ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సిబిఐకి అప్పగిస్తే సంబరాలు చేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై విరుచుకుపడిన కేటీఆర్

దొంగల ముసుగులు తొలగిపోయాయి

స్కామ్ లోని స్వామీజీలతో సంబంధం లేదన్న వాళ్ళు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు

మాకు సంబంధం లేదని భుజాలు తడుముకున్నోళ్లు… దొంగలను భుజాలపై మోస్తున్నారు

కుట్ర కేసు తమ జేబు సంస్ధ సిబిఐకి చిక్కినందుకే కిషన్ రెడ్డి సంబరమా అని ప్రశ్న

ఒకప్పుడు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్… ఇప్పుడు సెంట్రల్ బిజెపి ఇన్వెస్టిగేషన్ అయింది

సిబిఐ దర్యాప్తుతో పాటు దొరికిన దొంగలపై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలపై బీజేపీపై ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ విచారణ ప్రారంభమైంది

తమ అసమర్ధ పాలనతో ప్రజాక్షేత్రంలో బదనమైన బిజెపిని బద్నాం అయింది

హైదరాబాద్: హైకోర్ట్ ఎమ్మెల్యేల కోనుగోలు కేసును సిబిఐకి బదిలీ చేయాలని ఇచ్చిన తీర్పుపైన సంబరాలు చేసుకున్నకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి పార్టీ తీరుపైన బిఅర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారాక రామారావు మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తే ‘బీజేపీ విజయం’ అని సంబరాలు చేసుకోవడంలో మర్మం ఏంటో చెప్పాలన్నారు. ఇన్నాళ్లు కలుగులో దాక్కున్న ఎలుకలు మెల్లిగా బయటకు వచ్చాయని, దొంగలు తమ నిజమైన రంగులు బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు.

స్కాములో దొరికిన స్వామీజీలతో అసలు సంబంధమే లేదన్నోళ్లు… ఈ కుట్ర కేసు సీబీఐకి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకుంటున్నరని సూటిగా ప్రశ్నించారు. మీ బండారమంతా కెమెరా కన్నుకు చిక్కినప్పుడే.. మీ వెన్నులో వణుకు మొదలైందని, అప్పుడు భుజాలు తడుముకున్న మీరు… ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారన్నారు. మీకు ఏ సంబంధం లేకపోతే పలుమార్లు కోర్టుల్లో ఈ కేసు దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేశారన్నకేటీఆర్, సీబీఐకి అప్పగిస్తే అంత ఖుషీ ఎందుకు కిషన్ రెడ్డి గారు, మీ జేబు సంస్థ చేతికి కేసు చిక్కినందుకేనా… ఈ పట్టలేనంత సంతోషం?

‘పంజరంలో చిలుక’ మీరు చెప్పినట్టే పలుకుతుందని చెప్పకనే చెబుతున్నారా? కేసు సీబీఐకి వెళితే… మీ ‘బారా ఖూన్ మాఫ్’ చేసి క్లీన్ చిట్ ఇవ్వడం పక్కా అని, ఇంత పబ్లిగ్గా మాట్లాడుతారా? సీబీఐ సహా వ్యవస్థలన్నింటినీ సంపూర్ణంగా భ్రష్టుపట్టించిన తీరుకు మీ నిస్సిగ్గు ప్రకటనలే నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు సిబిఐకి కేసు ఇస్తే నిందితులు భయపడే పరిస్థితి ఉండేదని, ఇవ్వాళ సిబిఐకి కేసు అప్పజెప్తే సంబరాలు చేసుకుంటున్నారంటేనే, ఆ సంస్థను బిజెపి హయాంలో ఎంత నీరుగార్చారో అర్థమవుతుందని కేటీఆర్ అన్నారు.

కెమెరాల సాక్షిగా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిన దొంగలు మీరని, రెడ్ హ్యాండెడ్‌గా దొరికి ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు బిజెపి వ్యవహారం ఉందన్నారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో బిజెపి కాంగ్రెస్ నే మించిపోయిందని, ఒకప్పుడు సీబీఐని… కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే వాళ్లని, ఇప్పుడు దేశప్రజలు సీబీఐని… సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అంటున్నారన్నారు. సీబీఐ దర్యాప్తుతోపాటు… దొరికిన దొంగలపై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు కూడా సిద్ధమా? కేటీఆర్ సవాల్ విసిరారు. దొరికిన ముగ్గురు దొంగలకు లై డిటెక్టర్ టెస్టులు చేస్తే వాళ్లకూ… మీకు వున్న బంధం ఏంటో తేటతెల్లమైతది… మీరు దానికి సిద్ధంగా వున్నరా? అన్న కేటీఆర్ దమ్ముంటే ఈ సవాల్ కు స్వీకరించాలన్నారు.

అధికార బలంతో ఏమైనా చేయొచ్చనే కుటిలనీతి బిజెపిదన్న కేటీఆర్, మీ ఎనిమిదిన్నరేళ్ల పాలనతో మీరు ప్రజాక్షేత్రంలో ఎప్పుడో బద్నాం అయిపోయారు. బీజేపీని కొత్తగా బద్నాం చేయాల్సిన ఖర్మ మాకు లేదని ఎద్దేవా చేశారు. బిజెపి దగ్గర విషయం లేదు కాబట్టే 8 ఏళ్లుగా ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో ‘విషప్రయోగం’ చేస్తున్న మాట నిజంకాదా అన్న కేటీఆర్, బిజెపి దగ్గర సరుకు లేదు కాబట్టే… ఎమ్మెల్యేలను అంగడి సరుకులా కొని… రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న మాట వాస్తవం కాదా? ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగా ఇక్కడా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రచేసి… ‘ఆపరేషన్ లోటస్ ‘ బెడిసి కొట్టి అడ్డంగా దొరికిన దొంగలు బిజెపి నేతలని మండిపడ్డారు.

ఈ దేశంలో గత ఎనిమిదేళ్లలో ప్రజాస్వ్యామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన సిగ్గులేని చరిత్ర మీదని, దొంగలకు సద్దులు మోసిన బిజెపి నేతలు, ఇప్పడు సుద్దులు చెబితే నమ్మేదెవరన్నారు. మీ చేతిలోని కీలుబొమ్మలు సాగించే విచారణ ఎలా ఉంటుందో అందరికీ తెలుసన్నకేటీఆర్, మ్మెల్యేల కొనుగొలు కుట్రల బండారంపై నిజమైన ప్రజాక్షేత్రంలో బిజెపిపై విచారణ ఎప్పుడో ప్రారంభం అయిందన్నారు. నేరం చేసినవాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోలేరన్నారు. ఈ విషయంలో సరైన సమయంలో బిజెపిపై తీర్పు చెప్పేందుకు యావత్ భారత సమాజం కూడా సిద్ధంగా ఉందని కేటీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X