Hyderabad: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించదల్చిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కోసం సోమవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ సి.నారాయణరెడ్డి లతో కలిసి పలు స్థలాలను పరిశీలించారు. పాత కలెక్టరేట్ వెనుక భాగంలో ఆర్ అండ్ బీ కార్యాలయం నుండి ఎన్ఠీఆర్ చౌరస్తా, మున్సిపల్, ఎంపిడిఓ కార్యాలయాలకు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ క్వాటర్లను క్షేత్రస్థాయిలో కాలినడకన సందర్శిస్తూ నిశితంగా పరిశీలించారు.
చుట్టుపక్కన గల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఆయా సముదాయాల గురించి అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై తన వెంట ఉన్న ఎమ్మెల్యేలతో, జిల్లా అధికారులతో ప్రాథమికంగా చర్చించారు. సకల సదుపాయాలతో ప్రజలకు అన్నివిధాలుగా ఉపయోగకరంగా ఉండేలా అనువైన ప్రదేశంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట మేయర్ నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఆర్టీసీ ఆర్ ఎం ఉషా తదితరులు ఉన్నారు.