హైదరాబాద్ : డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్ఏఓయూ), హైదరాబాద్ ఆధ్వర్యంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) అకాడమీ ఓరియంటేషన్ సదస్సు బుధవారం (2026 సెప్టెంబర్ 23) విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన అధ్యాపకులు, విద్యారంగ ప్రముఖులు, సంస్థాగత భాగస్వాములు హాజరయ్యారు. ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, స్ట్రాటజీ & ఫీల్డ్ విభాగాధిపతి శ్రీ తేజస్ వాషి, ఏడబ్ల్యూఎస్ స్కిల్లింగ్ & సోషల్ ఇంపాక్ట్ (భారత్) స్ట్రాటజీ & ఫీల్డ్ కంట్రీ మేనేజర్ శ్రీమతి ప్రతిభా సింగ్, సైయెంట్ ఫౌండేషన్ సీఎస్ఆర్ విభాగాధిపతి శ్రీ కృష్ణ దీవితో కూడిన ఏడబ్ల్యూఎస్ బృందం ఈ సదస్సును నిర్వహించింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, ఈ సదస్సు అధ్యాపకులు, విద్యారంగ నాయకులు, సంస్థాగత భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని అన్నారు. ఏడబ్ల్యూఎస్ అకాడమీ, ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్, ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్ వంటి ఏడబ్ల్యూఎస్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ఈ సదస్సు సమగ్ర అవగాహన కల్పించిందని తెలిపారు.
సదస్సులో ఏడబ్ల్యూఎస్ అకాడమీ ప్రతినిధులు కార్యక్రమ వివరాలు, సభ్యత్వ విధానం, ఉన్నత విద్యాసంస్థలకు అర్హత ప్రమాణాలను సమగ్రంగా వివరించారు. సంస్థాగత నమోదు నుంచి అధ్యాపకుల గుర్తింపు (అక్రెడిటేషన్), లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ఏర్పాటు వరకు దశలవారీ ప్రక్రియపై పాల్గొన్నవారికి అవగాహన కల్పించారు. ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ మార్గాలకు అనుగుణంగా రూపొందించిన పాఠ్యప్రణాళిక నిర్మాణాన్ని వనరుల వ్యక్తులు వివరించారు. వొకేరియం (Vocareum) వేదిక ఆధారిత ప్రయోగాత్మక ల్యాబ్‌లు, ల్యాబ్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత (స్టెమ్) విభాగాలతో పాటు ఇతర విభాగాలకూ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Also Read-
ప్రాంతీయ ప్రోగ్రామ్ మేనేజర్ల ద్వారా నిరంతర సహకారం, అధ్యాపకుల సామర్థ్యాభివృద్ధి వర్క్‌షాప్‌లు, హ్యాకథాన్‌లు, క్లౌడ్ క్లబ్‌ల వంటి విద్యార్థి కేంద్రిత కార్యక్రమాలు, క్లౌడ్ విద్యా బోధనను నిరంతరం మెరుగుపరిచేందుకు పటిష్ఠమైన అభిప్రాయ సేకరణ వ్యవస్థలతో కూడిన భాగస్వామ్య విధానం సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చివరగా ప్రశ్నోత్తరాలు, పరస్పర చర్చా కార్యక్రమం జరిగింది. పలు విద్యాసంస్థలు ఏడబ్ల్యూఎస్ అకాడమీలో చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. అనంతరం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, డీన్లు, డైరెక్టర్లు ఏడబ్ల్యూఎస్ బృందం, సైయెంట్ ఫౌండేషన్ బృందంతో సమావేశమై చర్చించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయం చేపట్టిన డిజిటల్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. విశ్వవిద్యాలయ ప్రగతి ప్రస్థానాన్ని, డిజిటలీకరణ దిశగా సాధించిన అభివృద్ధిని వివరించారు. బీఆర్ఏఓయూ నుంచి ఉత్తీర్ణులై ఉపాధి లేని లేదా తగిన ఉపాధి పొందని పట్టభద్రుల ప్రయోజనం కోసం ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్‌తో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు. అమెజాన్‌కు పెద్ద ఎత్తున గిడ్డంగులు ఉన్నందున, వాటి సరైన నిర్వహణకు సమర్థులైన మానవ వనరులు అవసరమని, ఈ నేపథ్యంలో వేర్‌హౌసింగ్ & లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందించే అవకాశాన్ని పరిశీలించాలని ప్రొ. చక్రపాణి ఏడబ్ల్యూఎస్ బృందాన్ని కోరారు. ఈ ఉద్యోగ అవసరాలకు అనుగుణమైన కోర్సులను బీఆర్ఏఓయూ విద్యార్థులకు అందిస్తే వారి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. భవిష్యత్ నైపుణ్యాల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కీలక రంగమని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమమలో పాల్గొన్న తేజస్ వాషి మాట్లాడుతూ, ఏడబ్ల్యూఎస్ అకాడమీ అందిస్తున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన క్లౌడ్ కంప్యూటింగ్, నూతన సాంకేతిక నైపుణ్య కోర్సుల గురించి వివరించారు. ఈ కోర్సులు సైద్ధాంతిక అభ్యాసాన్ని ఏడబ్ల్యూఎస్ సాంకేతికతలతో ప్రత్యక్ష అనుభవంతో మేళవిస్తాయని, తద్వారా ఆధునిక ఐటీ, డిజిటల్ రంగాల్లో ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను అభ్యాసకులు పెంపొందించుకోవచ్చని తెలిపారు. శ్రీమతి ప్రతిభా సింగ్ మాట్లాడుతూ, ఏడబ్ల్యూఎస్ అకాడమీతో భాగస్వామ్యం ద్వారా అభ్యాసకులకు క్రమబద్ధమైన క్లౌడ్ నైపుణ్య అవకాశాలు, ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న సాంకేతికతలపై ప్రత్యక్ష అనుభవం లభిస్తాయని, ఇది విశ్వవిద్యాలయ డిజిటల్ అభ్యాస, ఉపాధి కల్పన కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందని అన్నారు.
ఏడబ్ల్యూఎస్ అకాడమీతో సహకారం ద్వారా, ముఖ్యంగా బీఆర్ఏఓయూ సార్వత్రిక మరియు దూరవిద్యా విధానం ద్వారా, తెలంగాణలోని అభ్యాసకులకు క్లౌడ్ నైపుణ్య విద్య గణనీయంగా బలోపేతమై, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సమావేశం అభిప్రాయపడింది.
