42 శాతం రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము
బీసీల సంక్షేమ పథకాలకు ప్రభుత్వం తూట్లు
బీసీ సంక్షేమం కోసం ఎన్ని నిధులు ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ
ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ మరియు విశ్వకర్మ కుల సంఘం నాయకులు
హైదరాబాద్ : కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
మంగళవారం నాడు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు మరియు విశ్వకర్మ కుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… బీసీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను కుదేలు చేస్తున్నదని విమర్శించారు. కుల వృత్తుల వారికి ప్రభుత్వం కనీస మద్ధతు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read-
అత్యధికంగా బీసీ విద్యార్థులు లబ్దీపొందే ఫీజు రియింబర్స్ మెంట్, పూలే స్కాలర్ షిప్ పథకాల నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. బీసీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐక్యతను చాటి హామీల అమలుకు ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పారు