హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ ఏజెన్సీలో పసి పిల్లలు, గర్భిణుల మరణాలు, వైద్య సేవలపై స్టడీ చేయడానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ ఏజెన్సీలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, నవజాత శిశువులు, గర్భిణుల మరణాలకు కారణాలు, ఐటీడీఏ అందిస్తున్న సేవలు, లోటు పాట్లపై సమగ్ర అధ్యయనం చేయాలని కవిత గారు ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్ (ఎస్ఎన్ సీయూ)లో ఏసీ పేలి ఐదుగురు నవజాత శిశువులు మృతి చెందడంతో చలించిపోయిన కవిత గారు వెంటనే మృతుల కుటుంబాలకు అండగా నిలిచారు.. ఆదిలాబాద్ రిమ్స్ ను సందర్శించి అగ్ని ప్రమాదం జరిగిన ఎస్ఎన్ సీయూ ను పరిశీలించారు. చిన్నారుల మరణాలకు కారణాలు వెలికి తీయడంతో పాటు రిమ్స్ లో అందుబాటులో ఉన్న వసతులు, డాక్టర్లు, పూర్తి స్థాయి వైద్య సేవలతో పాటు ఏజెన్సీలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు పార్టీ తరపున అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
Also Read-
కమిటీ సభ్యులు- ఆర్వీఆర్ ప్రసాద్, ఇరిగిజ్జ మురళీకృష్ణ, ఎంఏ అశ్వక్, డాక్టర్ చంద్ర ప్రకాష్, డాక్టర్ సనీత్ కుమార్, పగిడాల శ్రావణి, హలీమా బేగం ఉన్నారు. ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి వైద్య పరిస్థితులు, శిశువులు, గర్భిణుల మరణాలు సహా అన్ని అంశాలపై అధ్యయనం చేసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన కమిటీకి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కవిత గారు ఆదేశించారు.
