అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనకు తెలంగాణ కిసాన్ కాంగ్రేస్ పిలుపు

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యాన్ని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, తరుగు పేరు మీద క్వింటాలుకి 10 కిలోల వరకు తీయడాన్ని ఆపాలి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనకు తెలంగాణ కిసాన్ కాంగ్రేస్ పిలుపునిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం తడిసిన ధాన్యం, మక్కలు కొంటాం అని ప్రకటనలు గుప్పిస్తున్నారు.. త‌ప్ప లిఖితపూర్వ‌క‌ ఆదేశాలు ఇవ్వలేదు. మొక్కజొన్న పంట కొనుగోలు చేస్తామ‌న్నారు.. కానీ ఎక్కడా కొనుగోలు చేయ‌లేదు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మొదట్లో రూ.2200 పలికిన మొక్కజొన్న ఇప్పుడు దళారులు రూ.1400 కొంటున్నారు.

ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలుపై సరైన ఆదేశాలు ఇవ్వడం లేదు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే మొక్కజొన్న లక్ష ఎకరాల్లో సాగు అయింది. ఇందులో 90 శాతం కౌలు రైతులే. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన వారికి, ఆర్థిక నష్టం ఇవ్వ‌లేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఎకరానికి రూ.10 వేలు ఇప్పటికీ ఇవ్వలేదు. మార్చి, ఏప్రిల్ నెల్లో పడిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినారు. మే నెలలో వర్షాలతో చేతి కొచ్చిన పంట నష్టపోతున్నారు.

వడగండ్ల వానలకు మొక్కజొన్న పంట నేలకొరిగి మొలకలు వస్తున్నాయి. వర్షాల వల్ల పెట్టుబడుల భారం పెరుగుతున్నది. అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి. అప్పులు తీర్చని కారణంగా రైతుల మీద రుణ భారం పెరుగుతున్నది. రుణ భారంతో, ఆదాయం లేక, దిగులుతో, దిక్కు తోచని పరిస్థితులలో రైతులు ఉన్నారు. ఇప్పటికే సిరిసిల్ల జిల్లా కొనరావు పేట లో ఒకరు, భూపాల పల్లి రేగొండ మండలంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు.

యాసంగి వరి పంట 70 శాతం ధాన్యం చేతికొచ్చింది. అయినా కూడా కొనుగోలు అంతంత మాత్రమే నడుస్తుంది. ఇప్పటి వరకు కేవలం 19 లక్షల క్వింటాలు కొనుగోలు చేశారు. కొనుగోలు చేయని ధాన్యం, ఆరు బయట వర్షానికి తడిసి పాడవుతుంది. కొనుగోలు కాక, ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో వున్నారు.

అటు కొనుగోలు కేంద్రాలలో క్వింటాలుకి 10 కిలోలు ఇస్తేనే కొనుగోలు చేస్తాం అని చెప్పుతున్నారు. ఇదివరకు లాగానే, ట్రక్ సిట్ ఇవ్వడం లేదు.

ఈ యాసంగి ధాన్యం కొనుగోలు కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ తరపున తెలంగాణా ప్రభుత్వానికి సీజన్ కు ముందే విన్నవించాము. ప్రభుత్వం తగిన వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం వలన గన్ని బ్యాగుల సమస్య అలాగే తూకం వేయడానికి రైతులు 20 రోజులుగా ఎదిరిచూపు ఒక వేళ తూకం వేసిన ధాన్యం తరలింపు లో లారీలు లేవని ఆలస్యం చేస్తున్నారు. ఇవన్నీ ముందస్తుగా ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాట్లలో నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అటు చూస్తే వాతావరణంలో ఎప్పుడు ఏమి అవుతుందో తెలుస్తలేదు. తీవ్రమైన ఎండలు, అకాల వర్షాలు, కుండపోత, గాలితో కూడిన వాన, ఉరుములు, మెరుపులు రైతుల మీద తీవ్రమైన భారం పెడుతున్నాయి. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియక నిత్యం రైతులు అవస్థలు పడుతున్నారు. తీవ్రమైన ఎండలకు, వర్షాలకు చాటు లేకపోయినా వడ్ల రాశులకు కాపలా ఉంటున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు నష్టం చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారు. రైతు కష్టం మీద సొమ్ము చేసుకుంటున్నారు. రైతుల పట్ల అధికారులకు, రైసు మిల్లులకు కొంతైనా సానుభూతి లేకపోవడం స్పష్టంగా కనపడుతున్నది. ఈ దోపిడీ ఎందుకు ఆగడం లేదు? తరుగు, తేమ పేరిట రైతులను పీడిస్తున్నారు.

ధాన్యం తూకం వేసిన తరువాత ట్రక్ శీట్ రైతులకు ఇవ్వడం లేదు. సాధారణంగా తూకం వేసినాక అమ్మకం జరిగినట్టే. రైతుకు ఆ తరువాత ప్రక్రియలలో ధాన్యంతో సంబంధం ఉండదు. రైసు మిల్లుతో అసలే ఉండదు. ఉండొద్దు కూడా. కాని, ధాన్యం మిల్లుకు చేరేవరకు, వాళ్ళు ఇంకొక రశీదు రాసేవరకు రైతును సందిగ్ధంలో పెడుతున్నారు. ప్రభుత్వ అధికారులు దగ్గర ఉండి తమకు ఇచ్చిన విధులు నిర్వర్తిస్తూ రైతులకు భరోసా కల్పించే బదులు, వాళ్ళను పీడించే పద్ధతులకు తోడ్పాటు అందించడం సిగ్గు చేటు. అటువంటి వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ట్రాక్ శీట్ రైతులకు ఇవ్వకపోవడం అవినీతికు దోహదం చేయడమే. ప్రభుత్వం పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని భావిస్తే, ట్రక్ షీట్ నకలు రైతులకు ఇవ్వాలి. ఇవ్వకుంటే దోపిడీకి ప్రభుత్వం సహకరిస్తున్నట్టే . ఇది అన్ని జిల్లాల్లో అన్ని కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్నది. గడిచిన మూడు సంవత్సరాలుగా ప్రతి కొనుగోలులో కూడా ఇలానే అవినీతి జరిగింది. ఆధారాలతో సహా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు లేవు. ఆ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు.

ఇప్పుడు కూడా మళ్లీ అదే మిల్లర్ల దోపిడీ జరుగుతున్నా తెలంగాణా ప్రభుత్వ అధికార యంత్రాంగం మౌనంగా వుంటున్నారు. ఈ విషయంగా, ప్రభుత్వం ఈ క్రింద ఇచ్చిన చర్యలు చేపట్టాలి:

  1. తూకం వేయగానే రైతుకు ట్రాక్ షీట్ ఇవ్వాలి
  2. మిల్లర్లతో రైతులకు ఎటువంటి సంబంధం ఉండకూడదు
  3. రైతుకు ఇచ్చిన ట్రాక్ షీట్ ఆధారంగానే డబ్బులు ఇవ్వాలి.
  4. కొనుగోలు కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసి రైతులు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలి.
  5. గతంలో రైతులకు రావాల్సిన డబ్బులకు తక్కువ వచ్చినవి అప్పుడు ఆధారాలతో ఇచ్చిన ఏ ఒక్కరికి డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు కూడా మిల్లర్లు కట్ చేస్తున్న రు. దీని మీద విచారణ జరిపి బాధ్యులైన అధికారుల మీద, మిల్లర్ల మీద చర్యలు తీసుకొని రైతులకు తగ్గించిన డబ్బులను వెంటనే రైతులకు చెల్లించాలి.
  6. మక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి.
  7. పొలం మీదనే పంట రాని రైతులకు, కోసిన పంట కొనుగోలు కేంద్రాలకు రాకుండానే నష్టపోయిన రైతులకు, పంట తడిసి, తేమ పెరిగి, మొలకలు వచ్చిన పంట ను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేదా వర్షానికి తడిసిన ధాన్యాన్ని, మొక్కజొన్న పంటలకు తెలంగాణా ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించాలి.
  8. రుణాలను రీషేడ్యుల్ చెయ్యాలి. రుణ మాఫీ అమలు చెయ్యాలి.

ఈ నెల 15 వ తేదీన అన్ని జిల్లాల్లో జరిగే నిరసన కాయక్రమాల ద్వారా ప్రభుత్వ తీరు మారకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.

అన్వేష్ రెడ్డి సుంకేట, చైర్మన్
తెలంగాణ కిసాన్ కాంగ్రెస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X