… సాగునీటి కాలువలను పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో, ఉమ్మడి జిల్లాలో సాగునీటి కాలువలను పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ, సివిల్ సప్లై శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు భువనగిరిలో జరిగిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై ఆయన రాష్ట్ర రెవిన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి హాజరయ్యారు.

హెలిపాడ్ వద్ద మంత్రులకు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులు చింతపండు నవీన్ కుమార్, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జనగాం శాసనసభ్యులు పల్లా రాజశేఖర్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే, డిప్యూటీ పోలీస్ కమీషనర్ రాజేష్ చంద్ర, మున్సిపల్ కమీషనర్ పోతాంశెట్టి వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు.

అనంతరం అనాజిపురం శివారులోని బునాదిగాని కాలువను మంత్రి శాసనసభ్యులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి పారుదల ప్రాజెక్టుల పనులను వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షా కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంటు పరిధిలో, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి సస్య శ్యామలం చేస్తానని హామీ ఇస్తున్నానని, అది నా ధర్మమని అన్నారు. బునాదిగాని కాలువకు 269 కోట్లు, పిల్లాయిపల్లి కాలువకు 86 కోట్లు, ధర్మారెడ్డి కాల్వకు 133 కోట్ల అవసరమని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణను శాసనసభ్యులు పూర్తి చేయాలని కోరారు. గత పది ఏళ్లలో అనాలోచిత విధానాలతో లక్ష 80 వేల కోట్లు ఖర్చు చేశారని, మన ప్రభుత్వం వచ్చాక పాత కొత్త కాలువల విభేదాలు లేకుండా అన్ని ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోనికి వచ్చే విధంగా చేస్తామని అన్నారు.

Also Read-

బునాదిగాని, పిల్లయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు ఖచ్చితమైన హామీ ఇస్తున్నామని, ఎన్ని నిధులైన మంజూరు చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు హైదరాబాద్ మూసి ప్రక్షాళన చేస్తామని అన్నారు. శాసనసభ్యులు భూసేకరణ వెంటనే చేస్తే ఒక సంవత్సరంలో పనులు పూర్తి చేయవచ్చని అన్నారు. దేవాదుల ప్రాజెక్టును ఈరోజు సమీక్షించడం జరిగిందని, భవిష్యత్తులో భువనగిరి ప్రాంతానికి దేవాదుల నుండి లక్షల ఎకరాలకు సాగునీళ్లు వస్తాయని, దేవాదుల ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. మేడిగడ్డ కూలడం అతి పెద్ద దుఃఖపూరిత విషయమని, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల పరిస్థితి భవిష్యత్తులో ప్రశ్నార్ధకంగా ఉందని అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్లు, చెక్ డాములు పూర్తి చేస్తామని తెలియజేస్తూ చెరువులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వచ్చి 8 ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయి. 16 సంవత్సరాల క్రితం సోనియాగాంధీ శంకుస్థాపన చేసిన దేవాదులకు ఈరోజు ఉదయం వెళ్లడం జరిగింది. 2026 మార్చి నాటికి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి సోనియా గాంధీతో ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేయడం జరుగుతుంది. దాదాపు 6 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. 31 వేల కోట్ల రుణమాఫీలో భాగంగా 18 వేల కోట్లు ఇప్పటి వరకే మాఫీ చేయడం జరిగిందని, మిగతా 13 వేల కోట్ల రూపాయలు కూడా త్వరగా మాఫీ చేస్తామని, అవసరమైతే ఇంకా 500 కోట్లు ఎక్కువైనా ఇస్తామని అన్నారు. గడిచిన ఉమ్మడి రాష్ట్రంలో 18 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం జరిగిందని, రాబోయే 45 రోజుల లోపు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు నిర్మాణానికి ముగ్గుబోయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రభుత్వం మీది. ప్రజల కోరికలను మన ముఖ్యమంత్రి నాయకత్వంలో పూర్తి చేస్తామని అన్నారు. ధరణి ప్రక్షాళన చేస్తామని, ల్యాండ్ రెవెన్యూ చట్టాన్ని దేశంలోనే రోల్ మోడల్ గా చేస్తామని అన్నారు.

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. సాగునీటితో ఆలేరు, భువనగిరి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. గత పది ఏళ్లలో ఏ ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వలేదని, గంధమల్ల, బునాదిగాని కాలువ, దేవాదుల, టపాస్ పల్లి కాలువలు త్వరితగతిన పూర్తి చేయాలి. 54,000 ఎకరాలకు నీరు అందించే 1.4 టీఎంసీల నిలువ కలిగిన గంధమల్లను 575కోట్లతో, నవాబ్ పేట కాలువ 148 కోట్లతో పూర్తి చేయాలని, టపాస్ పల్లికి నీరు అందిస్తే రాజపేట సస్యశ్యామలం అవుతుందని, కొండపోచమ్మ సాగర్ ద్వారా ఇంకా 20 చెరువులు నింపే అవకాశం ఉందని, ఆ పనులు చేపట్టాలని, యాదగిరిగుట్ట గండి చెరువుకు కూడా నీరు ఇవ్వాలని కోరారు.

భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఈ మూడు కాలువలకు సంబంధించి చివరి వరకు కాలువలు పెంచితే దీర్ఘకాలం ఉపయోగకరంగా ఉంటాయని, భూసేకరణ జరిగితేనే ప్రాజెక్టులు ఫలిస్తాయని, అందుకోసం భూసేకరణకు శాసనసభ్యులు కలిసి కృషి చేయాలని కోరారు.

శాసనమండలి సభ్యులు చింతపండు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రధానంగా గంధమళ్ల ప్రాజెక్టుకు నిధులు కేటాయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లోరైడ్ ఇంకా ఉన్నదని నివేదికలు చెబుతున్నాయని, మూసి వ్యర్థాల వలన అనారోగ్యాలు, మానవాళికి ముప్పు వస్తున్నదని, గంగా ప్రక్షాళన టైపులో మూసి ప్రక్షాళన చేయాలని అన్నారు. స్వచ్ఛమైన తాగు నీరు కోసం ప్రతి పాఠశాలకు నిధులు కేటాయించాలని కోరారు. టపాస్పల్లి రిజర్వాయర్ నుండి రాజపేటకు కాలువ నిర్మాణం చేయాలని, మల్కాపూర్ కాలువను మానాపురం వరకు ఇవ్వాలని, ఆలేరుతో పాటు ఉమ్మడి నల్లగొండలో చెరువుల పూడిక తీయాలని, అదనంగా నిధులు మంజూరు చేయాలని, పనులు శీఘ్రంగా ప్రారంభించి త్వరితగతిన ముగించాలని కోరారు.

భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఈ మూడు కాలువలకు సంబంధించి నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాలువల పనులు వెడల్పు చేస్తున్నారని, తద్వారా ఏడు రెట్ల నీళ్లు అధికంగా వచ్చే అవకాశం ఉందని, మంచి కాంట్రాక్టర్లను నియమించి పనులను త్వరగా పూర్తి చేయాలని, అలీనగర్, భీమలింగం కెనాల్, బొల్లెపల్లి వంటి చిన్న కాలువలు కూడా చేపట్టాలని కోరారు. బస్వాపూర్ 90 శాతం పూర్తి అయిందని, దాని కింద తిమ్మాపూర్, బస్వాపూర్ నిర్వాసితులకు ఆర్ఓఆర్ కింద నష్టపరిహారం నిధులు ఇవ్వాలని కోరారు.

తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ… బునాదిగాని కాలువ పనులకు 269 కోట్లు కేటాయించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అసిఫ్ నహార్ కాలువకు 5 కోట్లు కేటాయించాలి, SRSP కాలువ వదిలి చెరువులు నింపాలి. కేతిరెడ్డి ప్రాజెక్ట్ కాలువ తీస్తే 8 గ్రామాలలో 30 వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది. అమ్మనబోలు నుండి చిత్తలూరు వరకు 5 చెక్ డ్యాములు ఏర్పాటు చేస్తే దాదాపు లక్ష ఎకరాలు సాగులోకి వస్తుంది. రుద్రమచెరువును రిజర్వాయర్ చేయాలి.శాలిగౌరారం, మాదారం, ఇటికిలపాడు ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలి. ఎస్సార్ ఎస్పి 27 కిలోమీటర్ల లైనింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. రైతు క్షేమం కోరే ప్రభుత్వానికి అండగా రైతుల నుండి భూసేకరణకు శాసనసభ్యులమంతా కృషి చేస్తాము.

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రైతాంగం మేలు కోసం అనేక పనులు చేయడం జరిగింది. గత ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో కాలేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్ష కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, కానీ ఒక్క రూపాయి కూడా ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టలేదని అన్నారు. ఈ ప్రాంతానికి కృష్ణా, గోదావరి లేదని, బస్వాపూర్ ద్వారా గోదావరి జలాలు వస్తే రైతులకు న్యాయం చేసిన వారమవుతామని అన్నారు. మూసి వలన ఇక్కడ కాలలుష్యం పెరిగిందని, ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మంత్రిగారు వ్యక్తిగతంగా సాగునీటికి కృషి చేయాలని కోరారు. కాలువల వెడల్పు పనుల ద్వారా పిల్లాయిపల్లి కాలువ 56వేల ఎకరాలకు, అలాగే ధర్మారెడ్డి కాలువను 30 వేల ఎకరాలకు పెంచవచ్చని అన్నారు. ఇందుకోసం దూరదృష్టితో తిరిగి డిజైన్లను తయారు చేయాలని, బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువల వెడల్పు, లైనింగ్ స్ట్రక్చర్స్ చేస్తే ఎక్కువ మంది రైతులకు న్యాయం కలుగుతుందని అన్నారు. మూసి వలన ఈ ప్రాంత వాసులు నష్టపోతున్నారని, దీనికి చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వంలో 10 శాతం పనులు కూడా కాలేదని అన్నారు. అలాగే డిండి లిఫ్ట్ ద్వారా మునుగోడుకు నీరు అందించాలని కోరారు.

ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. శివన్నగూడెం ప్రాజెక్టు ద్వారా నాలుగు మండలాలకు సంబంధించిన సాగునీటి పనులు పూర్తి చేయాలని కోరారు.

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ… నకిరేకల్ నియోజకవర్గం 80 శాతం మూసి కిందనే ఉందని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, రాచకొండ కాలువలే ఆధారమని అన్నారు. ఇప్పటి వరకు సరైన వర్షాలు కూడా పడలేదని, ఐటిపాముల లిఫ్టు పనులు 100 కోట్లతో చేపట్టాలని, బ్రాహ్మణవెళ్ళాం ప్రాజెక్టు ద్వారా 61వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి, అందుకు 250 కోట్లు అవసరమని తెలిపారు. పానగల్లు నుండి ఐటిపాములకు నీళ్లు వస్తే చెరువులు నింపవచ్చని, కాబట్టి సాగు నీరు విడుదల చేయాలని కోరారు.

జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ధర్మసాగర్ నుండి గండిరామారం లిఫ్ట్ పనులు చేయాలని, 90 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయని, 207 కోట్లతో పనులు చేయవచ్చునని, 500 చెరువులను కూడా నింపవచ్చని, నిధులను మంజూరు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X