“కేసీఆర్ కుటుంబంసహా బీఆర్ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయండి”

ప్రజల సొమ్మును దోచుకుతిన్న

లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉంది

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గు చేటు

పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు…

దేశమంతా మోదీ గాలి వీస్తోంది

350 సీట్లతో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం

తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ

బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతే

బీజేపీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపు

హైదరాబాద్: అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబ సభ్యులుసహా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేనిపక్షంలో వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు…కేసీఆర్ హయాంలో పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టిన అధికారుల పాస్ పోర్టులను సైతం సీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ ను ఈ విషయంలో మినహాయించాలని కోరారు.

కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్ లో ఈరోజు మధ్యాహ్నం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పదాధికారుల సమావేశం జరిగింది. కరీంనగర్, వేములవాడ జిల్లాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవిసహా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆ పైస్థాయి నాయకులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. దీంతోపాటు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు…

‘‘కేసీఆర్ మినహా ఓడిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. వెంటనే వాళ్ల అవినీతిని బయటపెట్టాలి. వాళ్లపై చర్యలు తీసుకోవాలి. అంతకంటే ముందే వాళ్ల పాస్ పోర్టులన్నీ రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలి. లేకుంటే విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది. వీరితోపాటు ఇన్ని అరాచకాలకు కారకులైన కేసీఆర్ సీఎం ఉండగా సీఎంఓలో పదవీ విరమణ చేసిన అధికారులు అడ్డగోలుగా సంపాదించి ప్రజల ఆస్తులను దోచుకుని తెలంగాణను సర్వనాశనం చేశారు. వాళ్ల పాస్ పోర్టును కూడా స్వాధీనం చేయాలి. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నందున ఆరోగ్యం కుదటపడే వరకు ఈ విషయంలో ఆయనను మినహాయించాలి’’అని డిమాండ్ చేశారు.

బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో తెలంగాణను పెట్టామంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా బీఆర్ఎస్ నేతలు చెబుతుండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ఆ మాటలు అనడానికి సిగ్గుండాలే… తెలంగాణ బంగారు పళ్లెమే అయితే ఫస్ట్ నాడే జీతాలెందుకివ్వలేకపోయారు? 6 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను సర్వనాశనం ఎందుకు చేశారు? ప్రభుత్వ భూములన్నీ ఎందుకు అమ్ముకున్నారు? నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకియ్యలేదు? నిరుద్యోగ భ్రుతి ఎందుకివ్వలేదు.’’అని ప్రశ్నించారు.

పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు… దేశమంతా మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ గాలి వీస్తోంది. 350 ఎంపీ స్థానాలతో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని సర్వే సంస్థలు చెబుతున్నాయి. తెలంగాణలోనూ మోదీగాలి వీస్తోంది. మనకు పోటీ కాంగ్రెస్ మాత్రమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సోదిలో కూడా ఉండదు. మనం చేయాల్సిందల్లా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ్రుద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఇంటింటికీ తీసుకెళ్లడమే. ఈ విషయంలో కొంత వెనుకబడ్డాం… ఇకపై ప్రతి ఒక్కరూ బీజేపీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలి.’’అని కోరారు.
———————-
అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు ఏర్పాటుచేయండి

కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయంచేస్తాం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
ఇటీవల తొక్కిసలాటలో బాలిక మృతిచెందడం అత్యంత బాధాకరం
తెలుగు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.. ఆదుకోవాలని వినతి

హైదరాబాద్: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు.

శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణసహకారం ఉంటుందని ఆయనలేఖలో పేర్కొన్నారు.

కేరళ సీఎం పినరయి విజయన్ గారికి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి లేఖ..

గౌరవ శ్రీ పినరయి విజయన్ గారికి,

అయ్యప్పస్వామి భక్తులు 40 రోజులపాటు చేసే ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష ఆ తర్వాత.. శబరిమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం హిందూ ధర్మంపట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనం.

ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోటిమందికిపైగా భక్తులు వివిధ రాష్ట్రాలనుంచి మండలదీక్షను పూర్తిచేసుకుని అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వస్తున్న విషయం మీకు తెలిసిందే. ప్రతిఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుంది.

అయితే ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సరిగాలేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. భక్తుల ద్వారా, పత్రికలు, చానళ్లలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది. ఇటీవలే.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో.. దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లులేక తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసి చాలా బాధకలిగింది.

శబరిమలలో అయ్యప్పస్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో.. ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించి.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను. శబరిమలపై, భక్తుల పాదయాత్ర మార్గాల్లో.. భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయగలరని మనవిచేస్తున్నాను.

అయ్యప్పస్వామి మండల దీక్షలో ఉన్న భక్తులకు శబరిమల యాత్ర సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించడం, వారి యాత్ర భక్తిప్రద్రంగా, శుభప్రదంగా జరిగేలా చూడడం అత్యంత అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం భక్తులకు సౌకర్యార్థం అందించేందుకు సిద్ధంగా ఉంది.

భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో.. పంబానది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవాసంస్థల (NGO)ను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కోరుతున్నాను.

ఈ విషయంలో మీరు వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

భవదీయ

(జి.కిషన్ రెడ్డి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X