్వంసం సులువు.. నిర్మాణం కష్టం. ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. మత హింసతో వందేండ్లు వెనకి పోతాం’ అని హెచ్చరించారు. అందుకే దేశానికి ప్రత్యామ్నాయ కూటమి కాదని.. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని ఎలుగెత్తి చాటారు. ‘రాజకీయ ఫ్రంట్‌లు, టెంటులు కాదు.. కొత్త పంథాలో పురోగమించాలె.. నిర్మాణాత్మక విధానాలు, గుణాత్మక మార్పు కావాలె’ అని స్పష్టం చేశారు. తెలంగాణ పని చేస్తున్న స్థాయిలో, పద్ధతిలో దేశం పని చేయడం లేదని.. అందుకే దేశానికి కొత్త ఎజెండా సెట్‌ చేయడానికి తాను సైనికుడిగా పనిచేస్తానని ప్రకటించారు. దేశానికి దశ, దిశ చూపేందుకే తెలంగాణ రాష్ట్ర సమితిని.. ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చారు. ‘తెలంగాణను బాగుచేసుకొన్నం.. ఇప్పుడు దేశాన్ని బాగుచేసుకుందామా? జాతీయ రాజకీయాల్లోకి పోదామా?’ అని సీఎం కేసీఆర్‌ అనేక బహిరంగ సభల్లో ప్రజలను ప్రశ్నించారు. అందరూ పిడికిలి ఎత్తి ‘పోదాం.. పోదాం’ అంటూ సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ మొత్తం మీ వెంటే ఉంటుందంటూ సీఎం కేసీఆర్‌కు భరోసా ఇచ్చారు.

దేశానికి ‘తెలంగాణ మాడల్‌’

మాటల్లో చెప్పడం కాదు.. చేసి చూపించడం, విస్తరించడం సీఎం కేసీఆర్‌ నైజం. సుమారు నాలుగు దశాబ్దాల కింద సిద్దిపేటలో వినూత్న కార్యక్రమాలు అమలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ‘తెలంగాణ మాడల్‌’ను పరిచయం చేశారు. దానిని మరింత అభివృద్ధి చేసి తెలంగాణకు విస్తరించారు. దేశం ఎన్నడూ చూడని సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ‘తెలంగాణ మాడల్‌’ను తయారుచేసి ఇప్పుడు దేశానికి అందించారు.

ఎమ్మెల్యేగా నాడు సిద్దిపేట ప్రజల దాహార్తిని తీర్చేందుకు పదుల కిలోమీటర్ల నుంచి పైపులైన్లు వేసి ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన మంచినీళ్లను అందించారు. సీఎంగా అదే పథకాన్ని తెలంగాణకు విస్తరించి ‘మిషన్‌ భగీరథ’గా మార్చారు. ఇప్పుడు దేశంలో ప్రజల దాహార్తిని తీర్చే దారి చూపేందుకు సిద్ధమవుతున్నారు.

ఎమ్మెల్యేగా నాడు దళిత చైతన్య క్రాంతి పేరుతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపారు. ముఖ్యమంత్రిగా దానిని ‘దళితబంధు’ పేరుతో అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పేదలు తెలంగాణవైపు, సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలవైపు వేసే అడుగుల కోసం ఎదురుచూస్తున్నారు.

సాగునీటి కోసం కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు, ఆడబిడ్డల కోసం తెచ్చిన కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, రైతుల కోసం తీసుకొచ్చిన రైతుబంధు, రైతు బీమా.. ఇలా పదుల సంఖ్యలో ఉన్న సంక్షేమ పథకాలు తమకూ దక్కాలని ఎదురు చూస్తున్నారు.

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ

దేశంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది. ఎమర్జెన్సీ నాటి రాజకీయ శూన్యత కనిపిస్తున్నది. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ 352 స్థానాల్లో అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంలో ప్రత్యామ్నాయ పార్టీయే లేకుండా పోయింది. అడిగేవారెవరూ లేరనే ధైర్యంతో ఎమర్జెన్సీ విధించింది. అక్కడి నుంచే జనతా పార్టీ పుట్టింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచింది. పాకిస్థాన్‌పై సర్జికల్‌ స్రె్టైక్స్‌ చేసి, అందులోనుంచి పుట్టిన భావోద్వేగం కారణంగా 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ 303 స్థానాలతో బీజేపీని అధికారంలోకి తెచ్చారు. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలను, నేతలను అణగదొక్కుతున్నారు. నాడు ఇందిరాగాంధీ నియంతృత్వం ప్రదర్శిస్తే.. నేడు మోదీ నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది. లెక్కలేనన్ని తప్పులను మోదీ చేస్తూనే ఉన్నారు. 1977లో ఇందిరను ఎదుర్కోవడానికి లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అడుగు వేస్తే.. దేశం మొత్తం స్పందించింది. ఇందిరను ఓడగొట్టింది. నేడు ఇదే తరహాలో ‘బీజేపీ ముక్త్‌ భారత్‌ ’ అంటూ సీఎం కేసీఆర్‌ పిలుపునిస్తున్నారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనపై యావత్‌ దేశం ఆసక్తిగా ఉన్నది.

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం.. ఓ మహోజ్వల ఘట్టం

భారత రాష్ట్ర సమితిని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడం దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం. బీఆర్‌ఎస్‌తో దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభం అవుతుంది. 52 దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు బీఆర్‌ఎస్‌ వెంటే ఉంటారు. కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యం. 20 ఏండ్ల కింద ఎలాంటి అంచనాలు లేకుండా ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ సృష్టించిన ప్రభంజనం మన కండ్ల ముందే ఉన్నది. ఇప్పుడు కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ దేశ భవిష్యత్తును మార్చబోతున్నది.

మహేశ్‌ బిగాల, టీఆర్‌ఎస్‌ గ్లోబల్‌ కోఆర్డినేటర్‌ (నమస్తే తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X