దుమ్ములేపుతున్న ‘పరేషాన్’ సిన్మాలోని అక్కల చంద్రమౌళి ‘సౌసారా సౌసార…’ పాట

అవ్వభాషల రచన జేసినా జనం పలుకుబడులు ఏరిజోలేలేసిన

పరేషాన్ సిన్మా పాట జనవరి, పదోతారీఖున,2023 సంవత్సరం సోనిమ్యూజిక్ల ఇడిశిర్రు. సర్రసర్ర యూట్యూబ్లో మిలియన్ వ్యూస్కు పోతాంది. ఫొక్తాగ పాట ఎనుకున్న మత్లబ్ గీత రచయిత అక్కల చంద్రమౌళి, జోర్తోటి రాసిన వ్యాసం.

సౌసారా సౌసార చటక్కార పోదాం పారా
బగ్గా తాగుదాం బొర్ర వెంచుదం
బజార్లనే వందాం
కాళ్ళ కూర తింటాం
సప్పుడేక ఉంటాం
పంది లెక్కవంటం
రందిబాపే తీర్ధం
అలవాటైన పానం
బొంతలిత్తం వొద్దాం
బొందలవడ్డ ఇడువం

ఓరి వారి ఓరోరి వారి-2

పికుడు మాటలు అనుడు
పిచ్చి కథలు వడుడు వడుడు
లొల్లి లొల్లి జేసుడు జేసుడు
గాయిగత్తర సేతలూ సేతులు
బిచ్చపులెక్కలు లెక్కలు
సోది ముచ్చట్లు ముచ్చట్లు
శాతగాని ఏశాలు
సత్తెనాశనం బతుకులు

గాయిదోల్లు సోపతిగాళ్ళు
హోలేగాళ్ళు బిత్తిరిగాళ్ళు
నకురాలు నల్లి కుట్లోళ్లు
నప్పతట్లోల్లుఎచ్చులొల్లు
గాలిమాటలు గబ్బుగాళ్ళు ……2

ఆగడువట్టి తాగుడు
తలకాయకూర నాకుడు
శెనగుడాలు బుక్కుడు
లొల్లి లొల్లి వాగుడు
ఒడవని పంచాయితీ బారెడు
నెత్తిల పురుగు మెసులుడు
చలో ధూంధాం దునుకుడే‌….

“సౌ సారా చ్చటాక్కారా”పాట విన్నాను, చదివాను ఒక్క మాటలో చాలా బాగుంది అంటే సరిపోదు యూత్ ను ఎట్లా ఆకర్షిస్తుందో కనబడుతూ వున్నది. పదాల అల్లిక సొంపుగా వున్నది. అదీ మన తెలంగాణా జీవద్భాషలో, మనం మరిచి పోతున్న మన యాస మన బాసలో. తీయని తెలుగు భాషకు పట్టం కడుతున్న మీకు అభినందనలు తెలియ జేసుకుంటున్నాను” -సామల రాజ్యవర్ధన్, మాటలివి.

“పరేషాన్” సిన్మాల సొక్కమైన తెలంగాణ యాస, భాషను సూపించాలన్న తండ్లాట రూపక్ రోనాల్డ్ సన్ దర్శకుడిది‌. ఒక దావత్ సాంగ్, తెలంగాణ సింగరేణి వాడల్ల యువత ఎగిరిదేది,దునుకేది ఆళ్ళ బతుకులను నిలువునిత్తారం సూపెట్టాలన్నది సందర్భం.

చాన్రోజుల నుంచి ఎదుర్ సూడాటినం, మనయాసల ముచ్చట్లు వెట్టెటట్ఝు మాలాస ఉడుగులున్న ఒక పాట ఒకటి రాస్తే మస్తుగుంటదని, ఆకర్కి ఈ పనిని నాతోనే సురుజేసిండు, ఖతంబట్టిచ్చిండు ఇంకేం మిగలకుండ ఖల్లాస్ వట్టించ్చిడు. ఇప్పుడు మస్తీ ఖుషీగుంది.యాడబోయిన ఇదే పాటల ముచ్చట ఇనవడ్తంది.

ఇయ్యాల రేపటి పోరగాండ్లు ఈ పదాలను మర్చిపోకుండా,ఆల్లుమరింక మన పెద్దోళ్ళు మాట్లాడిన యాసను, భాషను ఎప్పటి యాదించుకునేలా పూసగుచ్చినట్టు దాన్ని సిన్మా పాటల కుదిరింది.

అన్ని దెబ్బలకంటె సంగీతం దెబ్బ గట్టిది,దానికి యశ్వంత్ నాగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన సంగీతం, “మట్టిజీర” గొంతు వినిపిస్తాయి. దీంట్లా నివద్ది పెంటయ్య బ్యాండ్ భరాత్ ఏట్లుంటదో వాయిద్యాలతో సంగీతం కుదిరింది. అదోక నాగరికతనే గదా? ఎక్కడి సాహిత్యం, ఏం నేలకైన స్థానీకత జీవదాతువు. నాగరికత పొడుగునా స్థానీకత వినిపించే స్వరాలతో బలంగా వినిపిస్తే అది బలమైన సాహిత్యం అవుతుంది. బతుకు సాహిత్యం అవుతుంది గదా! అట్లనే కలిసింది.

అసలైన తేట తెనుగు ఆదిలాబాద్, మెదక్, వరంగల్ గోదావరి నది తీరం ప్రాంతం ఉందని పండితులు వేలేండ్ల నుంచి చెబుతున్నారు. హైదరాబాద్, దక్షిణ‌ తెలంగాణలో క్రృష్ణ నదికీవల పలుకుబడులు కూడా ఉర్దూపదాలతో కలిసి ఉంటయ్.

పాట ఎత్తుకోవడమే “సౌ సారా చటాక్కారా”ఈ మాటలు ఇనిపిస్తున్నాయా? మల్ల యాదిజేసేలా సౌ సారా వంద రుపాయల సారా అని అర్థం, చ్చటాక్ యాభై గ్రాములు , 1970ల చ్చటాక్ చాపత్తి, చ్చటాక్ శక్కెర అని వాడుకభాష. శరీరం సూత్తె చ్చటాక్ మాంసం లేదు అనే సామెత బాగా వాడేవారు. నా చిన్నతనంలో యాదుంది. మా అయ్య తాతలు మాట్లాడేది ఇప్పుడు అది రాసిన మనం భాషను తయారుచేయం దాని ముందుకు వట్టుకబోయేటోళ్లం అంతే.

బగ్గ అంటే – బాగా, ఎక్కువని అర్థం (నువ్వు నన్ను ఒక్కడినే ఇడిశివెట్టినంకా నాకింతాంత బుగులు వట్టలేదు. బగ్గ బుగుల్ వట్టింది. బొర్ర తెలంగాణ అచ్చమైన పదం ఇది ఊళ్ళో ఈడు బాగా తిని, తాగి బొర్ర వెంచిండని సాటుకు, నేటుకూ మాటలింటం. కొంచెం ఎత్తుగా వచ్చి కిందికి జారేటిది. బజారు ఉర్దూ పదం తెలంగాణ అంగడి, బజారుహత్నుర్ అనే ఊరు కూడా ఉంది.

కాళ్ళ కూర తింటం- ఇది తెలంగాణలో సగటు మధ్యతరగతి జీవితాలు తినే ఆహారం ఆయితారమస్తే కాళ్ళసోరువ, కూర తినే అలవాటు ఎక్కువనే చెప్పొచ్చు. సప్పుడు – ఇది గమ్మతి పదం పెండిల్ల సప్పుడు జేయీండ్రి బాజాలొల్లనంటం – ధ్వని మరో పేరు. కానీ ఇక్కడ కాళ్ళకూర తిని సప్పుడేకనే ఉంటం మేమిది ఎక్వాలేజేయ్యం మంచోళ్ళం. పంది లెక్కవంటం- వాడు పొద్దంతా పడుకుంటే పందిలెక్కవన్నర్రా అని చమత్కారంగా మాట్లాడుతారు.

రంది బాపే తీర్ధం రంజుగం ఉర్థు పదం దుఃఖం, బాధ, గోస అర్థాలున్నాయి. అలవాటైన పాణం – ఎనకెనుక తాగేటోళ్ళకు కల్లు, సారా ఒక దినమంతా గొంతుకలు తడిపి ఇడిసిపెట్టరని ఈడ మాట. బొత్తలింత ఓద్దాం-కడుపుల వోసుడు, పొట్ట, బొందలవడ్డా ఇడువం- సడాకంత బొందలు బొందలు ఉన్నది పయిలంగ వో! ఇది అచ్చ తెలంగాణల గ్రామ్య జీవభాష, మట్టి తవ్విన పెద్ద గోతులు వడ్డాగానీ ఇడువం అనీ కల్లు, సారా అలవాటుంటె ఇడవరు కదా? బొంద అంటే సమాధి, గుంత బొందల వడుడు మోసపోవడం, గోతిలో వడడం అని కూడా అర్ధాలు.

తెలంగాణలో “ఓరి వారి ” విభక్తి ప్రత్యయం ఓ, ఓరి, ఓసి, ఒరేయ్, ఓయ్ గొంతెత్తి పిలుస్తున్నట్టు, చెప్పదలుచుకున్న విషయానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు సంబోధించబడేది వ్యక్తి అవధాన్ని మనవైపు తిప్పుకోవాలనేటప్పుడు యిలాంటి సంబోధన వ్యవహారంలో వాడుతారు. నుడికారాలు గుడికట్టిన మొదటి పాట ఇదే కాబోలు. జనం నాలుకల మీద ఉన్న జీవభాషని బతికించండమే. లోతైన పదాలను తెల్లారి లేస్తే మనకు వందల వేల సార్లు వినబడేది మట్టి భాష రాస్తే జనాల్లో అది సీదా సొచ్చుకబోయింది. సామల సదాశివ “వారీ కార్తీ ఇగపటు” యాదిలో స్వచ్చమైన ఆదిలాబాద్ యాసలో పిలిచి అందించారు. అలాయ్ బలాయ్ “ఓరి వారి ఓరోరి వారి” అని మన కడుపులనుంచే అచ్చే కమ్మటి మాటలివి.జనం భాషను నెత్తిన బెట్టుకుంటరు. రచయిత మట్టి భాష నుడికారం పట్టుకుంటె పాట నిలబడుతుందనేది రుజువైంది.

పీకుడుమాటలు – ఉత్త, ఏమిగాని మాటలు

సాల్తీయ్ పీకుడుమాటలు ఇగాపు అని పంచాతీల మాటలు ఇనబడ్తయ్. మనకు. పిచ్చి కథలు వడుడు-ఎక్కతక్క చేస్తే కథలువడ్తున్నవా అంటారు. లొల్లి జగడం, కోట్లాట అని ఉంది.

తెలంగాణ పదాల్లో చమత్కారం, వ్యంగం,సూటిదనం ఊటలో ఊరే మాటలు ఉంటాయని కాళోజి అన్నాడు. గాయిగత్తర, గాయిదోళ్ళు ,హౌలేగాళ్ళు, బిత్తిరిగాళ్ళు, నల్లికట్లోల్లు, ఎచ్చులొల్లు, హోలేగాళ్ళు ఇలాంటివి పదాలు యువత ఎక్కువగా వాడుతారు. ఈ పదాలు పాటలో వింటుంటే యూత్ బాగా నవ్వి నవ్వి సచ్చిండ్రు. ఈ పాట మమ్మల్ని చూసే రాసిన్రు కదా అని ఒక యువకుడు అనేక సార్లు అడిగిన సంధర్భముంది.

నప్పతట్లోల్లు మాట ప్రముఖ రచయిత అల్లం రాజయ్య గారు మాట్లాడినప్పుడే విన్నది. గమ్మతి అనిపిచ్చింది. వాన్తోటి ఏంగాదని చెప్పేటప్పడు ఒకటే మాటలు ఇది వాడుతారు.

నల్లికుట్లతనం మనసు విప్పి మాట్లాడకపోవడం.చెప్పేదోకటి చేసేదోకటిలా వాడుతారు. ఈడు ఉల్కడు పల్కడు ఉత్త నల్లికుట్లోడంటారు. సత్తెనాశనం ఇది సత్తెనాశ్ హిందీ పదం తెలంగాణలో విరివిగా వాడుతారు.

గాలి మాటలు ఉత్తమాటలు, అక్కరకు రాని మాటలు,పొల్లు లేక అబద్దం మాటలు ఇగో దునియాకేందోయ్ “చీల్ ఉడి అంటే భైస్ ఉడీ” అంటారు.

” అగడువట్టి” వీపరితమైన ఆశతో నున్నాడనీ, మల్లంకేడన్న దొర్కదనుకున్నడేమో అగడువట్టి దింటాడు,తాగుతాండని మాండలికం మాట్లాడుతారు. పోశవ్వ మొక్కు తీరింది పోరంగాండ్ల ఆగడు తీరింది. ఈ పదాల తీరే గాదు, వాడుకలో గమ్మత్తిని పాటల పరిచయమైంది. కల్లు తాగేటప్పుడు నీసుకౌసు అంచుకువెట్టుకునేది ఖాయిస్వడి తలక్కాయ కూర నాకుతరు. శెనగూడలు బుక్కితే రుచికరంగా ఉంటాయి. బుక్కుడుకి తినడం అనే మాండలికం భాష.

ఒడవని పంచాయితీ బారెడు, నెత్తిల పురుగు మెసులుడం ఇవి జాతీయాలు పల్లెవాసుల పలుకుబడులు, ఈ పాట అక్కున చేర్చుకుంది. తలలో పురుగు మెదడును తొలచినట్టు ఇలాంటి ప్రక్రియగా రాలేదు. ఎక్కడో ఓకాడ తెలంగాణ సినిమా పాటల్లో మాండలికం కనిపించింది ఇప్పటివరకు. ఈ పాటల మొత్తం తెలంగాణ మాండలికం, జాతీయాలు, చమత్కారాలు పాట మొత్తం జరూర్ అవసరంగా ఉంది. తెలంగాణ తెలుగు చాల ద్రవిడంకూ చాలా దగ్గర ఉంది. తెలంగాణలో “ఒడిశిపోవుడు” అన్న మాట ఉంది. మలయాళంలో “ఒదువిల్” అంటె చివరికి, ఆఖరుకి అని అర్థం. ఇలాంటివి ఈ తెలంగాణ పదాలు ఇక్కడి వారికే గాక ఇతర ప్రాంతీయులు పరిచయం చేయాలన్న నా సంకల్పం నిజమైంది‌. తెలంగాణలో లయబద్దంగా మాట్లాడుకునే మాటతీరే తెలంగాణ పాటకు ఎక్కడలేని బలానిచ్చింది. తెలంగాణ మాట ఎంత నాదమో పాటలో తెలిసింది. తెలంగాణ మాటకు నాదం అద్దితే పాట సంగీతం రుద్దితే పాట లయను దిద్దితే పాట అసలు తెలంగాణమే తెలుగు గానం అనిపిస్తుంది.

చలో ధూం ధాం దునుకుడే అనేది ముగింపు తెలంగాణలో నలుగురు కూడితే అక్కడ ధూం ధామే ముచ్చట్లు, ఆట,పాట, మాట తెలంగాణ ఉద్యమ సమయంలో “ధూం ధాం” అన్నది దునియంతా వినబడింది. దునుకుడే ఎగురుడు,అడుడు.

సత్తె పమాణంగా సెబ్తున్న ఇసోంటి పాటైతే రాలేదన్నదని నువద్దే మాటే. ఇట్లుంటదా పాట అని గుసగుసలు బెట్టచ్చు. భాషుంది దాన్ని భుజాన వేసుకుని సిన్మా పాటుగా రాశాను.

వట్టికోట అల్వారు, దాశరథి రంగాచార్య, అల్లం రాజయ్య, యాదగిరి, గోరటి, మొదలైన వారు తెలంగాణా మాండలికంలో రచనలు జేసి, జేస్తూ ప్రజల మన్ననలను పొందారు. గ్రామాల్లో జరిగే ఎవుసంలా, పెండ్లిల్ల, యాత్రలు, జాతరలో,ఆర్థిక విషయాల్లో మొదలైన పనుల్లో ఈ పదాలు వినబడుతాయి. మడిపల్లి భద్రయ్య మనభాష మనయాస ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యవహారం భాషా పదకోశంలో ఒక యాభై వేల పదాలు ప్రజలు నాలుకల సంపదని నిఘంటువు తీసుకొచ్చారు. పాలమూరు పాండిత్యం కపిలవాయి తీసుకొచ్చారు. ఇదంతా అసలైన తెలంగాణ భాష సినిమాల్లో మాటలుగా పాటలుగా వస్తే భాష మరింత జనాలకి చేరుతుంది. మానవజాతి యాత్రకు సామూహిక గుండెచప్పుడు భాషకు పాటతో కొత్త సాహితీ లోకాన్ని కుదిపేసే పాటుగా నిలుస్తున్నది నిజం. అవ్వభాషను ఎక్కువగా వాడాలని సిఫార్సు.

ఇగవటుండ్రి
సౌ సారా పాట అక్కల చంద్రమౌళి
పరేషాన్ గీత రచయిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X