-కౌన్సిలింగ్ ప్రారంభం కాకుండానే ఇంజనీరింగ్ అడ్మిషన్ల దందా చేస్తారా?
-కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో ఆటలాడుతోంది
-కేసీఆర్ ప్రభుత్వం డబ్బులకు అమ్ముడుపోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోంది
-ప్రమోషన్లకు అమ్ముడుపోయిన కొందరు పోలీసులు ఏబీవీపీ నాయకులను వేధిస్తున్నారు
-ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా చేస్తే మీకొచ్చిన నొప్పేంటి?
-ఏబీపీవీ రాష్ట్ర కార్యదర్శి ఝూన్సీపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా?
-తక్షణమే ఏసీపీసహా పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే
-ఈటల రాజేందర్ మా పార్టీ నాయకుడు… జాతీయ నాయకత్వాన్ని కలవడానికి వెళితే తప్పేంది?
-దళితులను తిట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే
-అంబేద్కర్ లేకుంటే ఆయనది బిచ్చపు బతుకయ్యేదనే సంగతి తెలుసుకుంటే మంచిది.
-కేసీఆర్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో ఆటలాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు… చివరకు విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రైవేటు వర్శిటీ హోదా రాకుండానే శ్రీనిధి, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలు 4 వేల మంది విద్యార్థుల వద్ద డబ్బులు తీసుకుని వాళ్ల జీవితాలను నాశనం చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
విద్యార్థులకు న్యాయం చేయాలని ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా చేసిన ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టడం సిగ్గు చేటన్నారు… తక్షణమే బాధ్యులైన ఏసీపీసహా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ఇంతటి వదిలిపెట్టేది లేదని, జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈరోజు దిల్ సుఖ్ నగర్ లోని ఏబీవీపీ విభాగ్ కార్యాలయానికి వెళ్లిన బండి సంజయ్ పోలీసుల దాడిలో గాయపడ్డ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు…
• కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో ఆటలాడుతోంది. డబ్బు, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతోంది. డబ్బులిస్తే చాలు ఎవరి జీవితాలు నాశనమైనా డోన్ట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తోంది.
• డబ్బులకు కక్కుర్తిపడి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ చేసి 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేసిన కేసీఆర్ కుటుంబం ఇయాళ ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలను కూడా ప్రమాదంలో నెట్టేసేందుకు సిద్ధమైంది.
• ఇప్పటివరకు ఎంసెట్ ఫలితాలు రాలేదు.. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మొదలు కాలేదు.. కానీ అప్పుడే ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల దందా మొదలుపెట్టింది. ఇంకా దుర్మార్గమేందంటే… అనుమతి లేకుండానే ప్రైవేటు యూనివర్శిటీల పేరుతో పెద్ద దందా జరుగుతోంది.
• గురునానక్, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలకు ఇంతవరకు అటానమస్ (ప్రైవేట్ వర్శిటీ) హోదా రాలేదు. ఇప్పటి వరకు అనుమతి రాలేదు.. అయినా ఆ కాలేజీల్లో ఇప్పటి నుండే ఇంజనీరింగ్ సీట్ల దందా మొదలైంది. మాది ప్రైవేట్ వర్శిటీ అని ప్రచారం చేసుకుంటూ వేలాది మంది విద్యార్థుల వద్ద అడ్మిషన్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నరు. ఈ రెండు కాలేజీల్లోనే ప్రత్యేక వర్శిటీలని చెప్పుకుంటూ దాదాపు 4 వేల మంది విద్యార్థుల నుండి ఇప్పటికే డబ్బులు కట్టించుకున్నయ్..
• ఇంత దుర్మార్గమా? దీనిపై ఏబీపీవీ నాయకులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. కానీ ఇది చేతగాని, మూర్ఖత్వ, నయా నిజాం ప్రభుత్వమిది. కాలేజీల నుండి డబ్బులు తీసుకుంటున్నట్లుంది. వాళ్ల కమీషన్ల కోసం విద్యార్థుల జీవితాలను నాశనమైనా పట్టించుకోదు.
• దీనిపై ఏబీవీపీ ప్రజాస్వామ్యబద్దంగా పోరాటం చేస్తోంది. ఆ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల జీవితాలను కాపాడాలని ఏబీవీపీ ఆందోళన చేస్తోంది. నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్ల పోరాడిన చరిత్ర ఉన్న సంఘం ఏబీవీపీదే. స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉద్యమిస్తే ఆ విద్యార్థుల సమస్యలపై చర్చించి పరిష్కరించాల్సిన ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోంది. ఈ సర్కారు సిగ్గు లేనిది. ప్రజలు ప్రభుత్వం మీద ఉమ్మేస్తున్నా సిగ్గు రావడం లేదు. పోరాటం చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝూన్సీసహా నాయకులను అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. బెదిరిస్తున్నారు.
• టార్గెట్ చేసి ఝాన్సీని ఎత్తుకుపోయిన పోలీసులు లాఠీలతో కుళ్ల పొడుస్తారా? థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా? ఆత్మరక్షణ కోసం ఎదిరిస్తే పోలీసులనే కొడుతోందంటూ దుష్ప్రచారం చేస్తారా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? లేక రౌడీ రాజ్యమా? న్యాయం పక్షాన పోరాడుతున్న వారికి అండగా ఉండాల్సింది పోయి లంగ దందా చేసే వాళ్ల తరపున వకాల్తా పుచ్చుకుంటారా? కొందరు పోలీసులు సీఎం మోచేతి నీళ్లు తాగుతున్నరు. కొడుతున్నారు.
• అసలు కొట్టే హక్కు మీకెవరు ఇచ్చారు? ఆమె చేసిన తప్పేంటి? విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తే కొడతారా? విద్యార్ధిని అని కూడా చూడకుండా టార్గెట్ చేసి థర్డ్ డిగ్రీ ఇస్తారా? కుటుంబ సభ్యులకు కూడా సమాచారమివ్వకుండా చిత్రహింసలకు గురిచేస్తారా? శాంతిభద్రతలను కాపాడే తీరు ఇదేనా? మీరు దాడులు చేస్తే సీసీ పుటేజీల్లో రికార్డు కానివ్వరు… థర్డ్ డిగ్రీని భరించలేక ఆత్మ రక్షణ కోసం ఎదురుదాడి చేస్తే పోలీసులనే కొట్టారంటూ సీసీ పుటేజీలు రిలీజ్ చేసి కేసులు పెట్టి వేధిస్తారా? 4 వేల మంది విద్యార్థుల పక్షాన ఫైట్ చేస్తున్న వారికి అండగా ఉండాల్సింది పోయి దాడులు చేసి పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసుకుంటారా?
• తక్షణమే థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఏసీపీసహా పోలీసులపై చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మహిళా కమిషన్ సహా జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. దోషులను శిక్షించేదాకా, 4 వేల మంది విద్యార్థుల భవిష్యత్ ను కాపాడేదాకా పోరాడదాం…
• ఈ ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేతగాదు.. పేపర్ లీకేజీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న ప్రభుత్వమిది. ఇయాళ ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నా పట్టించుకోవడం లేదంటే ఏమనాలి?
• ఒకవైపు నిరుద్యోగులు అల్లాడుతున్నరు. పేపర్ లీకేజీ దోషులపై చర్యలు తీసుకోరు. విచారణ పూర్తి కాదు.. నిందితులుగా అరెస్టయిన వాళ్లు జైలు నుండి బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నరు. లీకేజీకి కారకులైన సీఎం కొడుకు విదేశాల్లో తిరుగుతున్నడు.
• (ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ) ఆయన కాంగ్రెస్ నాయకులను కలవడానికి వెళ్లారా? లేక ఇతర పార్టీలను కలవడానికి వెళ్లారా? ఆయన మా పార్టీ నాయకులు… మా జాతీయ నాయకత్వాన్ని కలిసేందుకు వెళితే తప్పేముంది? మా పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంది… ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంది.
• దళితులను థర్డ్ క్లాస్ ఫెలోస్ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… ఆ మంత్రికి ఎంత కండకావరం? దళిత సంఘాలు ఏం చేస్తున్నాయి? అంబేద్కర్ రాజ్యాంగం పుణ్యమా? అని నువ్వు ఎమ్మెల్యే అయినవ్. మంత్రి పదవి వచ్చింది. లేకుంటే నీది బిచ్చపు బతుకులయ్యేది. రాజకీయాలు ఏ విధంగా దిగజారుతున్నాయో నిదర్శనమిది. అతనిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టకూడదు? నాన్ బెయిలెబుల్ కేసు పెట్టాలి. లేకుంటే దళితులకు రక్షణ ఏది? ఇట్లనే కొనసాగితే ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు దళితులను తిట్టే అవకాశముంది.