“ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి, హుస్సేన్ సాగర్‌లో యథావిధిగా వినాయక నిమజ్జనాలకు అనుమతివ్వాలి”

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర హాస్టల్ వసతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలాగే సంప్రదాయబద్ధంగా హుస్సేన్ సాగర్ (వినాయక సాగర్) వేదికగా జరిగే గణేష్ నిమజ్జనాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అనుమతినిచ్చి, సకల సౌకర్యాలు కల్పించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

నవరాత్రి ఉత్సవాల వేళ ఉస్మానియా విశ్వవిద్యాలయం తనదైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటుకుంటోందని, క్యాంపస్‌లోని ప్రతి హాస్టల్‌లో విద్యార్థులు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాంచందర్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను చదివిన కాలేజీ హాస్టల్, ‘ఈ’ హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టళ్లను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ముఖ్యంగా పరిశోధక విద్యార్థులుండే ఓల్డ్ పీజీ హాస్టల్ నుండి దాదాపు 15 మంది విద్యార్థులు పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లు మరియు ఐసీహెచ్‌ఆర్ (ICHR) అర్హతలు సాధించడం గర్వకారణమని, వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

అయితే, విద్యార్థుల వసతి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని ఆయన విమర్శించారు. ‘ఈ’ హాస్టల్ విద్యార్థులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా బలవంతంగా ‘సి’ హాస్టల్‌కు మార్చడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ అభివృద్ధికి రూ. 1000 కోట్లు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పటివరకు ఆ నిధుల ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. విద్యాశాఖ బాధ్యతలు కూడా స్వయంగా ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున, తక్షణమే ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థకు చేరిన పాత హాస్టళ్ల స్థానంలో అత్యాధునిక నూతన వసతి గృహాలను నిర్మించాలని, ప్రస్తుత భవనాలకు తక్షణ మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.

Also Read-

మరోవైపు, హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా హుస్సేన్ సాగర్‌ను ‘వినాయక సాగర్’గా భావించి భక్తులు నిమజ్జనోత్సవాలు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రధాన సాగర్‌లో నిమజ్జనాలను నిలిపివేసి, బ్యాక్‌వాటర్స్ వైపు మళ్లించే ప్రయత్నాలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఖైరతాబాద్‌లోని 70 అడుగుల మహాగణపతి, కొత్తపేటలోని 73 అడుగుల విగ్రహాలతో పాటు నగరవ్యాప్తంగా లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తాయని తెలిపారు. భారీ క్రేన్లు, నిరంతర పారిశుధ్య పనుల ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేసిన వెంటనే వ్యర్థాలను తొలగించి పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా నిర్వహించే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేస్తున్న న్యాయమైన డిమాండ్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని రాంచందర్ రావు తెలిపారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ప్రజాప్రతినిధులు, పోలీసు మరియు ప్రభుత్వ యంత్రాంగ సమన్వయంతో ఉత్సవాలు సాఫీగా సాగేందుకు హుస్సేన్ సాగర్‌లోనే గణేష్ నిమజ్జనానికి పూర్తి అనుమతినివ్వాలని, అవసరమైన అన్ని మౌలిక వసతులు, బందోబస్తు ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar