హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చెసారు. తెలంగాణ ప్రభుత్వం కోర్టు తీర్పును శిరసావహిస్తూ సోమేశ్ కుమార్ ను సీఎస్ బాధ్యతల నుండి తప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తోంది.
“2014 రాష్ట్ర విభజన తరువాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ చట్టాలను, రాజ్యాంగాన్ని, కేంద్ర నిబంధనలను గౌరవించలేదు. తన రాజకీయ అవసరాల కోసం తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అధికారులను పావుగా వాడుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు.”
“తెలంగాణకు కేటాయించబడ్డ ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డ సోమేశ్ కుమార్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ లబ్ది పొందారు. 317 జీవోసహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారు. అదే విధంగా హెచ్ఎండీఏ, రెవిన్యూ, ఇరిగేషన్, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేశ్ కుమార్ ను పావుగా వాడుకున్నారు. సోమేశ్ కుమార్ నియామకం విషయంలో కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా చీఫ్ సెక్రటరీగా నియమించడం కేసీఆర్ అనైతిక రాజకీయాలకు నిదర్శనం.
ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒక న్యాయం? సోమేశ్ కుమార్ కు ఒక న్యాయమా? ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాల ప్రకారం సోమేశ్ కుమార్ తొలగించి తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణ కేటాయించి వ్యక్తిని సీఎస్ గా నియమించాలి. డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీకి కేటాయించబడ్డ అధికారులను ఆ రాష్ట్రానికి బదలాయించాలి. అట్లాగే తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని బీజేపీ డిమాండ్ చేసింది.”
ఇంతకు ముందు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఆదేశించింది. తెలంగాణకు సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసిన ధర్మాసనం. సర్టిఫైడ్ కాపీ అందిన వెంటనే ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులపై ఆయన క్యాట్ను ఆశ్రయించడంతో 2016లో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేలా హైదరాబాద్ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులతో అప్పటి నుంచి సోమేశ్ తెలంగాణలోనే కొనసాగుతున్నారు.
మరోవైపు కేడర్ కేటాయింపు కేసులో ఏపీకి పోవాలన్న తీర్పుపై మరో అవకాశం కోసం సీఎస్ సోమేష్ కుమార్ తరపున ప్రయత్నాలు జరిగాయి. సోమేష్ కుమార్ ఇక ఏపీకి పోవాల్సిందేనని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందా బెంచ్ స్పష్టంగా తీర్పునిచ్చింది. అయితే అప్పీలుకు పోవడానికి వీలుగా ఈ తీర్పుపై మూడు వారాల స్టే ఇవ్వాలని సోమేష్ కుమార్ తరపు అడ్వొకేట్లు బెంచ్ ను కోరారు. అయితే దీన్ని సీజే బెంచ్ సూటిగా రిజెక్ట్ చేసింది.
ఇప్పటికే ఈ కేసులో చాలా వాదనలు జరిగాయి. చాలా అంశాలపై చర్చ జరిగింది. బీహార్-జార్ఖండ్ లో కేడర్ కేటాయింపు కేసుల్లో వచ్చిన తీర్పులను కూడా హైకోర్టు పరిశీలించింది. దీంతో అన్నీ బాగా లోతుగా స్టడీ చేశాకే తీర్పు చెప్పామని జడ్జిమెంట్ చివరిలో బెంచ్ కామెంట్ చేసింది. అందువల్ల దీనిపై తాత్కాలికంగా కూడా స్టే ఇచ్చే ఆలోచన ఏ మాత్రం లేదని తేల్చిచెప్పేసింది. సీఎస్ సోమేష్ కుమార్ ఇంకా ఏదో రకంగా తెలంగాణలో కొనసాగే చివరి అవకాశం కూడా అయిపోయినట్లేనని సీనియర్ అడ్వొకేట్లు చెబుతున్నారు. స్టే ఇవ్వకపోవడం వల్ల ఆయన వెంటనే ఏపీకి పోక తప్పని పరిస్థితి ఉందంటున్నారు.
హైకోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ వచ్చాక దాని ఆధారంగా సోమేష్ సుప్రీంలో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. సుప్రీంలో విచారణకు కేసు లిస్టై ముందుగా స్టే ఇస్తే తప్ప ఆయనకు ఊరట దొరికే వీలు లేదు. అప్పటివరకు ఆయన ఏపీలోనే పనిచేయాల్సి వస్తుంది. సుప్రీంలో వెంటనే స్టే రాకుంటే ఇక ఆయన ఏపీ కేడర్ అధికారిగానే కొనసాగాల్సి ఉంటుంది. హైకోర్టు తీర్పులోనే బీహార్-జార్ఖండ్ కు చెందిన ఇంద్రదేవ్ పాశ్వాన్ కేసును బెంచ్ ప్రస్తావించింది. దాదాపుగా సోమేష్ కుమార్ కేసును పోలి ఉన్న ఈ వ్యవహారంలో అధికారికి వ్యతిరేకంగానే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జార్ఖండ్ ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేశానన్న కారణంతో ఆయన జార్ఖండ్ లోనే కొనసాగాలని భావించారు. అయితే ఆయనకు అలాట్ మెంట్ లో బీహార్ కేడర్ వచ్చింది.
తన ఆప్షన్స్ ను తిరస్కరించడాన్ని సవాలుచేస్తూ ఆయన కోర్టుకెక్కారు. క్యాట్, హైకోర్టుల్లో భిన్నమైన తీర్పుల తర్వాత ఫైనల్ గా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సొంత కారణాలతో ఏకపక్షంగా కేడర్ అలాట్ మెంట్ కోరుకు హక్కు అధికారులకు ఉండదని తేల్చిచెప్పింది. చట్టపరమైన లోపాలుంటే తప్ప ఇట్లాంటి వాటిలో అసలు క్యాట్ కూడా జోక్యం చేసుకోవడానికి వీలులేదని సుప్రీం తీర్పు చెప్పింది. ఇదే తీర్పు ఆధారంగా సోమేష్ కేసులో రాష్ట్ర హైకోర్టు సీజే బెంచ్ తీర్పు ఇవ్వడం ఇంట్రెస్టింగ్. (Agencies)
సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని మేం మొదటి నుండి చెబుతున్నాం. తాజాగా హైకోర్టు అదే చెప్పింది.
— Revanth Reddy (@revanth_anumula) January 10, 2023
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్ గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలి. pic.twitter.com/6VtMSXUWUk