ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డా కె లక్ష్మణ్ MP బహిరంగ లేఖ, విషయం…

శ్రీయుత చంద్రబాబు నాయుడుకి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్.

ఆర్యా…

విషయం: తిరుమల దేవస్థానంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు, శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, తిరుమల పవిత్రతనుకాపాడాల్సిందిగా వినతి.

ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మీకు శుభాభినందనలు. మీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, అభివృద్ధి పథంపై అగ్రపథాన పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆరాధ్యులు. దేశవిదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు శ్రీవారిని దర్శించుకొని,మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పవిత్ర తిరుమలకు అవినీతి మకిలీఅంటుకున్నది, భక్తుల సౌకర్యాలు మృగ్యమయ్యాయి, అన్యమతాల ఉనికితో సనాతన ధర్మానికి విఘాతం వాటిల్లింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుమల పవిత్రతను కాపాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, తిరుమల ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు క్రింది చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

ఇది కూడ చదవండి-

 1. గత కొంతకాలం వరకు తిరుమల తిరుపతి దేవస్థానం లో అనేక అవినీతి అరోపణలు వచ్చాయి. టీటీడీ అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
 2. అర్హతలను బట్టి కాకుండా సొంత మనుషులతోటీటీడీని నింపారు. ఇందులో అన్య మతస్థులు కూడా ఉండడం దారుణం. టీటీడీని ప్రక్షాళన చేసి అన్య మతస్థులను తక్షణమే తొలగించాలి. అర్హతలను అనుసరించి హిందువులతో టీటీడీ నియామకాలు చేపట్టాలి.
 3. శ్రీవాణి ట్రస్టుకు రూ.10,000 విరాళం ఇస్తే సామాన్య భక్తులకు కూడా వీఐపీ దర్శనం కల్పించేవారు. ఇలాభక్తుల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది? ఇది పక్కదారి పట్టిందా.. లేక సక్రమంగా వినియోగం జరిగిందా విచారణ జరిపించాలి.
 4. అధికారంలో ఉన్నవాళ్లు తమకు కావాల్సిన వాళ్లకుటీటీడీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. కొనుగోళ్లలో కమిషన్లు నొక్కేశారు. ముఖ్యంగా అన్నదానానికి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఇందుకు ప్రతిఫలంగా టీటీడీ పెద్దలకు భారీగానే చెల్లించుకున్నారని ఆరోపణలు వినిపించాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పక్కదారి పట్టిన సొమ్మును తిరిగి వసూలు చేయాలి.
 5. శ్రీవారికి భక్తులు ఇచ్చిన కానుకలు, విరాళాలు, హుండీ ఆదాయంపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలి. పక్కదారి పట్టినట్టు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
 6. గత ప్రభుత్వంలో భక్తిని వ్యాపారమయంగామారుస్తూ వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్లు గణనీయంగా పెంచారు. వ్యాపార కోణంలో కాకుండా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని దర్శనం టికెట్ల ధరలు నిర్ణయించాలి.
 7. ఉచిత దర్శనానికి పరిమితి విధిస్తున్నారు. ఆ రోజు పరిమితి దాటి భక్తులు వస్తే, వారిని అక్కడే నిలిపివేస్తున్నారు. ఉచిత దర్శనంపై పరిమితి ఎత్తేయాలి. అందరినీ దర్శనానికి అనుమతించాలి. ఉచిత దర్శన వ్యవస్థను మెరుగుపర్చాలి.
 8. టీటీడీ వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెంచారు. దీనిని పరిశీలించి, భక్తులకు అందుబాటులో ఉండే అద్దెలను నిర్ణయించాలి.
 9. ఆన్ లైన్ వ్యవస్థలో గందరగోళాన్ని నివారించాలి. దర్శనం స్లాట్ బుకింగ్, రూమ్ బుకింగ్ వంటివి సామాన్య భక్తులు కూడా యాక్సెస్ చేసేలా సింప్లిఫైడ్ఆన్ లైన్ వ్యవస్థను తీసుకురావాలి.
 10. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకూడదన్న మంచి ఆలోచనతో దివంగత ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు టీ, కాఫీ, టిఫిన్, లంచ్, డిన్నర్ వంటివి సమయానుగుణంగా, నాణ్యంగా అందేవి. కానీ గత ఐదేళ్లుగాక్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నపానీయాలు సక్రమంగా అందడం లేదు. ఇచ్చేవి కూడా నాణ్యతారాహిత్యంగా ఉన్నాయి. గంటల పాటు క్యూలైన్లలో ఉన్న భక్తులకు నాణ్యమైన అన్నపానీయాలు అందించాలి.
 11. తిరుమలలో పారిశుద్ధ్యం లోపించింది, మెరుగుపర్చాలి. ఆలయ పరిసరాలు, క్యూకాంప్లెక్స్, కంపార్ట్ మెంట్లు తదితర ప్రాంతాల్లో తిరుమల పవిత్రతను కాపాడేలా పరిశుభ్రతను నెలకొల్పాలి.
 12. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీవారి ప్రసాదం లడ్డు నాణ్యత క్షీణిస్తూ వచ్చింది. ఒకప్పుడు తిరుపతి లడ్డూ నెల రోజులయినా సరే సువాసనతో, నాణ్యతతో ఉండేది. ఇప్పుడు రెండు రోజులకే లడ్డూ పాచిపోతుంది. రుచి కూడా తగ్గిపోయింది. తిరుపతి లడ్డూ నాణ్యతను, రుచినిపునరుద్ధరించాలి.
 13. గతంలో గంజాయి, మద్యం, మాంసాహారం తిరుమల కొండపైకి తీసుకొచ్చి దేవస్థానాన్ని అపవిత్రం చేసిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి వాటిని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి.
 14. తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధం. కానీ నిఘా వైఫల్యంతో గత ఐదేళ్లలో అన్యమత ప్రచార కార్యక్రమాలు సాగాయి. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ అన్య మత ప్రచారానికి సంపూర్ణంగా అడ్డుకట్ట వేయాలి.
 15. అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకుంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిన ఆనవాయితీ ఉండేది. గత ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. దీనిని పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకోవాలి.
 16. పురావస్తు శాఖ అనుమతి లేకుండా తిరుమలలోని దాదాపు 800 ఏండ్ల నాటి ప్రాచీన పర్వెట మండపాన్ని గత టీటీడీ పాలక వర్గం కూల్చివేసింది. అలిపిరి దగ్గర ఉన్న పడాల మండపాన్ని కూడా కూల్చివేసే ప్రయత్నం చేసింది. అధ్యాత్మిక, ప్రాచీన వైభవానికి ప్రతీకలైన కట్టడాలన కూల్చిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.
 17. రాజకీయ ప్రయోజనాల కోసం రూ.150 కోట్ల టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్ల కోసం వినియోగించారు. ఇష్టారీతినటీటీడీ నిధుల బదలాయింపును అడ్డుకోవాలి.
 18. టీటీడీరాష్ట్ర ప్రభుత్వానికి అందించే ఆర్థిక సాయాన్ని ప్రతి ఏడాది రూ.2.5 కోట్ల నుంచి ఒక్కసారిగా రూ.50 కోట్లకు పెంచారు. దీనిని పరిశీలించాలి. ఇలా టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన సాయం అన్య మతాలకు వినియోగం కాకుండా చూడాలి.
 19. గతంలో ‘‘మన గుడి’’ కార్యక్రమం కింద హిందూ ఆలయాల నిర్మాణాలకు టీటీడీ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించేది. గత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. దీనిని పునరుద్ధరించాలి.
 20. తిరుమల ఏడు కొండల పర్యావరణాన్ని పరిరక్షించాలి. కొండను కాంక్రీట్ జంగిల్ గా మార్చకుండా, పర్యావరణ అనుకూల చర్యలు తీసుకోవాలి. తిరుమల పర్యావరణాన్ని, వన్యప్రాణులను, పవిత్రతను కాపాడాలి.
  సనాతన ధర్మ పరిరక్షణకై తిరుమల పవిత్రతను కాపాడుతూ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని తిరుమల అధ్యాత్మిక క్షేత్ర పవిత్రతను కాపాడే దిశగా కార్యాచరణ చేపడుతారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు.
భవదీయ
డా. కె.లక్ష్మణ్, MP
బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

  Archives

  Categories

  Meta

  'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

  X