మెదక్ : సెయింట్ జార్జ్ బాలికల గ్రామర్ స్కూల్‌లో 2026 స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ‘మొమెంటం–ది పవర్ ఆఫ్ మూవింగ్ ఫార్వర్డ్’ (ముందుకు సాగడమే శక్తి) అనే థీమ్‌తో నిర్వహించిన ఈ క్రీడా సంబరాలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా – మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మెదక్ డయాసిస్ బిషప్, సెయింట్ జార్జ్ విద్యాసంస్థల ఛైర్మన్ మోస్ట్ రెవ. ప్రొఫెసర్ డాక్టర్ కె. రూబెన్ మార్క్ అధ్యక్షత వహించారు. రెవ. డాక్టర్ శ్రీమతి కె. ప్రిసిల్లా పరిమళ రూబెన్ మార్క్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడంతో క్రీడా వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ చేకూరింది. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
Also Read-

193 ఏళ్ల ఘనమైన విద్యా వారసత్వాన్ని కలిగిన సెయింట్ జార్జ్ బాలికల గ్రామర్ స్కూల్ విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ విద్యార్థినుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి. రూత్ లాజ్వంతి, స్పెషల్ ఆఫీసర్ ఆర్. సత్యానందం, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
