హైదరాబాద్ : ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిటల్ లో ముగ్గురు చిన్నారులు చనిపోయిన సంఘటనలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కన్నా హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ నిర్లక్ష్యమే ఎక్కువ బాధించిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన ఆయన సంఘటన స్థలానికి వెళ్లి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఏదో టూరిజం స్పాట్ కు వెళ్లినట్లు హడావుడిగా అర్ధగంటలో అక్కడ నుంచి వెళ్లిపోయారని… కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. రిమ్స్ హాస్పిటల్ ఘటనపై మంగళవారం ఆమె ఎక్స్ లో ట్వీట్ చేయటంతో పాటు వీడియో మెస్సేజ్ రిలీజ్ చేశారు.
చిన్న పిల్లలున్న ఇంక్యుబేటర్ వార్డులో జరిగిన ఈ ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని… మానవ తప్పిదం కారణంగానే జరిగిందని చెప్పారు. ఏసీ మెయింటెనెన్స్ సరిగా చేయకపోవటంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఒక్క ఆదిలాబాద్ రిమ్స్ లో మాత్రమే కాదు… రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో ఏదో ఒక సమస్య ఉందన్నారు. వెయ్యి రోజుల రేవంత్ పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పారు. ఆదిలాబాద్ లాంటి మన్యం ప్రాంతానికి వెయ్యి రోజులుగా ముఖ్యమంత్రి గానీ, హెల్త్ మినిస్టర్ గానీ వెళ్లలేదన్నారు. వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ పరిస్థితి పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి అడిట్ చేయించాలని డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందన్నారు.
మానవత్వం లేని మంత్రి
ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు చిన్నారులు చనిపోతే కనీసం వారి కుటుంబాలను ఆదుకోవాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని కవిత విమర్శించారు. మంత్రి పరామర్శకు వెళ్లారంటే కచ్చితంగా బాధితులకు సాయం ప్రకటిస్తారని భావించామని కానీ వారికి రూపాయి కూడా సాయం చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చే వాళ్లు పేదలన్న సోయి ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మైనార్టీ పిల్లలుంటే ఒక ఆదివాసీ బిడ్డ ఉన్నారని చెప్పారు. అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పేదరికంలో ఉన్న ఆ కుటుంబాలకు కనీస సాయం కూడా ఈ ప్రభుత్వం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మంత్రి వస్తున్నాడని అంత్యక్రియలకు తీసుకెళ్లిన ఒక పసిబిడ్డ ను మళ్లీ మంత్రి కోసం ఇంటికి తీసుకొచ్చారని ఆయన ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు ఇంత అన్యాయంగా వ్యవహరించారని చెప్పారు. ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read-
రేపు ఆదిలాబాద్ కు కవిత
అటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి గర్భ శోకంలో మునిగిపోయిన చిన్నారుల కుటుంబ సభ్యులకు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం ఆదిలాబాద్ వెళ్లనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 50 వేల చొప్పున పార్టీ తరఫున అందిస్తామన్నారు. హెల్త్ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అత్యంత సీరియస్ అంశంగా తాము పరిగణిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఈ దుర్ఘటనతో నైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. రిమ్స్ సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని, మరోసారి ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
