
హైదరాబాద్ : భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను సందర్శకులకు పరిచయం చేసే లక్ష్యంతో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రారంభించిన థీమ్ ఆధారిత పర్యాటక రైలు “భారత్ గౌరవ్ రైలు”. ఈ రైలు ప్రయాణికుల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ గౌరవ్ రైలు యొక్క 58వ ట్రిప్, అయోధ్య – కాశీ: బైద్యనాథ్ ధామ్ తో పుణ్య క్షేత్ర యాత్ర నేడు అనగా 2026 అక్టోబర్ 24న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గ్రూప్ జనరల్ మేనేజర్ పి. రాజ్ కుమార్, దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ. శ్రీధర్ గార్లతో కలిసి రిబ్బన్ కటింగ్ కార్యక్రమంతో భారత్ గౌరవ్ రైలు ప్రారంభమైంది .

2026 అక్టోబర్ 24 నుండి నవంబర్ 2 వరకు 9 రాత్రులు / 10 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ఆధ్యాత్మిక అనుభూతి కోసం రామ జన్మభూమి (అయోధ్య ), జ్యోతిర్లింగాలలో ఒకటైన (కాశీ విశ్వనాథ ఆలయం), ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమం, బాబా బైద్యనాథ్ ఆలయం, పూరిలోని జగన్నాథ స్వామి ఆలయం మరియు భువనేశ్వర్‌లోని కోణార్క్ సూర్య దేవాలయంలను దర్శనం చేసుకునేందుకు ఒక విశిష్టమైన అవకాశాన్ని అందిస్తుంది.

సికింద్రాబాద్‌తో పాటు మార్గ మధ్యంలో తెలంగాణలోని చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, వైజాగ్(పెందుర్తి),విజయనగరం స్టేషన్లలో ప్రయాణికుల కోసం రైలు ఎక్కేందుకు /దిగేందుకు సౌకర్యం కల్పించబడింది.

భారత్ గౌరవ్ రైళ్లు దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రధాన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. సాంస్కృతికంగా ప్రాముఖ్యత కలిగిన, చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైలు ప్రయాణికులందరికీ విజ్ఞప్తి.
