తిరుమల: రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ పి.ఎం.ఎస్. ప్రసాద్ బుధవారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకుని జనవరి 7వతేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
జనవరి 7వ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు.
Also Read-
అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. జనవరి 7వ తేది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో 6వ తేది సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.
తిరుమలలో జనవరి 9 న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ : టిటిడి ఈవో
జనవరి 10, 11, 12 తేదీలకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు
ఈ టోకెన్లు జనవరి 9 వ తేదీన ఉదయం 5 గంటలకు జారీ.
మూడు రోజుల తర్వాత ఏరోజుకారోజు ముందు రోజు జారీ
టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు
తిరుపతిలోని 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను తనిఖీ చేసిన టిటిడి ఈవో, అదనపు ఈవో
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మునిసిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్ లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.
కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టిటిడి జేఈవో శ్రీమతి గౌతమి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీధర్ లతో కలిసి ఈవో తనిఖీ చేశారు. ఈవో వెంట సీఈ సత్యనారాయణ, ఎస్.ఈ వెంకటేశ్వర్లు, మనోహర్, ట్రాన్స్ ఫోర్ట్ జీఎం శేషారెడ్డి, తదితర టిటిడి అధికారులు, పోలీసు, రెవిన్యూ అధికారులు ఉన్నారు.