హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 7న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించ తలపెట్టిన ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ విద్యార్థి మహాధర్నాకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడాన్ని బీజేపీ తీవ్రంగా ఆక్షేపించింది.
ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేసుకోవడానికి స్థలం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని, రేపు ఉదయం వేలాది మంది విద్యార్థులు, యువకులు, లక్షలాది మంది కార్యకర్తలతో, పార్టీ శ్రేణులతో కలిసి నేరుగా అసెంబ్లీని ముట్టడిస్తామని నేతలు స్పష్టం చేశారు. ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతo రావు, వేముల అశోక్, వీరేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వ, పోలీసుల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
ధర్నాకు అనుమతి నిరాకరణ తో అసెంబ్లీ వద్దకే విద్యార్థులు : డా. ఎన్. గౌతo రావు
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్. గౌతo రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో పేద విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. వారి పక్షాన బీజేపీ రాష్ట్ర శాఖ ఉద్యమాలు చేపట్టిందని, ప్రతి కళాశాలకు వెళ్లి బీజేవైఎం ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల మంది విద్యార్థుల నుంచి వారి సమస్యలు, ఫీజు బకాయిల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు, సంతకాలు సేకరించి భారీ నివేదికను సిద్ధం చేశామని తెలిపారు. గతంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాoచందర్ రావు గారు విద్యార్థుల కోసం రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. ఆ వినతిపత్రాలను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు లేఖ రాసినా స్పందించకపోవడంతో, ఎంపీలు, శాసనసభాపక్ష నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు కలిసి సీఎస్‌కు ఇవ్వడానికి వెళ్తే అక్రమంగా అరెస్టులు చేశారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతో అణచివేసే సంస్కృతిని కొనసాగిస్తోందని ఆరోపించారు. రేపటి మహాధర్నా కోసం వారం రోజుల క్రితమే దరఖాస్తు చేస్తే, అనుమతి ఇస్తామని కాలయాపన చేస్తూ చివరికి ఈ రోజు సాయంత్రం అనుమతి ఇవ్వలేమని చెప్పడం దారుణమన్నారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, తెలంగాణలో తమ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ అప్రజాస్వామిక చర్యలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ధర్నా చౌక్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేయడానికి అనుమతి ఇవ్వకుండా అసెంబ్లీ నడుస్తోందని సాకులు చెబితే సహించబోమన్నారు. ఇప్పటికైనా ధర్నా చౌక్‌లో అనుమతి ఇవ్వాలని, లేనిపక్షంలో రేపు ఉదయం 10 గంటలకల్లా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Also Read-
నిరాకరణ పత్రంపై విద్యార్థి లోకంతో తేల్చుకుంటాం: వేముల అశోక్
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా ధర్నా నిర్వహించుకోవడానికి ఐదు రోజుల క్రితమే పోలీసులకు అధికారికంగా దరఖాస్తు ఇచ్చామని తెలిపారు. అయితే ఐదు రోజుల తర్వాత దోమల్‌గూడ సీఐ ఫోన్ చేసి దరఖాస్తును తిరస్కరిస్తున్నామని చెప్పారని, అనంతరం లేని విషయాలన్నీ క్రోడీకరిస్తూ తిరస్కరణ పత్రాన్ని చేతిలో పెట్టారని వివరించారు. గతంలో రైతుల సమస్యలపై లా అండ్ ఆర్డర్‌కు ఎటువంటి విఘాతం కలగకుండా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు నిర్వహించిన చరిత్ర బీజేపీకి ఉందని గుర్తుచేశారు. కానీ పోలీసులు మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే అర్థం వచ్చేలా నిరాకరణ లేఖ ఇవ్వడం గర్హనీయమన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాoచందర్ రావు గారి నాయకత్వంలో పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం సంకల్పించిన ధర్నాను అడ్డుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని తేల్చిచెప్పారు. పోలీసులు ఇచ్చిన ఈ రిజెక్షన్ లెటర్‌ను ప్రజల దగ్గరకు, విద్యార్థుల దగ్గరకు తీసుకెళ్తామని, ప్రభుత్వం ఏ విధంగా హక్కులను కాలరాస్తుందో వివరిస్తామని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి హక్కులు సాధించే వరకు బీజేపీ అండగా ఉంటుందని, రేపు విద్యార్థులతో కలిసి అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
బెంగాల్ తరహా అరాచక పాలన సాగిస్తున్నారు: వీరేందర్ గౌడ్
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బెంగాల్‌లో ఎవరైనా ప్రజా సమస్యలపై గొంతు విప్పితే పోలీసులను, రౌడీషీటర్లను అడ్డం పెట్టుకుని ఎలాగైతే అణచివేశారో, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే తరహా అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. గతంలో శ్రీ ఎన్. రాoచందర్ రావు గారు పార్టీ కార్యాలయం బయట రెండు రోజుల దీక్ష చేస్తామంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదని, చివరికి కార్యాలయం లోపలే దీక్ష చేపడితే దాదాపు 30 వేల మంది విద్యార్థులు తరలివచ్చి మద్దతు తెలిపారని గుర్తుచేశారు. ఈసారి ముందస్తుగానే ఐదు రోజుల క్రితం ధర్నా చౌక్ కోసం దరఖాస్తు చేసుకుంటే, అర్థంపర్థం లేని కారణాలు చూపుతూ, ఇతర విద్యార్థి సంఘాలతో ముడిపెడుతూ నిరాధారమైన అంశాలతో దరఖాస్తును తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు అనుమతులు ఇవ్వని పోలీసులు, గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు నల్లరంగు డబ్బాలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి దాడి చేస్తుంటే వారికి రంగు డబ్బాలు అందించే దుస్థితికి దిగజారారని ఆరోపించారు. నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై, వారి తల్లి గారిపై దాడి జరిగితే డీఎస్పీ చూస్తూ ఊరుకున్నారని, మంచిర్యాలలో మండల అధ్యక్షుడు ఆత్మహత్యాయత్నం చేసుకునేలా వేధించారని, ఆదిలాబాద్‌లో జిల్లా అధ్యక్షుడిపై రౌడీషీట్ తెరుస్తామని ఎస్పీ బెదిరింపులకు దిగారని వాపోయారు. కేసీఆర్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తోందని, ఇది ఎంతమాత్రం సరికాదని హెచ్చరించారు.
విద్యార్థి లోకం, తల్లిదండ్రులు అసెంబ్లీకి తరలిరావాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని నేతలు పేర్కొన్నారు. ధర్నా చౌక్ వద్ద విద్యార్థుల బాధలను చెప్పుకునే అవకాశం ఇవ్వనప్పుడు, చట్టసభల్లో కూర్చున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు వారి గోడు వినిపించడానికి నేరుగా అసెంబ్లీకే వస్తామని స్పష్టం చేశారు. పాలకులకు ధైర్యం ఉంటే బయటకు వచ్చి సమాధానం చెప్పాలని, లేకపోతే అసెంబ్లీ గేట్ల వద్దకే చేరుకుని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ పోరాటం నాయకుల స్వార్థం కోసం కాదని, భావి భారత పౌరులైన విద్యార్థుల హక్కుల కోసమేనని స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాoచందర్ రావు నాయకత్వంలో జరిగే ఈ ముట్టడి కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పోలీసులు ముందస్తు అరెస్టుల పేరుతో వేధింపులకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
రేవంత్ సర్కార్ మెడలు వంచుతాం: గణేష్ కుందే
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే మాట్లాడుతూ, విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో చేపట్టిన విద్యార్థి మహాధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, అక్రమ అరెస్టులు చేసినా రేపు ఉదయం 11 గంటలకు విద్యార్థులు, యువకులు కదం తొక్కుతారని చెప్పారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాoచందర్ రావు నేతృత్వంలో జరిగే ఈ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని, వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడించి తీరుతామని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువజనులు ఈ పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
