“మహిళ రిజర్వేషన్ పోరాటానికి సన్నద్ధం కావాలి”

మహిళా లోకానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు

హైదరాబాద్: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్న పోరాటానికి సన్నద్ధం కావాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మంగళవారం నాడు మల్లారెడ్డి విద్యాసంస్థల్లో మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ… మహిళగా మనం సహచర మహిళలకు ఏం చేస్తున్నామన్నది ముఖ్యమని, సాటి మహిళలకు ఏదైనా చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. తనకన్నా ముందున్నతరంలో మహిళలు స్వతంత్రం కోసం పోరాటం చేశారని, తన తరంలో మహిళలు తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నారని, ఆ తర్వాత ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ పోరాటాన్ని తన ముందుకు తీసుకెళ్తున్నానని స్పష్టం చేశారు.

భవిష్యత్తు మహిళా తరానికి మీరు ఏమి చేస్తారు ఆలోచించాలని సూచించారు. లింగ సమానత్వం, మహిళలకు పురుషులకు సమానమైన వేతనాలు పనిగంటలు ఉండాలన్న కోసం మహిళా దినోత్సవం వచ్చిందని, కానీ మనదేశంలో ఇంకా అసమానతలు అలానే ఉన్నాయని, సమానత్వం ఇంకా రాలేదని తెలిపారు. సమానమైన వేతనాల కోసం ఆడపిల్లలు డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. మహిళా విద్యార్థులు ఆయా కంపెనీలు వచ్చే జీతాలను అధ్యయనం చేయాలని, పురుషులకు ఇచ్చే జీతాలతో సమానంగా తమకు ఇవ్వాలని డిమాండ్ చేయాలని అన్నారు.

మార్పు ఇక్కడి నుంచి మొదలు కావాలని అన్నారు. చదువుకోవడం ఉద్యోగం చేయడం అన్న పద్ధతి కొంచెం పాతగా అయిందని, ఉద్యోగం చేసి అనుభవం గడించి మనమే ఒక పెద్ద పరిశ్రమ స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాలన్న పద్ధతి రావాలని అభిప్రాయపడ్డారు. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం చేద్దామన్న ఆలోచన కాకుండా మనమే ఒక బహుళ జాతి సంస్థను ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచన చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈరోజు ఉన్న సాంకేతికత, అవకాశాల నేపథ్యంలో చిన్న ఐడియా, నిబద్ధత, పట్టుదల ఉంటే చాలని, డబ్బులు వాటంతట అదే వస్తాయని స్పష్టం చేశారు. ఐడియాలు ఉంటే సహాయం చేయడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంటాయని చెప్పారు. ఒక ఐడియాతో వస్తే మార్గ నిర్దేశం చేయడానికి, వనరులు సమకూర్చడానికి, కంపెనీని స్థాపించడానికి టి- వర్క్స్, టి- హబ్ వంటివి అన్ని రకాల మద్దతు అందిస్తాయని పేర్కొన్నారు.

“ఆడపిల్లలు స్మార్ట్ గా ఉండడమే కాదు స్మార్ట్ ఫోన్ లా ఉండాలి. జీవితంలోకి ఎవరు కావాలో వాళ్ళని రానివ్వాలి. నెగటివ్ వ్యక్తులను రానివ్వకూడదు. అందరూ చెప్పినది ఓపికగా వినాలి. కానీ మన మనసు ఏది చెప్తే అదే చేయాలి.” అని వ్యాఖ్యానించారు.

ఎవరైనా కామెంట్ చేస్తే నవ్వి వాళ్లను విస్మరించాలని విద్యార్థినులకు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ఆడపిల్లలను వేధిస్తే ఫిర్యాదు చేయకుండానే వారి ఖాతాలను తొలగించే విధానం రావాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X