గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,
తెలంగాణ ముఖ్యమంత్రి,
ప్రగతి భవన్, హైదరాబాద్.
విషయం : రాష్ట్రంలో పేదలకు కేంద్రం ఉచితంగా అందిస్తున్న 5 కిలోల అదనపు బియ్యాన్ని తక్షణమే అందజేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరుతూ…
నమస్కారం
తెలుగు ప్రజలు అత్యంత ఉత్సాహంగా జరుపుకొనే అతి పెద్ద పండుగ మకర సంక్రాంతి. మీ నిర్వాకం కారణంగా తెలంగాణలోని మూడున్నర కోట్ల మంది ప్రజలు రేషన్ బియ్యం అందక పండుగ పూట పస్తులుండబోతున్నారు. దేశంలోని పేద ప్రజలందరూ మూడు పూటలా కడుపునిండా భోజనం చేయాలనే సదుద్దేశంతో కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రేషన్ కార్డులున్న పేదలందరికీ ప్రతినెలా 5 కిలోల బియ్యాన్ని ఈ ఏడాది పొడవునా అందించాలని నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం కింద తెలంగాణలోని సుమారు 55 లక్షలు కార్డుదారులకు అంటే 1 కోటి 92 లక్షల మంది లబ్ధిదారులకు సుమారు రూ. 4,300 కోట్ల విలువైన 13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈనెల (జనవరి) ఒకటో తేదీ నుండి తెలంగాణకు అందిస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.250 కోట్లకుపైగా ఆదా అవుతోంది. ఆ సొమ్ముతో రాష్ట్రంలోని 90 లక్షల రేషన్ కార్డుదారులందరికీ (2.83 కోట్ల మంది ప్రజలకు) ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినా ఇంకా రూ.80 కోట్లకుపైగా ఆదాయం మిగులుతుంది.
అయినప్పటికీ మీ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా రాష్ట్రంలోని పేదలకు రేషన్ బియ్యం అందక పండుగ పూట పస్తులుండే దుస్థితి ఏర్పడటం క్షమించరాని నేరం. కేంద్రం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని పేదలకు ఇంతవరకు పంపిణీ చేయకపోవడానికి అసలు కారణమేమిటి? కరోనా కాలంలోనూ కేంద్రం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఇచ్చిన బియ్యాన్ని కూడా పేదలకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు అడ్డుకుంటూ పేదల కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసం? పేదలకు బియ్యాన్ని పంపిణీ చేస్తే కేంద్రానికి పేరొస్తుందనే అక్కసుతో పేదల కడుపు కొట్టడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి.
ఒక పక్కన రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు అనామక ఎన్టీవో సంస్థ తయారు చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పేరుతో దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారంటూ నిత్యం కేంద్రాన్ని బదనాం చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్న మీరు కేంద్రం ఉచితంగా ఇస్తున్న 5 కిలోల బియ్యాన్ని పేదలకు అందివ్వకపోవడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలకు కడుపు నిండా మూడు పూటలా అన్నం పెట్టాలనుకుందే తప్ప ఏనాడూ రాజకీయం చేయాలనుకోవడం లేదు. పేదలకు తక్షణ ఆసరా కోసం అందజేస్తున్న బియ్యాన్ని మీరు సకాలంలో పంపిణీ చేయకపోవడం వల్ల కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తారనే కనీస అవగాహన మీకు లేకపోవడం బాధాకరం.
ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాల్లలోని విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తూ అనారోగ్యం బారిన పడకుండా చూడాలనే గొప్ప లక్ష్యంతో ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తున్న బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్‌గా సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా టీఆర్ఎస్ విమర్శించడం విడ్డూరం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ కేంద్రం అందిస్తున్న బియ్యంగా ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు ఎఫ్‌సీఐ కోసం కొనుగోలు చేస్తున్న బియ్యాన్ని మొత్తం ఫోర్టిఫైడ్ రైస్‌గా ఇవ్వాలని బిజెపి తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురాదలిచాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు నేటికీ చాలా జిల్లాల్లో జీతాలు, పెన్షన్లు అందకపోవడం అత్యంత దురదృష్టకరం. మీ ప్రభుత్వ నిర్వాకం, అసమర్థత కారణంగా 10వ తేదీ వచ్చినా నేటికీ కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని ఉద్యోగుల, పెన్షనర్ల ఖాతాల్లో జీతాలు, పెన్షన్ సొమ్ము పడలేదు. సంక్రాంతి పండగ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న 4 డీఏల్లో కనీసం ఒకటో, రెండో డీఏలు ఇస్తారని ఉద్యోగులు గంపెడాశతో ఎదురు చూస్తుంటే… కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడబీకినట్లు.. అసలు జీతాలే ఇవ్వకపోవడం దురదృష్టకరం.
అత్యంత సంబురంగా జరుపుకొనే సంక్రాంతి పండుగ పూట ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పండగ చేసుకోలేకపోతున్నారు. మీ నిర్వాకం కారణంగా పెన్షనర్లు వృద్దాప్యంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోలేని, మందులు కూడా కొనలేని దుస్థితి నెలకొంది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు తీసుకోవడమనేది ఉద్యోగుల హక్కు. ఈ హక్కును కాలరాసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదు. ఈ హక్కును కాలరాయడమంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించడమేననే సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ తక్షణమే జీతాలతోపాటు పెన్షనర్లకు పెన్షన్ సొమ్మును విడుదల చేయాలని బిజెపి రాష్ట్రశాఖ డిమాండ్ చేస్తోంది.
-బండి సంజయ్ కుమార్
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,
కరీంనగర్ ఎంపి