హైదరాబాద్ : డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరిగిన ఛాయ సాహిత్యోత్వం రెండో రోజు(ఆదివారం) ఘనంగా ముగిసింది. ఛాయ సాహిత్యోత్సవం రెండో రోజు పలు వేదికలపై చర్చలతో ఆలోచనాత్మకంగా సాగింది. సోనియా గాంధీ తాజా పుస్తకం నేపథ్యంలో “ది పాలిటిక్స్ ఆఫ్ లవ్, ది పవర్ ఆఫ్ బిలాంగింగ్” అనే అంశం పై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమ మాట్లాడారు..
పితృస్వామ్యంపై స్త్రీవాద ప్రతిఘటన స్వరాలు అనే అంశంపై కశ్మీరీ కవయిత్రి నిఘత్ సాహెబా, కన్నడ రచయిత్రి అనుపమ, ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై మాట్లాడారు. ప్రముఖ సాహితీవేత్తలు కుసుమ ధర్మన్న, విశ్వనాథ సత్యనారాయణ, కట్టమంచి రామలింగారెడ్డి, జిలానో బానో గురించి సీనియర్ పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్, ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు, లక్ష్మణ చక్రవర్తి, నజియా అక్తర్ మాట్లాడారు. నవల నాటకం, సినిమా మధ్య తెగిన వంతన అనే అంశంపై సినీ నటుడు తిరువీర్ మాట్లాడారు. ఛాయ లిటరేచర్ ఫెస్టివల్ నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన ఐల నవలా రచయిత వివేక్ లంకమలను ఈ సందర్భంగా సత్కరించారు.

రెండోరోజు ఫెస్టివల్ లో ఎనిమిది పుస్తకాలను ఆవిష్కరించారు. పుస్తక ప్రదర్శన, ఫ్లీ బజార్ ఫెస్టివల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అంతర్జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాలకు, వివిధ భాషలకు చెందిన రచయితలు, సాహితీ వేత్తలు సుమారు 2 వేల మంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఈ ఛాయ సాహిత్యోత్సవం లో పాల్గొన్నారు. పలు భాషలు, సాహిత్య రంగాలకు చెందిన రచయితలు, వక్తలు తమ అభిప్రాయాలు, అనుభవాలను ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన వేర్వేరు వేదికలపై పంచుకున్నారు.

ఈ ఛాయ సాహిత్యోత్సవంలో ఏర్పాటు చేసిన పలు పుస్తకాల స్టాల్ లు పుస్తక ప్రియుల తాకిడి తో కిటకిటలాడాయి. వివిధ భాషలకు చెందిన రచయితలు, కవులు, పండితులు, పాఠకుల మధ్య సాహిత్య చర్చలు జరపడం, వారి వారి అభిప్రాయాలు పరస్పర ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడమే ఈ ఛాయా ఉత్సవం ప్రధాన లక్ష్యం అని నిర్వాహకులు వివరించారు.
రెండో రోజు కార్యక్రమాల్లో డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ఛాయ సాహిత్యోత్సవం డైరెక్టర్, సీనియర్ పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలోని రచయితలు పాల్గొనడం ఆనందంగా ఉందని ఛాయా నిర్వాహకులు సతీష్ చప్పరికే, అరునాంక్, కుప్పలి పద్మా, క్రాంతి తదితరులు పేర్కొన్నారు.
