నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు
కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
చట్ట, న్యాయ, రాజకీయపరంగా నోటీసులను ఎదుర్కొంటాం
టీఎస్పీఎస్సీతో సంబంధం లేకుండా ఆ సంస్థ తరపున ఎందుకు మాట్లాడుతున్నవ్?
పంట నష్టపరిహారం సొమ్ములో 75 శాతం వాటా కేంద్రానిదే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు నాకు లీగల్ నోటీసు పంపినట్లు వార్తలు ప్రసారమవుతున్నాయి. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు. చట్ట, న్యాయబద్దంగా తగిన సమాధానమిస్తాం. రాజకీయంగా, ప్రజా క్షేత్రంలో పోరాడతాం. అంతే తప్ప కేసీఆర్ సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. ట్విట్టర్ టిల్లును కేబినెట్ నుండి బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
• టీఎస్పీఎస్సీతో సంబంధం లేదని ట్విట్టర్ టిల్లు చెప్పడం పెద్ద జోక్. ఆయనది నాలుకా? తాటిమట్టా? ఏ సంబంధం లేకపోతే సీఎం నిర్వహించే సమీక్షలో ఎందుకు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీకేజీకి ఇద్దరు వ్యక్తులే తప్ప టీఎస్పీఎస్సీ తప్పిదం లేనే లేదని ఎట్లా చెబుతారు? లీకేజీ వెనుక బీజేపీ, బండి సంజయ్ కుట్ర ఉందని ఎట్లా ఆరోపిస్తారు? రాష్ట్రంలోని అన్ని శాఖల తరపున వకాల్తా పుచ్చుకుని ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి.
• మంత్రిగా ఉంటూ ట్విట్టర్ టిల్లు స్పందిస్తే తప్పు లేనప్పుడు… ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షంగా మేం మాట్లాడితే తప్పేముంది? ప్రతిపక్షాలకు నోటీసులిచ్చే కొత్త సాంప్రదాయానికి ట్విట్టర్ టిల్లు తెరలేపడం సిగ్గు చేటు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై నోరెత్తకుండా ప్రతిపక్షాలను అణిచివేసే కుట్రలో భాగమే ఇది.
Related News:
• తన వైఫల్యాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బెదిరించడం, కేసులు పెట్టడం, తమ తాబేదారు సంస్థలతో నోటీసులు ఇప్పించడం, అరెస్ట్ చేయించడం కేసీఆర్ సర్కార్ కు అలవాటుగా మారింది. వీటికి భయపడే ప్రసక్తే లేదు. చట్ట, న్యాయపరంగా నోటీసులకు సమాధానమిస్తాం. రాజకీయంగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.
• పంట నష్టం కింద రైతులకు కేంద్రం పైసా సాయం చేయలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్దం. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు సాయం చాలా గొప్ప విషయమని చెప్పడం సిగ్గు చేటు.
• రాష్ట్ర ప్రభుత్వం SDRF నిధుల నుండి రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తోంది. ఆ నిధుల్లో 75 శాతం వాటా కేంద్రానివే. అయినా సిగ్గు లేకుండా కేంద్రం పైసా ఇవ్వలేదని చెబుతే ప్రజలు నవ్వుకుంటున్నారనే సోయి లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడటం విడ్డూరం.
• కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకం బాగోలేదని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రత్యామ్నాయ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఆ పథకం ద్వారా సాయం అందకుండా రైతుల నోట్లో ఎందుకు మట్టికొట్టిందో చెప్పాలి.
• వాస్తవాలను దారి మళ్లించేందుకు జాతీయ సమగ్ర పంటల విధానాన్ని రూపొందించాలని చెప్పడం హాస్యాస్పదం. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లైనా ఇంతవరకు సమగ్ర పంటల విధానాన్ని, బీమా పాలసీని తీసుకురాకుండా కేంద్రంపై బురద చల్లడం సిగ్గు చేటు.