తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపు

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవ’ (హైదరాబాద్ ముక్తి దివస్) ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఫరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కేంద్ర సాయుధ బలగాల కవాతు (పరేడ్) రిహార్సల్స్, సాంస్కృతిక ప్రదర్శనల సన్నాహాలను వీక్షించిన అనంతరం భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, వీఐపీ ప్రొటోకాల్ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించి, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని జి. కిషన్ రెడ్డి ఆదేశించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్య్ర పండుగ చేసుకుంటుంటే, ఆనాడు నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మనకు స్వాతంత్య్రం రాలేదని స్పష్టం చేశారు. గ్రామగ్రామాన రజాకార్లు హిందువులపై దాడులు, దమనకాండ కొనసాగిస్తూ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ దమనకాండ నుంచి తమను, గ్రామాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలే స్వయంగా బురుజులు, రక్షణ గోడలు నిర్మించుకుని నిలబడ్డారని, ఆనాటి రక్త చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, గుర్తులు నేటికీ మన పల్లెల్లో సజీవంగా కనిపిస్తాయని గుర్తుచేశారు. ఇది ఏ ఒక్కరికో సంబంధించిన కార్యక్రమం కాదని, ఆనాడు నిజాం పెట్టిన బాధలను భరించి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల స్మరించుకోవడం కోసమే భారత ప్రభుత్వం అధికారికంగా ‘హైదరాబాద్ ముక్తి దివస్’ను ప్రారంభించిందని తెలిపారు.

గతంలో బీఆర్ఎస్ పార్టీ గానీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గానీ మజ్లిస్ పార్టీకి భయపడి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను సైతం పక్కనపెట్టి, ఈ చారిత్రక దినోత్సవాన్ని నిర్వహించకుండా తప్పించుకున్నాయని కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముందుకు రాకపోవడంతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత ప్రభుత్వమే స్వయంగా బాధ్యత తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహిస్తోందని చెప్పారు.

Also Read-

ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా కేంద్ర సాయుధ దళాల విన్యాసాలతో పాటు, ప్రత్యేకంగా వేలాది మంది తెలంగాణ కళాకారులతో కూడిన ఆకర్షణీయమైన నాట్య ప్రదర్శనలు, సంప్రదాయ డప్పుల విన్యాసాలు చారిత్రక పోరాటాలను కళ్లకు కట్టేలా ఉంటాయని పేర్కొన్నారు. ఈ చారిత్రక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి రాధాకృష్ణన్ గారు మరియు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో పాటు పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడిస్తూ.. తెలంగాణ పౌరుషాన్ని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X