హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ 26 నుండి నవంబర్ 1, 2026 వరకు “నిఘా అవగాహన వారోత్సవాలు – 2026” (విజిలెన్స్ ఆవేర్నెస్ వీక్– 2026)ని నిర్వహిస్తోంది. ఈ ఏడాదికి “సత్యనిష్టతో సమృద్ధి” (सत्यनिष्ठा से समृद्धि) అనే అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం అక్టోబర్ 26న సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ (సి. జి. జి ) ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్ మరియు డైరెక్టర్ జనరల్, తెలంగాణ మాజీ డిజిపి రవి గుప్తా, ఐపిఎస్ (రిటైర్డ్) హాజరయ్యారు. గౌరవ అతిథులుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మరియు అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆశిష్ మెహ్రోత్రా కూడా పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ విభాగాల ప్రధానాధికారులు, సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ డివిజన్ల రైల్వే మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, అధికారులు మరియు సిబ్బంది చేత సత్యనిష్ట ప్రతిజ్ఞ చేయించడంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా, ముఖ్య అతిథి రవి గుప్తా, జనరల్ మేనేజర్, అదనపు జనరల్ మేనేజర్ మరియు సీనియర్ డిప్యూటీ జీఎంలతో కలిసి “అనిమిషా” విజిలెన్స్ బులెటిన్ 59వ సంచికను విడుదల చేశారు. ఈ బులెటిన్ దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది.

2026 విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా తెలంగాణ సీజీజీ ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్ & డైరెక్టర్ జనరల్, ఐపిస్ (రిటైర్డ్) రవి గుప్తా ఇతివృత్తంపై ప్రసంగిస్తూ, నిజాయితీ అంటే కేవలం ఆర్థిక అవినీతికి దూరంగా ఉండటం మాత్రమే కాదని, నైతికంగా పనిచేస్తూ మన వంతు ఉత్తమ కృషిని అందించడం కూడా అందులో భాగమని పేర్కొన్నారు. నిజాయితీ అనేది కేవలం ఒక నైతిక సద్గుణం మాత్రమే కాదని, దేశపట్ల విశ్వాసానికి , అభివృద్ధికి అది ఒక ముఖ్యమైన పునాది అని ఆయన నొక్కి చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన “ఎక్కడ సత్యనిష్ఠ ఉంటుందో అక్కడ విశ్వాసం ఉంటుంది; ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది; ఎక్కడ అభివృద్ధి ఉంటుందో అక్కడే నిజమైన శ్రేయస్సు ఉంటుంది” (జహా సత్యానిష్ట హై , వహి విశ్వాస్ హై ; జహా విశ్వాస్ హై వహి వికాస్ హై ఔర్ జహా వికాస్ హై, వాహిన్ వాస్తవిక్ సమృద్ధి హై) అనే సందేశాన్ని అందించారు. ప్రతిఒక్కరూ పరవేక్షణలేని సమయంలో కూడ తమ స్వీయ భాద్యతను సరైన పద్దతిలో నిర్వర్తించాలి, అప్పుడే సంస్థ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సభను ఉద్దేశించి మాట్లాడుతూ నివారణా నిఘా ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. నిఘా విభాగం యొక్క భాద్యత తప్పులను గుర్తించడం కాదని, అవకతవకలను నివారించడం, వ్యవస్థలను బలోపేతం చేయడం మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడం అని ఆయన పేర్కొన్నారు. రైల్వే లక్షలాది మంది ప్రయాణికులతో వ్యవహరిస్తూ, భారీ పరిమాణంలో సరుకు రవాణాను నిర్వహిస్తున్నందున, ఈ వ్యవస్థ పారదర్శకంగా పనిచేయడం మరియు ప్రయాణికులు మరియు వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టడం అత్యవసరం అని ఆయన అన్నారు.
Also Read
అంతకుముందు, దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన విలువలను పరిరక్షిస్తూ, నిజాయితీ, నైతికత మరియు అంకితభావంతో విధులు నిర్వర్తించేందుకు అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆశిష్ మెహ్రోత్రా స్వాగతోపన్యాసం చేసి, విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ప్రాముఖ్యత గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, అవినీతి వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ, విజిలెన్స్ అవగాహన వారోత్సవం యొక్క ప్రధాన సందేశాన్ని చాటిచెప్పే విధంగా రైల్వే సిబ్బంది “తీస్రీ ఆంఖ్” పేరిట నాటకాన్ని ప్రదర్శించారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, చీఫ్ విజిలెన్స్ కమిషన్ (సి.వి.సి) నిర్దేశించిన ఇతివృత్తంపై రైల్వే పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వివిధ రైల్వే కార్యాలయాల సిబ్బంది ఇంగ్లీష్, హిందీ భాషల్లో వ్యాసరచన పోటీలు, పోస్టర్ చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కార్యక్రమంలో బహుమతులను అందజేశారు.
