అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలు భేష్- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా వెల్లడి
- • ఘనంగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
- • ప్రముఖ సినీ దర్శకుడు, ప్రఖ్యాత కవి, నటులు బి. నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్
- • డిజిటల్ సాంకేతిక అవకాశాలతో సామాజిక లక్ష్యం సాధ్యం : వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
- • దూర విద్యతో ఉన్నత విద్యలో సమగ్ర మార్పులు: న్యాక్ పూర్వ డైరెక్టర్ ప్రొ. వి ఎస్ ప్రసాద్
- • 23 మంది పరిశోధక విద్యార్థులకు పిహెచ్.డి, ఎం.ఫిల్ డిగ్రీ ప్రదానం
- • 38 బంగారు పతకాల అందజేత
- • శ్రీ ఆశ్రిత కు మూడు బంగారు పతకాలు
- • రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీ ఎన్. సురేష్ కి ఓ బంగారు పతకం, బుక్ ప్రైజ్
హైదరాబాద్ : విద్యార్ధుల్లో నైపుణ్యాలు పెంపొందించడం, డిజిటల్ విద్య పై ఉన్నత విద్యాసంస్థలు దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. బుధవారం డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏఓయూ) ప్రాంగణంలో నిర్వహించిన 27వ స్నాతకోత్సవానికి ఆయన ఛాన్సలర్ హోదాలో హాజరై విద్యార్ధులకు ఎం.ఫిల్, పీహెచ్.డీ పట్టాలు, బంగారు పతకాలు, బుక్ ప్రైజ్ లను ప్రదానం చేసారు. అలాగే ప్రముఖ సినీ దర్శకుడు, ప్రఖ్యాత కవి, నటులు బి. నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్ పట్టాను గవర్నర్ ప్రధానం చేశారు.

ఈ సందర్బంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ గ్రామీణ, మారుమూల, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్న సేవలను, వారి అభ్యున్నతికి ఆ యూనివర్సిటీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఉన్నత విద్య వ్యాప్తికి, ఉన్నత విద్యలో రాష్ట్ర స్థూల నమోదు నిష్పత్తికి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గణనీయంగా దోహదపడుతోందని పేర్కొన్నారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 25 లక్షలకు పైగా విద్యార్థులకు విద్యావకాశాలను కల్పించిందని అన్నారు. సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి, నిరుపేదలకు, వెనకబాటుకు గురైన గిరిజన తెగలకు “సమత” స్కీం కింద ఉచిత విద్యను ప్రవేశపెట్టి వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు అని పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవలంభిస్తున్న విధానాలు జాతీయ విద్యా విధానం – 2020 స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందని శివ్ ప్రతాప్ శుక్లా వివరించారు. ఈ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులైన వారిలో సగానికి పైగా మహిళలే ఉన్నారని, “బేటీ బచావో బేటీ పడావో” లో భాగమేనని పేర్కొన్నారు. కుటుంభంలో ఒక మహిళ విద్యా వంతురాలు అయితే ఆ మహిళ ఆ కుటుంభాన్ని అభివృద్దివైపు పయనించేలా ముందుకు తీసుకెల్లుతుందని గవర్నర్ వెల్లడించారు.
Also Read-

వేగవంతమైన సాంకేతిక, ఆర్థిక మార్పులను ప్రస్తావిస్తూ పరిశ్రమలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీలు మార్కెట్ అవసరాలను మారుస్తున్నాయని, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయన్నారు. ఐ. టి. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ దూసుకెళ్తోందని చెప్పారు. పకృతి పరిరక్షణ యూనివర్సిటీ లో ప్లాస్టిక్ వాడకం నిషేధించడం అభినందించాల్సిన విషయం అన్నారు. అదే విధంగా యువత కూడా నిశాముక్త్ భారత్ వైపు అడుగు వేస్తూ వికసిత్ భారత్ లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత దేశాన్ని నిర్మించాలని దాని కోసం అందరూ ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. విద్యను మరింత అందుబాటులోకి, సరళంగా, ఆసక్తికరంగా, అభ్యాసకుడి-కేంద్రీకృతంగా మార్చడానికి సాంకేతికతను ఉపయోగించాలని, సాంప్రదాయ దూర విద్యా విధానాన్ని దాటి డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ విశ్వవిద్యాలయం వైపు పయనిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు.

ప్రముఖ సినీ దర్శకుడు, కవి బి. నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నందుకు ఆయనను గవర్నర్ అభినందించారు. నర్సింగ్ రావు ఒక విశిష్ట చలనచిత్ర దర్శకుడని, అతని కృషి తెలంగాణ సంస్కృతి, ప్రజలు, సామాజిక వాస్తవాలను విస్తృత జాతీయ, అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. పట్టభద్రులను ఉద్దేశించి గవర్నర్ శుక్లా ప్రసంగిస్తూ డిగ్రీలను ఒక కొత్త ప్రయాణానికి నాందిగా భావించాలని కోరారు. లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, క్రమశిక్షణతో పనిచేయాలని, నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలని, సమాజానికి సేవ చేయాలని సలహా ఇచ్చారు. విద్యకు నిజమైన కొలమానం కేవలం వ్యక్తిగత విజయం కాదని, సమాజానికి చేసిన సేవ అని అన్నారు. “వికసిత భారత్- 2047” లక్ష్యానికి అనుగుణంగా ఉన్నత విద్యావంతులు కృషి చేయాలని సూచించారు. పట్టభద్రులైన విద్యార్థులను, గోల్డ్ మెడల్ విజేతలను, అవార్డు గ్రహీతలను వారి కుటుంబాలను గవర్నర్ అభినందించారు.

డిజిటల్ విద్యతో సామాజిక లక్ష్యం వైపు పయనం : వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి
డిజిటల్ సాంకేతిక అవకాశాలతో సామాజిక లక్ష్యాన్ని మిళితం చేసి సమ్మిళితత్వం, నాణ్యత, ఉపాధి అవకాశాలు అందించే విద్యా కార్యక్రమాలను ప్రవేశపెట్టామని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ 27వ స్నాతకోత్సవంలో అధ్యక్షోపన్యాసం చేసారు. గత ఏడాదిగా సాధించిన ప్రగతి.. భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. బోధి, డిజిటల్ కంటెంట్, మూల్యాంకనం, అభ్యాసకుల సేవ, డిజిటల్ సర్టిఫికేషన్లను ఏకీకృతం చేస్తూ సమగ్ర ఓపెన్ డిజిటల్ విశ్వవిద్యాలయంగా పరివర్తనం చెందుతోందని ఆయన వెల్లడించారు. బీఆర్ఏఓయూ సుస్థిర విద్యా విభాగాలను బలోపేతం చేస్తూనే, అభివృద్ధి చెందుతున్న రంగాలలో నూతన విద్యా కార్యక్రమాలను ప్రవేశపెడుతుందన్నారు. విద్యార్ధుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, నైపుణ్య సామర్ధ్యాలు, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు వంటి అవకాశాలను అందిస్తుందని వివరించారు. డిజిటల్ పరివర్తన కొత్త డిజిటల్ అంతరాన్ని సృష్టించకూడదని ప్రొ. ఘంటా చక్రపాణి నొక్కి చెప్పారు. గ్రామీణ విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు, గిరిజన వర్గాలు, డిఫెన్స్ కుటుంబాలు, ఇతర వెనుకబడిన వర్గాలకు అందుబాటులో విశ్వవిద్యాలయ వ్యవస్థలు ఉండాలని పేర్కొన్నారు. విద్యా విస్తరణ ఎల్లప్పుడూ పటిష్టమైన నాణ్యత తో ఉండాలని సూచించారు.

ఓపెన్, డిస్టెన్స్ , డిజిటల్ విద్యపై పరిశోధనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక బలమైన కేంద్రంగా ఆవిర్భవించి, విస్తృత రంగానికి జ్ఞానాన్ని అందిస్తుందని తెలిపారు. కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL)తో విశ్వవిద్యాలయం భాగస్వామ్యం, అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ ఓపెన్ యూనివర్సిటీస్ (AAOU)తో అనుసంధానం, ఓపెన్, డిజిటల్ లెర్నింగ్‌పై ప్రపంచ చర్చలలో మరింత చురుకుగా పాల్గొనడానికి అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. ఓపెన్ యూనివర్సిటీకి అసలైన కొలమానం భవనాలు లేదంటే అందించిన డిగ్రీల సంఖ్య కాదని, ఎంత మంది జీవితాలను మెరుగుపరుచమనేదే అసలైన కొలమానమని ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. గత 45 ఏళ్లుగా విద్యా సూత్రాలకు కట్టుబడి సామాజిక లక్ష్యాన్ని డిజిటల్ టెక్నాలజీ అందించే అవకాశాలతో ఈ విశ్వవిద్యాలయం ముందుకు వెల్లుతోందని అన్నారు.

విశ్వవిద్యాలయం విద్యా కార్యక్రమాలను విస్తరించిందని, ఆన్లైన్, ఓడీఎల్ విద్యను బలోపేతం చేసిందని, బోధి వంటి వాటిని అభివృద్ధి చేసిందని, కొత్త భాగస్వామ్యాలను కుదుర్చుకుందని, అంతర్జాతీయ సంబంధాలను పెంచుకుందని, నైపుణ్య, ఉపాధి కల్పన కార్యక్రమాలను విస్తరించిందని పేర్కొన్నారు. సమానత్వం, సమ్మిళితత్వాన్ని తన లక్ష్యానికి కేంద్రంగా విద్యాభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిందని, నాణ్యతా హామీని బలోపేతం చేసిందని అన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ శిక్షణ, బాషా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వికసిత భారత్, తెలంగాణ రైసింగ్ 2047 కి అనుగుణంగా అనేక విద్యా కార్యక్రమాలను అందించేందుకు ప్రణాళికలు చేశామని వీసీ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం, యూజీసీ, ఎన్ఏఏసీ, సీఓఎల్, సీఈఎంసీఏ, పీఎం-ఉష, జాతీయ, అంతర్జాతీయ విద్యా భాగస్వాములు, పారిశ్రామిక భాగస్వాములు, పూర్వ విద్యార్థులు, ఇతర సంస్థలు అందించిన మద్దతును ఘంటా చక్రపాణి అభినందించారు. కార్యనిర్వాహక మండలి, శాసన సంస్థల సభ్యులు, రిజిస్ట్రార్, డైరెక్టర్లు, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపక బృందం, అధికారులు, పరిపాలనా సిబ్బంది, సాంకేతిక బృందాలు, ఇతర ఉద్యోగులు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. విశ్వవిద్యాలయం పురోగతి సమష్టి కృషి ఫలితమేనని అన్నారు.

ఓపెన్ యూనివర్సిటీలతో ఉన్నత విద్యలో సమగ్ర మార్పులు : న్యాక్ పూర్వ డైరెక్టర్ ప్రొ. వి. ఎస్ ప్రసాద్
అన్ని వయసుల వారికి, వివిధ ప్రాంతాల, పలు సామాజిక నేపథ్యాల ప్రజలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఓపెన్ యూనివర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాయని నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) పూర్వ డైరెక్టర్, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ వైస్-ఛాన్సలర్ ప్రొ. వి. ఎస్. ప్రసాద్ అన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 27వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని స్నాతకోత్సవ ప్రసంగం చేసారు. భారత ఉన్నత విద్యా వ్యవస్థలో ఓపెన్ యూనివర్సిటీ విధానం ప్రారంభంలో విద్యాపరమైన విశ్వసనీయత, గుర్తింపుపై ఆందోళనలను ఎదుర్కొన్నాయని అన్నారు. ఉన్నత విద్య ప్రజాస్వామ్యీకరణకు ఓపెన్ యూనివర్సిటీ వ్యవస్థ గణనీయంగా దోహదపడిందని చెప్పారు. ఇంటి వద్దకే విశ్వవిద్యాలయం రావడం అనేది విద్యా ప్రజాస్వామ్యానికి ఒక విశిష్ట లక్షణమని అన్నారు. ఉన్నత విద్య ఖర్చును ఓడీఎల్ వ్యవస్థ తగ్గించిందని, దేశంలోని ఓపెన్ యూనివర్సిటీలు నైపుణ్యాలు, జ్ఞానాన్ని మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టాయని ప్రొ. ప్రసాద్ అన్నారు. వికసిత్ భారత్ @ 2047 దార్శనికత కింద అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర భారతదేశానికి అవసరమైన మానవ వనరులను నిర్మించడానికి ఇటువంటి ప్రయత్నాలు ముఖ్యమైనవని తెలిపారు.

అభ్యాసకుల సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి బహుళవిషయక విద్యకు ఎన్ఈపీ 2020 మార్గదర్శకాలను సార్వత్రిక విశ్వవిద్యాలయాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడం వల్ల తలెత్తుతున్న నైతిక సమస్యలపై ప్రొ. ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ అభివృద్ధికి ఒక సాధనంగానే ఏఐ ఉండాలని మనుషులకు యజమాని కాకూడదని సూచించారు. విశ్వసనీయతను నిలబెట్టుకోవడానికి, సమాజ నమ్మకాన్ని పొందడానికి పారదర్శక కార్యకలాపాలు, నమ్మకమైన పరీక్షా విధానం చాలా అవసరమని వెల్లడించారు. విశ్వవిద్యాలయాలు విజయాల పట్ల ‘అహం-కేంద్రీకృత’ దృక్పథం నుండి ‘సామాజిక-కేంద్రీకృత’ దృక్పథం వైపు మారాలని ప్రొ. ప్రసాద్ పిలుపునిచ్చారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, వినూత్న ఓ డి ఎల్, ఆన్లైన్ కార్యక్రమాలు, అభివృద్ధి నెట్వర్కింగ్, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల సృజనాత్మక వినియోగంపై వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి దృష్టి సారిస్తూ ఒక ప్రణాళికా ప్రకారం నిర్దేశించుకున్న అభివృద్ధి నమూనాతో విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహిస్తున్నారని కొనియాడారు.

ఈ 27 వ స్నాతకోత్సవంలో 23 మంది పరిశోధక విద్యార్థులకు పిహెచ్.డి, ఒకరికి ఎం.ఫిల్ డిగ్రీ ప్రదానం చేసారు. యు.జి.లో 16, పి.జి.లో 22 మొత్తం 38 బంగారు పతకాలను అందజేశారు. పతకాలు అందుకున్నవారిలో మహిళలు 29, పురుషులు తొమ్మిది మంది ఉన్నారు. యు.జి.లో మహిళలు 14, పురుషులు రెండు బంగారు పతకాలను అందుకున్నారు. పి.జి.లో మహిళలు 15, పురుషులు ఏడు బంగారు పతకాలను అందుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చెందిన ఓ ఖైదీ అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడై బంగారు పతకం, బుక్ ప్రైజ్ అందుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్నాతకోత్సవంలో మొత్తం 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ/పీజీ/డిప్లొమా/సర్టిఫికెట్లు కోర్సుల్లో పట్టాలు ప్రదానం చేసారు. స్నాతకోత్సవంలో 26 మంది పురుష ఖైదీలు, ఒక మహిళా ఖైదీతో సహా మొత్తం 27 మంది (చెర్లపల్లి సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైలు నుండి) డిగ్రీలు అందుకున్నారు. వీరిలో యు.జి. లో 12, పి.జి.లో 15 మంది ఉన్నారు.

శ్రీఆశ్రిత కు మూడు బంగారు పతకాలు : యు.జి. ప్రోగ్రామ్ లో బొజ్జనపల్లి శ్రీఆశ్రిత మూడు బంగారు పతకాలు, కడియాల సాయిభాను రెండు బంగారు పతకాలు, హజీరా బేగం రెండు బంగారు పతకాలు, శివ పార్వతి చిప్పల రెండు బంగారు పతకాలు, నుకపెయ్యి సురేష్ (ఖైదీ) ఒక బంగారు పతకం, బుక్ ప్రైజ్ అందుకున్నారు. పి.జి. ప్రోగ్రామ్ లో మంతెన శ్రీదేవి రెండు బంగారు పతకాలు, తోట శ్వేత రెండు బంగారు పతకాలు అందుకున్నారు.
కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి సభ్యులు ప్రొ. వి. నిత్యానంద రావు, బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి, బి. వెంకటేశ్వర్ రావు, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్ విజయ కృష్ణా రెడ్డి, జి ఆర్ సి ఆర్ డి డైరెక్టర్ ప్రొ. ఈ. సుధారాణి, డీన్స్ ప్రొ ఆనంద్ పవర్, ప్రొ. పల్లవి కాబ్డే, ప్రొ. చంద్రకళ, ప్రొ రాణి రజిత మాధురి, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై వెంకటేశ్వర్లు, ఈ ఎం ఆర్ ఆర్ సి డైరెక్టర్ ప్రొ. పి వెంకట రమణ, సి ఓ ఈ ఎల్ డైరెక్టర్ ప్రొ. కె శ్రీదేవి, సి.ఐ.క్యూ.ఏ. డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలొమన్, పరీక్షల నిర్వహణ అధికారి ప్రొ. జి. దయాకర్, ఆయా విభాగాల అధిపతులు, డైరెక్టర్స్, ఎక్కువ సంఖ్యలో విద్యార్ధులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
