ఫూలే సినిమా : ‘సెన్సార్‌’ బోర్డు ద్వంద్వ ప్రమాణాలు…!

భారత దేశ తొలితరం సామాజిక సంస్కరణవాదులు ‘మహాత్మా’ జ్యోతీరావు ఫూలే (11 ఏప్రిల్‌, 1827 – 28, నవంబర్‌ 1890); ఆయన భార్య సావిత్రీబారు ఫూలే (3, జనవరి 1831 – 10 మార్చి, 1897) దంపతుల జీవితానికి సంబంధించిన హిందీ బయో పిక్చర్లో వాస్తవాల్ని సెన్సార్‌బోర్డ్‌ కట్‌ చేయడంలో- చరిత్రను సమాజానికి తెలియనీయ కూడదన్న దుర్నీతి, కాపట్యం ఇట్టే అవగతమవుతోంది. ఫూలే దంపతులు కుల వివక్ష మీదనే కాదు.. సతీ సహగమనం, బాల్య వివాహాలు, వితంతువుల పట్ల వివక్ష.. ఇలా అనేక సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా స్థిరంగా, ధైర్యంగా పోరాడారు. వారు తమను అడ్డుకుంటున్న అగ్ర కుల శక్తులను తట్టుకుంటూ మరీ పోరాటం కొనసాగించారు. 1873 సెప్టెంబర్‌ 24న ‘సత్య శోధన్‌ సమాజ్‌’ను ఏర్పాటుచేసి సమానత్వం కోసం, అభ్యుదయం కోసం జీవితాంతం నిస్వార్ధంగా ఉద్యమించారు. మహిళలకు విద్య ఏమాత్రం అందుబాటులోలేని దశలో భర్త సహకారంతో అక్షర జ్ఞానం పొందిన సావిత్రీబారు ఫూలే దేశంలోనే తొలి ఉపాధ్యాయినిగాగుర్తింపు పొందారు. బాలికలకు విద్యాలయాలు, యువ వితంతు మహిళలకు రెస్క్యూ హౌమ్‌ సహా అనేకానేక విప్లవాత్మక మార్పులకు ఆ దంపతులు యావజ్జీవితం కృషి చేశారు.

ఫూలే సినిమాలో వాస్తవాలను కట్‌ చేసినంత మాత్రాన- ఇప్పటికే బహుముఖంగా రికార్డయిన వాస్తవాలు లోకానికి ఎప్పటికీ తెలియవనుకోవడం భ్రమే. ఫూలే సినిమాను సెన్సార్‌ బోర్డ్‌ (సభ్యులందరూ తిలకించి) అన్ని వయసుల వారూ చూసేలా ‘యూ సర్టిఫికెట్‌’తో సహా విడుదలకు అన్ని అనుమతులూ ఈ ఏప్రిల్‌ ఏడునే ఇచ్చింది. సామాజికంగా బహిష్కరించబడిన మాలి (గార్డెనర్‌) కులానికి చెందిన- ఫూలే 196వ జయంతి సందర్భంగా ఈ నెల 11న విడుదలకు సినిమా యూనిట్‌ అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. ఇంతలో సెన్సార్‌ బోర్డ్‌ అత్యంత అప్రజా స్వామికంగా, అసంబద్ధంగా- సినిమాలో కొన్ని ‘అభ్యంతరాలు’ (?) ఉన్నాయంటూ విడుదలను అడ్డుకుంది. మొత్తం 12 కట్స్‌ జాబితా పంపింది. ఆ కట్స్‌ అనంతరం ఏప్రిల్‌ 25న చిత్రం విడుదలైంది.

ఫూలే సినిమా విడుదలకు అభ్యంతరపెట్టిన బ్రాహ్మణవాద సంఘాలూ, సంస్థల అభిప్రాయాల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్న సెన్సార్‌ బోర్డ్‌- వాటికి చారిత్రక రుజువులతో సహా అత్యంత సహేతుక సమాధానాలిచ్చిన స్క్రీన్‌ ప్లే రైటర్‌, దర్శకుడు అనంత్‌ మహదేవన్‌ వాదనను అసలేమాత్రం పట్టించుకోలేదు. ”ఫూలే కేవలం బయో పిక్‌ కాదు. కుల, లింగ వివక్షతను అధిగమించడానికి, వితంతువులకు గౌరవం అందించడానికి జ్యోతిబా ఫూలే, సావిత్రిబారు ఫూలే 1850లో ప్రారంభించిన నిశ్శబ్ద సామాజిక విప్లవానికి ఇది ప్రతిబింబం. 175 సంవత్సరాల క్రితం ప్రగతిశీల లక్ష్యం ఇప్పటికీ పూర్తికాలేదు” అని దర్శకుడి వివరణ.

Also Read-

మహారాష్ట్రలో బ్రాహ్మణ పీష్వాలు రాజ్యమేలుతున్న కాలంలో మహర్లు, మాంగ్‌ (కులం పేర్లు తీసేయాలంది బోర్డ్‌)- (స్త్రీలు, పురుషులు) మెడలో ఓ ముంత, నడుం కిందికి ముడ్డి మీద చీపురు కట్టుకుని నడిచేవారు. వారి నడక ముద్రల్ని వారే చెరిపేసుకోవాలి. లేకుంటే.. ఆ దారిలో నడిచే అగ్ర కులస్థులు మైలబడిపోతారు.. దళితులు ఉమ్మును ఎక్కడబడితే అక్కడ కాకుండా ముంతలోనే ఊయాలి.. లేదంటే- వారు ఉమ్మిన రహదారులపై అగ్రవర్ణాల వారు నడిస్తే మైలబడిపోతారు.. ముంతలో ఊసి తమ ఇళ్లకు వెళ్లిన తర్వాత వారు ముంతను శుభ్రం చేసుకుంటారు. ఇలా మెడలో ముంత, ముడ్డికి చీపురు కట్టుకోకుండా రోడ్లపైకి వస్తే కఠినంగా శిక్షించిన సందర్భాలు చరిత్రలో ఎన్నో లిఖితమయ్యాయి. ఈ ప్రస్తావనను బ్రాహ్మణవాద సంఘాలు సహించలేకపోతే- దాన్ని కట్‌ చేసి- దాని బదులు- ‘దూరంగా నడవాలి’ అని చేర్చుకోవాలంది సెన్సార్‌ బోర్డ్‌.

బ్రిటీష్‌ పాలనలో భారతీయులు నూరేళ్లు బానిసత్వంలో మగ్గారు. అయితే దళితులు మూడు వేల సంవత్సరాలుగా దారుణ వివక్ష అనుభవిస్తున్నారు అనే వాస్తవంలో.. మూడు వేలు అనే వివరాన్ని నిషేధించింది బ్రాహ్మణవాద ప్రాబల్య సెన్సార్‌ బోర్డ్‌. కుల వివక్షకు సంబంధించిన చర్చకు వాయిస్‌ కట్‌ చేయాలని ఆదేశించింది. కులం పేరూ ప్రస్తావించక.. వాయిస్‌ కూడా మైమ్‌ చేస్తే సినిమాకు అర్థమేముంటుంది? సావిత్రీబారు ఫూలేపై ఓ బ్రాహ్మణ బాలుడు పేడ విసిరిన దృశ్యాన్ని.. అలాంటి సంఘటనకు చారిత్రక ఆధారాలు లేవని అభ్యంతరపెట్టారు. అయితే ఇదే సీనును ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ గతంలో తన సినిమా ‘భారత్‌ ఏక్‌ ఖోజ్‌’లో చూపితే ఎలాంటి అభ్యంతరం లేదు.

ప్రభుత్వ అధీనంలోని దూరదర్శన్‌లో సైతం 1988-’89లో ఆ సినిమాను ప్రసారం చేశారు. సెన్సార్‌ బోర్డుకు అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకొచ్చిందో..! ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్‌ కథాంశంతో నిర్మించిన ‘చావా’ సినిమా విడుదల అనంతరం మత ఘర్షణలు జరిగాయి. వందల సంవత్సరాలనాటి ఔరంగజేబు చక్రవర్తి సమాధిని తవ్వాలని అల్లర్లు రేగాయి. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని సెన్సార్‌ బోర్డ్‌ వారికి నామమాత్రంగానైనా స్ఫురించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2023లో విడుదలైన ‘కేరళ స్టోరీ’ సినిమాలో- 35 వేల మంది హిందూ యువతుల్ని లవ్‌ జిహాద్‌ ద్వారా మతం మార్చి ఉగ్రవాద శిక్షణ గరుపుతున్నారని చూపితే అభ్యంతరాలున్నా సెన్సార్‌ బోర్డ్‌ అనుమతులిచ్చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం- ఆ సంఖ్యకు ఆధారాల్లేవని అభ్యంతరం చెప్పి.. ట్రైలర్‌లో ఆ విషయం తెలపాలని ఆదేశించింది.

ఆ విషయం గుర్తుకురాదా ఎవరికైనా? అయినా ఆ అంశాన్ని రాజకీయంగా విస్తృతంగా ప్రచారం చేసి ఓట్లు దండుకున్న వైనం చూశాంగా..! ‘కాశ్మీరీ ఫైల్స్‌’ సినిమాలో ప్రభుత్వ ఆధీనంలోని అత్యున్నత విద్యాసంస్థ జేఎన్టీయూ గౌరవాన్ని దారుణంగా దెబ్బతీశారు. 2002 గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన ‘ది సబర్మతీ రిపోర్ట్‌’లో అనేక అబద్ధాలు ఉన్నా నిజాయితీగా తీసిన చిత్రం అని ఏకంగా పార్లమెంటులోనే ప్రదర్శించారు. మానవత్వానికే కళంకం వంటి గుజరాత్‌ అల్లర్లను కప్పిపుచ్చడానికి ఏకపక్షంగా తీసిన సినిమా అని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. గుజరాత్‌ అల్లర్లలో వెయ్యి మందికి పైగా ముస్లిములు హతులయ్యారని రిటైర్డ్‌ జడ్జీలిచ్చిన స్వతంత్ర.. సాధికార నివేదికలు అందుబాటులోనే ఉన్నాయి. ఇన్ని ‘ప్రాపగాండా సినిమాల’కు లేని అభ్యంతరాలు కోటానుకోట్ల బడుగు బలహీనవర్గాల ప్రజల ఆశాజ్యోతి సంఘ సంస్కర్త సినిమాకు ఎందుకు? సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరపెట్టిన అంశాలను మరి అన్ని సందర్భాల్లోనూ ఒకేలా పాటిస్తున్నారా అంటే ‘లేనేలేదు’ అనే జవాబు వస్తుందనడానికి ఎన్ని ఉదంతాల్నైనా ఉదహరించొచ్చు.

సెన్సార్‌ బోర్డ్‌ ఏంజేస్తున్నట్టు ఈ అన్ని సందర్భాల్లో..!? సినిమా కారణంగా శాంతి భద్రతల సమస్య వంటివి ఉత్పన్నం కావొచ్చు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే.. ఆ మేరకు అవి గెజిట్‌ రూపంలో అభ్యంతరం తెలిపితే విడుదలకు బ్రేకే. అయితే ‘ఫూలే’ విషయంలో ఏవిధమైన ఆంక్షలు అధికారికంగా వెల్లడించకున్నా సెన్సార్‌ బోర్డే నేరుగా చిత్రంపై దాడికి పూనుకుంది.. అదీ తన తొలి సంపూర్ణ సమ్మతిని తానే తోసిరాజని. బ్రాహ్మణవాద సంఘాలూ సంస్థలూ అభ్యంతర పెట్టినంతమాత్రానే సెన్సార్‌ బోర్డ్‌ ఇంతటి ‘యూ టర్న్‌’ తీసుకుందనుకోలేం. రాజకీయ వత్తిళ్లే ప్రధాన కారణమని ఎవరికైనా ఇట్టే తెలిసే రహస్యమే. బోర్డ్‌ ద్వంద్వ ప్రమాణాలకు ప్రతీకగా ‘ఫూలే’ నిలుస్తోంది. మన దేశంలో ప్రజావ్యతిరేక కుల.. మత.. రాజకీయ ఎజెండాలకూ సినిమాలు ఊతమివ్వడం దౌర్భాగ్యం… అందుకు- రెండు గంటల తొమ్మిది నిమిషాల నిడివి ఉన్న ఈ ‘ఫూలే’ సినిమా ఓ తాజా ఉదాహరణ. చరిత్రను సైతం సినిమాగా తీయడాన్ని అడ్డుకోవడం భావ ప్రకటన స్వేచ్ఛకు కచ్చితంగా విఘాతమేనని దేశవ్యాప్తంగా ప్రగతిశీలురు, రాజ్యాంగ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫూలే నా ఆదర్శం.. నాకు స్ఫూర్తి అని- అదే మహారాష్ట్రకు చెందిన.. భారత రాజ్యాంగ పరిషత్‌ అధినేత, స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి భీమ్రావ్‌ రాంజీ అంబేద్కర్‌ పలు సందర్భాల్లో సగర్వంగా చాటుకున్నారు. ఆనాడు దేశంలో కుల వివక్ష ఎంత ఘోరంగా ఉండేదో అంబేద్కర్‌ తన ‘ఇన్హిలెంట్‌ ఆన్‌ కాస్ట్‌’లో విశదీకరించారు. ఫూలే సైతం ఆ వివరాలు- భారతీయ సామాజిక సంస్కరణ సాహిత్యంలో ఓ క్లాసిక్‌గా పరిగణించబడే తన ‘గులాంగిరి’ (బానిసత్వం)లో సోదాహరణలతో పేర్కొన్నారు. పోనీ.. బ్రాహ్మణవాదులు ఆరోపిస్తున్నట్టు ఫూలే బ్రాహ్మణ వ్యతిరేకా? అసలు కానేకాదు. ఆ రోజుల్లో.. పెళ్లయిన కాశీబారు అనే యువతి అనతికాలంలోనే భర్త చనిపోతే.. అప్పటికే గర్భవతి అయిన ఆమె.. అబార్షన్‌ ప్రయత్నాలన్నీ విఫలం కాగా.. ప్రసవించిన అనంతరం ఆమె ఆ బిడ్డను చంపి బావిలో పడేసిన ఉదంతం ఫూలేను తీవ్రంగా కదిలించింది.

‘భర్త చనిపోయాక బిడ్డను ఎలా కంటావ్‌’ అని పాలకులు ఆమెను జైల్లో పెడతారు. వితంతువులు సంతానం కనడాన్ని అప్పటి పాలకులు నిషేధించారు. ఫూలే దంపతులు అలాంటి వితంతువులు తమ బిడ్డల్ని చంపుకునే దౌర్భాగ్య స్థితి నుంచి తప్పించడానికి – అనాథ శరణాలయం ఏర్పాటు చేసి.. ఎందరో అభాగ్య బ్రాహ్మణ యువతుల జీవితాలను కాపాడారు. ఫూలే దంపతులకు సంతానం లేకపోతే.. ఓ బ్రాహ్మణ వితంతు కుమారుడు యశ్వంతరావును దత్తత తీసుకున్నారు. అలాంటి ఫూలేను బ్రాహ్మణ వ్యతిరేకి అని ఎలా ముద్ర వేస్తారు? బ్రాహ్మణ దర్శకుడు తీసిన సినిమాను బ్రాహ్మణవాదులే అడ్డుకోవడం ఇక్కడ ‘విశేషం’. చిత్ర కథా నాయకుడు.. టైటిల్‌ రోల్‌ను ప్రతీక్‌ గాంధీ, సావిత్రీబారు ఫూలే పాత్రను పాత్ర లేఖ పాల్‌ పోషించారు.

సినిమాలో కట్స్‌ వేసినంత తేలికా చరిత్రలో వాస్తవాల్ని మరుగుపర్చడం..? ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సోషల్‌ రివల్యూషన్‌’గా గణుతికెక్కిన ఫూలే జీవితాన్ని ఈ తరం.. రానున్న తరాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చరిత్ర పుటల్ని చింపేస్తే ‘ఫూలేలు’ మరుగునపడి పోతారనుకుంటే అంతకుమించిన భ్రమ మరోటుండదు. ఫూలే కాలం నాటి పీష్వాలు ఇప్పుడు లేరేమో.. కానీ, సమాజంలో సమానత్వాన్ని జీర్ణించుకోలేని వ్యక్తుల్ని తరచూ గమనించొచ్చు. ప్రజల్ని కలిపి ఉంచడానికి రాజకీయాలు గానీ విడదీసి కొట్టుకునేలా ఈర్ష్యా ద్వేషాలు పెంచడానికి.. తద్వారా ఓట్లు నొల్లుకోవడానికి కాదు. ఏ కళారూపాలయినా జన జాగృతికే దోహదపడాలి. సమాజ హితాన్నే కాంక్షించాలి. ప్రజా చైతన్యాన్ని పెంచాలి. మూఢత్వాన్ని దునుమాడాలి. విస్తృత ప్రజా ప్రత్యక్ష/ పరోక్ష భాగస్వామ్యంతో ప్రజా కళలు వర్ధిల్లాలి. చారిత్రక వాస్తవాల్ని కప్పెట్టే ఏ చిన్న ప్రయత్నాన్నైనా.. ఏ తరహా కుట్రల్నైనా సామూహికంగా, శాస్త్రీయ దృక్పథంతో ప్రతిఘటించాల్సిందే! (ఏజెన్సీలు/సోషల్ మీడియా/ప్రజాశక్తి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X