హైదరాబాద్ : ఆకాశంలో సగమైన ఆడబిడ్డలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కీలక సదస్సు నిర్వహించనున్నారు. భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం (సంవిధాన్ దివస్) ‘‘మహిళలు – రాజ్యాంగం’’ సదస్సు నిర్వహిస్తున్నారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీకి చెందిన మహిళా నాయకులు, కార్యకర్తలు వెయ్యి మందికి పైగా హాజరుకానున్నారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు గడిచినా మహిళలకు ఇప్పటికీ రాజ్యాంగ ఫలాలు అందకపోవడం, వివిధ వృత్తుల్లో స్థిరపడిన మహిళలు సైతం ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పౌరులుగా జీవితాలు వెళ్లదీయాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతుండటం సహా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో చర్చించనున్నారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం సీట్లు సాధించుకోవడం మాత్రమే కాదు రాజ్యాధికారంలోనూ అదే దామాషాలో వాటా సాధించడమే ధ్యేయంగా సదస్సు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు దక్కినా అక్కడా కుటుంబ సభ్యుల నీడలో మహిళలు పదవుల్లో కొనసాగాల్సి రావడంపై చర్చించనున్నారు.
Also Read-
పనిలో.. గనిలో.. ఖార్కానాలో.. సగమైన నారీశక్తికి గౌరవ ప్రదమైన వేతనాలు అందకపోవడం.. పని ప్రదేశాల్లో కొనసాగుతున్న వివక్ష.. ఆడబిడ్డలు అంతరిక్షంలో విహరిస్తున్న రోజుల్లోనూ కొనసాగుతున్న బాల్య వివాహాలు.. అందుకు దారితీస్తున్న పరిస్థితులపైనా సదస్సులో చర్చిస్తారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జీలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీలుగా ప్రకటించిన మహిళా నాయకులతో పాటు పలువురు సీనియర్ నాయకులు సదస్సులో ప్రసంగిస్తారు. రాజ్యాంగ ఫలాలు మహిళలు అందిపుచ్చుకోవడానికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి.. తెలంగాణ రక్షణ సేన పార్టీ మహిళలకు రాజ్యాధికారం కోసం ఎలాంటి ప్రణాళికలు అమలు చేయబోతుంది.. ఆడబిడ్డలు, సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలను అందలం ఎక్కించడానికి ఎలా ముందడుగు వేయబోతున్నారు అనే అంశాలపై పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. పార్టీకి చెందిన మహిళా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు
