60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ
మా కార్యాలయాలపైకి వస్తే చూస్తూ మా కార్యకర్తలు ఊరుకోరు
ఖబర్దార్ కాంగ్రెస్ నాయకురా… జాగ్రత్త
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకునే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి
కాంట్రాక్టర్ల కోసం మల్లన్న సాగర్ నుంచి మూసీకి గోదావరి జలాలు
దగ్గర్లోని కొండపోచమ్మ ప్రాజెక్టు కాకుండా దూరమున్న మల్లన్న సాగర్ నుంచి ఎందుకు అనుసంధానం ?
పథకాలు సరిగ్గా అమలు చేయకపోతే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఒకటే
ఒక పార్టీ ఫేక్ అయితే.. మరొక పార్టీ డీప్ ఫేక్
యాదాద్రి - భోనగిరి లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై కాంగ్రెస్ గూండాలు చేస్తున్న దాడులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. “60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బిఆర్ఎస్ పార్టీ. 60 లక్షల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు… జాగ్రత్తగా ఉండండి” అంటూ కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక జారీ చేశారు. తమ పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోబోరని తేల్చిచెప్పారు. రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి తమది కాదని, మాటలతో, విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి తమదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఒకటేనని స్పష్టం చేశారు. ఒక పార్టీ ఫేక్ అయితే.. మరొక పార్టీ డీప్ ఫేక్ అని ఎద్దేవా చేశారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి జన్మనక్షత్రం సందర్భంగా బుధవారం నాడు ఉదయం జరిగిన గిరి ప్రదిక్షిణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం యాదాద్రి - భోనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… మూసి మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలని, పారిశ్రామిక వ్యర్ధాలు మూసిలో కలుస్తుంటే 60 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది ? అని ప్రశ్నించారు. మూసి నదిని ప్రక్షాళించడానికి కేసీఆర్ సంకల్పించారని, అందులో భాగంగానే ఎస్టీపీలను ఏర్పాటు చేయడమే కాకుండా గోదావరి నదితో అనుసంధానం చేయాలనుకున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే మూసిలో మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మూసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని వివరించారు.
మూసి ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు ఏటీఎం గా తయారు చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. హైదరాబాదుకు దగ్గరలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ను వదిలేసి దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసి – గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదని స్పష్టం చేశారు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే అనుసంధాన ప్రాజెక్టు వ్యయాన్ని రూ 7500 కోట్లకు పెంచారని, రూ. 7500 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కొండపోచమ్మ నుంచి మూసి అనుసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన పేరిట పేద ప్రజల ఇళ్లను కూల్చివేత కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని, పేద ప్రజల ఇళ్లపైకి రేవంత్ రెడ్డి సర్కార్ బుల్డోజర్లను పంపిస్తోందని ధ్వజమెత్తారు. “మూసి ప్రక్షాళనకు అయ్యే వ్యయం 50 వేల కోట్లు అని ఒకసారి, లక్ష కోట్లు అని మరొకసారి, లక్షన్నర కోట్లు అని ఇంకోసారి సీఎం చెబుతున్నారు. మూసిని ఏటీఎంగా మార్చుకొని… వచ్చే డబ్బును ఢిల్లీకి పంపించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక వేశారు” అని అన్నారు.
Also Read-
ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసిఆర్ ఎంతగానో కృషి చేశారని, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ రూ 42 వేల కోట్లను ఖర్చు చేశారని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోల్లడానికి కేసీఆర్ సంకల్పించారని, అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేశారని చెప్పారు. ఫ్లోరైడ్ ని నిర్మూలించిన ఘనత కేసిఆర్ దేనని, అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఒక వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన పోలేదని అన్నారు. అలాగే, యాదాద్రిలో కేసీఆర్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని, యాదాద్రి వైభవాన్ని ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపించారని, పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను త్వరితిగతిన పూర్తి చేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయడం లేదన్న దుష్ప్రచారం చేయాలన్న దురాలోచనతో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వడం లేదని విరుచుకుపడ్డారు. “’నీళ్లు ఇవ్వక లక్షాలాది ఎకరాల సాగుభూములను ఎండబెడుతున్నారు. రైతుల మీద పగతీర్చుకుంటున్నారు. కొంచమైనా సిగ్గుండాలి. కేసీఆర్ ను ఏం చేయలేక, రాజకీయంగా ఎదుర్కోలేక నల్గొండ రైతాంగం మీద కోపం చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లు నాగార్జున సాగర్ కు సంబంధించిన హెడ్ రెగ్యులేటర్, ఎడమ, కుడి కాలవలను తెలంగాణ ప్రభుత్వమే కంట్రోల్ చేసిందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రగానే ప్రాజెక్టు కేంద్ర బలగాల చేతుల్లోకి వెళ్లిందని తెలిపారు. నీటి విడుదల లెక్కల కోసం తెలంగాణ అధికారులకు వెళ్తే ఆంధ్రా అధికారులు రానివ్వడం లేదని, కొట్టి కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా కూర్చుంటున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. తక్షణమే ఆ ప్రాజెక్టు నిర్వహణను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలా చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రైబ్యునల్ లో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తు చేస్తే చాలని చెప్పిన ప్రభుత్వం మళ్లీ గ్రామ సభలు నిర్వహిస్తూ ఏం సాధిస్తున్నారని ప్రశ్నించారు. గ్రామ సభల్లో లబ్దీదారులను ఎంపిక చేయకముందే ప్రభుత్వం వద్ద లెక్క ఎలా ఉందని అడిగారు. అన్ని విషయాల్లో ప్రభుత్వం కోతలు పెడుతోందని, రాష్ట్రంలో కోటి మంది రైతు కూలీలు ఉంటే… కాంగ్రెస్ సర్కార్ కోతలు పెట్టడంతో 10 లక్షల మందికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తించే పరిస్థితి లేదని వివరించారు. తూతూమంత్రంగా పథకాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ పథకాలు సరిగ్గా అమలు చేయకపోతే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సంక్రాంతికి నుంచి సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సార్లు చెప్పారని, కానీ సంక్రాంతి అయిపోయినా ఇంకా సన్నబియ్యం రాలేదని ఎండగట్టారు.
ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఎత్తిచూపారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పి ఎగవేసిందని, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇవ్వడం లేదని వివరించారు. ప్రజలను కన్నబిడ్డలుగా చూసేది బీఆర్ఎస్ పార్టీ అని, కేవలం ఓటు బ్యాంకుగా చూసేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. మైనారిటీ, లంబాడాలు లేని తొలి మంత్రివర్గం ఇదేనని, తక్షణమే మైనారిటీలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. లంబాడాలకు కూడా అవకాశాలు కల్పించాలని అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు క్యామ మల్లేష్ ,మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ , దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్వి నేత తుంగ బాలు,మాజీ బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్, బొల్లా శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.