హైదరాబాద్ : గత వారం రోజులుగా కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు ఢిల్లీలో నిరసనల పేరిట చేస్తున్న డ్రామాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. దేశంలో అరాచకం సృష్టించేందుకు.. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్ష పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయి. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ లో అన్నారు.
కేంద్రమంత్రి మాట్లాడుతూ వీరంతా కలిసి దేశ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో.. పరమ అసహ్యంగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ తన స్థాయిని మరిచి, అధమ స్థాయికి దిగజారి వ్యవహరిస్తున్నారు. దీన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో లోక్ సభ స్పీకర్ రాజీనామా చేయాలని పార్లమెంటులో హైడ్రామా నడిపి, నవ్వుల పాలయ్యారు. ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా అన్నారు. ఇప్పుడేమో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా,అజిత్ దోబల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మా టార్గెట్ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.
మోదీ సర్కారును కూలదోయడమే తమ టార్గెట్ అంటున్నారు. ప్రతిపక్ష పార్టీగా అలా అనుకోవడంలో తప్పు లేదు.. కానీ దాని కోసం నైతిక విలువను వదిలిపెట్టి.. దేశంలో ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరించడం దారుణం. ఇప్పుడు తమకు అనుకూలంగా తీర్పులు రాలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా గద్దెదిగాలని అంటోంది. 60 ఏళ్లు పాలించిన పార్టీ మానసిక స్థితి ఏ రకంగా ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ఓడిపోతే ఎన్నికల కమిషన్, సుప్రీం కోర్టు బాధ్యత వహించాలా? ఎన్నికల కమిషనర్, CJI కాంగ్రెస్ ను ఎన్నికల్లో గెలిపించాలా?
Also Read-
ప్రజల మద్దతు లేకపోవడంతో మీరు ఎన్నికల్లో ఓడిపోతున్నారు.. దానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలా బాధ్యత వహిస్తారు. మీకు అనుకూలంగా ఆదేశాలను ఇవ్వలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను బెదిరిస్తారు. ఆయనపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తారు. వేలాది మంది ర్యాలీగా వెళ్లి ఒత్తిడి తీసుకురావడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. మీరు ఎన్నికల్లో ఓడిపోతున్నారని.. ప్రధానమంత్రిని, హోంమంత్రిని బెదిరిస్తున్నారు. దేశం ఏమైనా సోనియా కుటుంబం ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీయా?
ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకునే హక్కు, అధికారం 140 కోట్ల ప్రజలకు ఉంది. మీ పార్టీకి ప్రజలు ఓటేయకపోతే ఎన్నికల కమిషన్ ను బాధ్యులను చేయడం సరికాదు. దేశంలో కాంగ్రెస్ రాచరికం సాగదు.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా వ్యవస్థలు పనిచేస్తాయి. ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. రాహుల్ గాంధీ అనుకున్నట్లు, విదేశీ శక్తులు అనుకున్నట్టు దేశంలో వ్యవస్థలు నడవవు.
తమకు 200 మంది అధికారులు టచ్‌లో ఉన్నారని, వారంత ప్రధాని మోదీ గద్దె దిగాలని కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇలా మాట్లాడి ఎవర్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు? SIRలో తొలగించిన ఓట్లలో.. తప్పులుంటే ఎందుకు ఆధారాలు చూపించాలి. తప్పులను గుర్తించి, సరిదిద్దాల్సిన బాధ్యత మనందరిదీ. దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్‌ల వారీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన BLAలు ఉన్నారు. ఆయా రాష్ట్రప్రభుత్వాల అధికారులు ఎవరి ఓట్లను అయినా కావాలని తొలగిస్తే.. తప్పును సరిదిద్దేందుకు BLAలకు అవకాశం ఇచ్చింది. మీ పార్టీ BLAలు ఏం చేస్తున్నారు. స్థానికంగా తప్పులను సరిదిద్దే అవకాశం ఉంది. అంతేకానీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనేవిధంగా రాహుల్ గాంధీ వ్యవహార ధోరణి ఉంది.
SIR ద్వారా 2.8 కోట్ల మంది చనిపోయినట్లు తేలింది. చనిపోయిన వారి ఓట్లను ఉంచితే ఎవరు వచ్చి ఓటు వేస్తారు. మీరే చెప్పాలి. ఆ ఓట్లను తొలగించాల్సిన బాధ్యత అధికారులది, పార్టీలది కాదా? 6.3 కోట్ల మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. వారు ఉంటున్న ప్రాంతంలోనే ఓటు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది. కోటి మందికి రెండు చోట్ల ఓట్లున్నాయి. వారందరికీ రెండు ఓట్లు కొనసాగించాలా? రాహుల్ గాంధీ, ధర్నాలు చేస్తున్న అపరిపక్వ నేతలు సమాధానం చెప్పాలి. 3 కోట్ల ఓట్లకు సంబంధించి.. అసలు వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు.
ఓట్లు పోయాయని గగ్గోలు పెడుతున్న నేతలు.. మీ పార్టీల BLAలు ఏం చేస్తున్నారో అడగండి. ఢిల్లీలో ఊరేగింపులు చేస్తే ఓటు రాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నది మీ అధికారులే కదా..? క్షేత్రస్థాయిలో రాజ్యాంగబద్ధంగా పోరాడితేనే మీకు ఓటు వస్తుంది. ఓట్లు పోయిన వారు ఎంతమంది మీ ధర్నాల్లో పాల్గొన్నారు? ఒక్కరినైనా చూపించగలరా? ఆడలేక మద్దెల ఓడిందన్నట్లు.. ప్రజల సమస్యలపై పోరాడే సత్తాలేక, నరేంద్రమోదీ గారు చేసే మంచి పనులను ఎత్తిచూపలేక.. ఏం చేయాలో అర్థం కాక.. ఇలాంటి పనికిమాలిన ధర్నాలు చేస్తున్నారు.
EVMలమీద, SIR మీద బురదజల్లుతున్న కాంగ్రెస్ పార్టీ.. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటీవల బ్యాలెట్ పేపర్ మీద జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు, జ్ఞానేష్ కుమార్‌కు, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధం లేదు కదా? ఎందుకు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగవుతోంది? గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందుతోంది. దీనికి కూడా సీఈసీ, సీజేఐయే కారణమని చెబుతారా?
2014లో వీరేవరూ లేరు కదా మీరెందుకు ఓడిపోయారు. 2019, 2024లో ఎస్ఐఆర్ లేదు కదా అప్పుడు మీరెందుకు ఓడిపోయారు. SIR తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో మీరు గెలిచారు కదా.. తమిళనాడు, కేరళలో SIR కేరళలో చాలా ఉపయోగపడిందని, బోగస్ ఓటర్లను తొలగించారని, ఎన్నికల్లో తాము గెలిచేందుకు దోహదపడిందని రమేశ్ చెన్నితల చెప్పారు. అప్పుడు మంచిగా అనిపించిన SIR.. ఇప్పుడు ఎందుకు SIR తప్పుగా కనిపిస్తోందా? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు?
ఒంటెద్దు పోకడతో ఒక వ్యక్తి వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ వ్యవహారం, పార్టీ తీరు, అవినీతిని ప్రజలు నచ్చడం లేదు. మన్మోహన్ సింగ్ గారిని, పీవీ నర్సిహారావు, అంబేద్కర్, జగ్జీవన్ రాం, ఎన్టీరామారావుకు కాంగ్రెస్ చేసిన అవమానాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. అందుకే ప్రజలు మీకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారు.
నాలుగు రాష్ట్రాల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ నామరూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేశంలో ఈవీఎంను మొదటగా ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయే కదా.. ఇప్పుడు మీరే ఈవీఎంలపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం.
ఢిల్లీని వారం రోజులుగా కాంగ్రెస్ దాని జేబు సంస్థ అయిన సీజేపీ కలిసి జామ్ చేశాయి. దసరా, దీపావళి, నవరాత్రుల సీజన్ సమయంలో పండుగ వస్తువులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఢిల్లీ మార్కెట్ దెబ్బతిన్నది. చిన్న చిన్న దుకాణదారులు మొరపెట్టుకుంటున్నారు. జంతర్ మంతర్ ను మార్చాలని వేడుకున్నారు. ఎవరు ఏం చేస్తారో తెలియక, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని వాపోతున్నారు. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా ఢిల్లీ ప్రజల రోజువారీ జీవనాన్ని అస్తవ్యస్తం చేశారు.
రాహుల్ లాగే సీఎం రేవంత్ కు కూడా ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. రాహుల్ గాంధీ గజం ఎగిరితే.. నేను రెండు గజాలు ఎగురుతానంటూ రేవంత్ రెడ్డి ఎగిరెగిరి పడుతున్నారు. పేదల ఓట్లు, ఆదివాసీల ఓట్లు, దళితుల ఓట్లు, మైనారిటీల ఓట్లు తీసేస్తున్నారంటూ రేవంత్.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 80 శాతం మైనారిటీలు ఉన్న పశ్చిమబెంగాల్, అస్సాంలో బీజేపీ గెలిచింది. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీ, దేశ స్వాతంత్ర్య ఉద్యమం చేసిన పార్టీ.. పేదరికాన్ని, కుల,మత, జాతి, భాష, ధనిక, పేద, ఉత్తర, దక్షిణం పేరుతో విభేదాలను సృష్టించి ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో బీజేపీ ఏదైనా ధర్నా చేయాలని చూస్తే.. రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా అనుమతివ్వకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఢిల్లీలో మాత్రం ఇలా ధర్నాలు చేస్తూ.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఒక నీతి.. ఢిల్లీలో ఒక నీతా?
1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పోలీసుల ద్వారా తుపాకులతో 369 మంది విద్యార్థులను హైదరాబాద్ నగరం చుట్టుపక్కల కాల్చి చంపిందెవరు? ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో 1200 మందికి పైగా ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాల కారణం కాదా? తెలంగాణ మలి ఉద్యమం సమయంలో యాదిరెడ్డి ఢిల్లీ వచ్చి సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాసి బలిదానం చేసుకున్న విషయం మర్చిపోయారా? అమెరికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ధర్నా చేసుకునేందుకు అనుమతి ఇచ్చాం. అలాంటి మాకు మీరు నీతులు చెబుతున్నారు.
బీసీల్లో ముస్లిం మైనారిటీలను చేర్చి.. ముస్లిం బీసీలు, హిందూ బీసీలను వేర్వేరు చేసి.. వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 60 ఏళ్లపాటు ఈ వర్గాలన్నింటినీ పేదరికంలోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ. పేదలకు ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ అని మోచేతిపైన బెల్లం పెట్టి మోసం చేసింది. మోదీ గారు 12 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారు.
SIR లో.. చనిపోయిన వారు, బంగ్లాదేశీయులు, ఇతర అక్రమ ఓటు హక్కు దారులను తొలగించడం తప్పా? మీరు అధికారంలో ఉన్న తెలంగాణలో SIR చేపడుతున్నది.. మీ నేతృత్వంలోని ప్రభుత్వ అధికారులే. వాళ్లను అడిగితే అన్నీ చెబుతారు. వీళ్ల పిలుపుకు భారత్‌లో స్పందన లేదు కానీ.. బంగ్లాదేశ్‌లో హిందువులను ఊచకోత కోస్తున్న ఉన్మాదులు మాత్రం వీళ్లకు మద్దతుగా ఊరేగింపులు చేస్తున్నారు. భళా రాహుల్ గాంధీ.. నీకు పాకిస్థాన్, బంగ్లదేశ్ నుంచి మద్దతు వస్తోంది.
రాముడు-శివుడు అని, మేము రాముడు- వాళ్లు రావణుడు అంటాడు. ఒకరేమో శివతాండవం అంటున్నడు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే రాముడు, శివుడి గురించి మాట్లాడటం లేదు. మీరు బంగ్లాదేశ్, అమెరికా, ఇటలీ దేవుళ్ల పేర్లను ఎత్తుకోండి. అవే మీకు సెట్ అవుతాయి.
తెలంగాణలో రైతులు నీళ్లులేక, పరిశ్రమలు, ప్రజలు కరెంట్ కోతలతో.. ఇబ్బందులు పడుతుంటే.. వారానిక ఓసారి ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీని పొగిడి వెళ్తుంటారు. ఇటీవల రాహుల్ గాంధీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్లారు. SIRలో అక్రమాలు జరిగాయని ఇచ్చిన నివేదికను వారు వ్యతిరేకించలేదని, అందుకే ఆమె ఒప్పుకొన్నట్టు రాహుల్ గాంధీ వింతగా మాట్లాడుతున్నారు. గతంలో శ్రీ మనోహర్ పారికర్ గారు అనారోగ్యంగా ఉన్న రోజుల్లోనూ పరామర్శకు వెళ్లి.. బయటకు వచ్చి రఫేల్ అక్రమాలను వారు అంగీకరించారని రాహుల్ మాట్లాడారు. దీంతో పాపం ఆ టాపిక్ తమ మధ్య చర్చకు రాలేదని పారికర్ గారు చెప్పుకోవాల్సి వచ్చింది. ఫ్రాన్స్ అధ్యక్షుడితో కూడా మాట్లాడానని కూడా చెప్పుకున్నారు. కానీ అది కూడా అబద్ధమని ఫ్రాన్స్ అధ్యక్షుడు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. నిన్న ప్రెగ్నెంట్ జర్నలిస్టును నెట్టేయడంతో ఆమె ఆస్పత్రి పాలయ్యారు. కర్ణాటక సీఎం శివకుమార్ ను నెట్టేశారు. కర్ణాటక ప్రజల ఆత్మ గౌరవం కాంగ్రెస్ కాళ్ల మీద పడేశారు. కాంగ్రెస్ కార్యకర్తను పిడిగుద్దులు కురిపిస్తుంటే ప్రియాంక గాంధీ నవ్వుతున్నారు.
ఓ మహిళా పోలీసు అధికారిని కూడా ప్రియాంక గాంధీ మోచేతితో కడుపులో గుద్దింది. మరో మహిళా అధికారి విషయంలో రాహుల్ గాంధీ ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు. ఇంతకన్నా నీచమైన పని ఇంకొకటి ఉండదు. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఓ మహిళా ఉద్యోగి పట్ల ఇలా వ్యవహరించడం దారుణం.
రాహుల్ గాంధీ బారికేడ్లు ఎక్కి డ్యాన్సులు చేస్తున్నాడు. ఇలాంటి నాయకుడిని దేశ ప్రజలు భరించాలా? గత ఎన్నికల సమయలో కూడా రాజ్యాంగం మారుస్తారంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు యూపీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల మద్దతు కూడగట్టుకోలేక.. మోదీ గారిని ఓడించలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. నిందలు వేస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థను, అభివృద్ధిని, పెట్టుబడులను, శాంతిని భగ్నం చేసి దేశాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం.. దేశ, అంతర్జాతీయ శక్తులు చేస్తున్నాయి.
ఒక్క రోజే 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వచ్చి వెనక్కి వెళ్లారు. ఇదంతా రాహుల్ గాంధీ ఘనత. అది సీఈసీకి సంబంధించిన విషయం. ప్రతి ఓటుకు సంబంధించి నోటీసులు అందజేశాం. కేరళలో, తమిళనాడులో, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో గెలిచినప్పుడు గుర్తురాలేదా? టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ధర్నా చౌక్ ఎత్తేసి, ఎక్కడా ధర్నా చేసుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ కేంద్రప్రభుత్వం మూడు ప్రాంతాల్లో ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చింది.
గతంలో ధర్నా పేరుతో అరాచకం సృష్టించారు. శాంతి భద్రతలకు భంగం కలించారు. అందుకే ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దనే ఉద్దేశంతోనే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. ఏదైనా జరగకూడనిది జరిగితే.. దేశ గౌరవం ఏమవుతుంది? మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. అంతేకానీ జంగిల్ రాజ్‌గా చేయాలని చూడటం దారుణం.
ఒక వ్యక్తి అమెరికా నుంచి వచ్చి నెల రోజులు ధర్నా చేసుకుంటామంటే అనుమతిచ్చాం. మన దేశం అంటే ప్రపంచంలో ఓ గౌరవం ఉంది. దీన్ని దెబ్బతీసేందుకు విదేశీ శక్తులు, మన దేశంలోని కొందరు కలిసి కుట్రపన్నుతున్నారు. ఈ తరం యువతీ యువకులకు కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి తెలియక.. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. వారికి నిజానిజాలు చెప్పాల్సిన బాధ్యత మనందరిదీ. సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో కూడా 9 లక్షల ఓట్లను తొలగించారు. వారిలో చాలామందికి రెండుచోట్ల ఓట్లున్నాయి. అందుకే వారి ఓట్లు తొలగించి వారి గ్రామాల్లో ఉంచారు. ప్రజాస్వామ్యంలో ఒక్కరికి ఒకే ఓటు ఉండాలి. డూప్లికేట్ ఓట్లను తొలగించడంలో తప్పేముంది?
