ఘనంగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవం, “ప్రజాస్వామ్యీకరించిన విద్యపై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాగ్దానం” పై వక్తల ఉపన్యాస

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్తిగా డిజిటల్ యూనివర్సిటీ రూపాంతరం చెందుతోందని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం “ప్రజాస్వామ్యీకరించిన విద్యపై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాగ్దానం” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పాల్గొని విశ్వవిద్యాలయ 45 ఏళ్ల ప్రస్థానాన్ని వివరించారు. గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధిని, తీసుకొచ్చిన సరికొత్త మార్పులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించిందన్నారు. సాంప్రదాయ విద్యా విధానంలో ఉన్నత విద్యను అభ్యసించలేని వారికి విద్యను అందించాలనే లక్ష్యంతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం, ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆన్‌లైన్ విద్య, కృత్రిమ మేధస్సు (AI) వంటి సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ పూర్తి స్థాయి డిజిటల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందుతోందని వివరించారు.

సాంకేతికతతో పాటు సమ్మిళితత్వం, అందరికీ అందుబాటులో ఉంటూ నాణ్యమైన విద్యకు ప్రాధాన్యతనిస్తూ విశ్వవిద్యాలయం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనా విధానాలకు అనుగుణంగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పయనిస్తోందని వెల్లడించారు. తాము తీసుకొచ్చిన అనేక ఆధునుక మార్పులు, డిజిటల్ విద్యా విధానం ప్రభుత్వ సంస్థలకు ఉపయోగకరంగా ఉందని వెల్లడించారు. అందులో భాగంగానే ఇటీవలే ఏఐ ఫర్ టీచర్స్ కోర్సులో ప్రభుత్వ స్కూల్స్ లో పనిచేసే టీచర్ లకు శిక్షణను ప్రారంభించామని వెల్లడించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా తమ యూనివర్సిటీ కి డిజిటల్ అండ్ ఆన్లైన్ మోడ్ లో కోర్సులు అందించడానికి అనుమతించిందని ఇక నుంచి డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ యూనివర్సిటీ గానే కాకుండా డిజిటల్ అండ్ ఆన్లైన్ యూనివర్సిటీ గా గుర్తింపు పొందనుందని వివరించారు.

కార్యక్రమంలో ప్రధాన వక్తగా కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా (సెమ్కా – న్యూఢిల్లీ) డైరెక్టర్ డా. బి. శడ్రక్ పాల్గొని “ప్రజాస్వామ్యీకరించిన విద్యపై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాగ్దానం” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. డా. బి. శడ్రక్ మాట్లాడుతూ, ఉన్నత విద్యను ప్రజాస్వామ్యీకరించడంలో ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ (ODL)కు ఉన్న సామర్థ్యాన్ని వివరించారు. డిజిటల్ సాంకేతికతలు, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, వినూత్న విద్యా విధానాల ద్వారా నాణ్యమైన విద్యను మరింత విస్తృతంగా అందించొచ్చని, భౌగోళిక, సామాజిక-ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి విద్యా అవకాశాలను కల్పించవచ్చని ఆయన వివరించారు. సాంప్రదాయ దూర విద్యలో నిర్ణీత సమయాలు, భౌగోళిక పరిమితులు ఉండేవని, అయితే నేడు అసమకాలిక (asynchronous) డిజిటల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు తమ సమయం, వేగం, భాషా ప్రాధాన్యత, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా విద్యను అభ్యసించగలుగుతున్నారని తెలిపారు. రైతులు, గృహిణులు, ఉద్యోగులు తమ రోజువారీ బాధ్యతలను నిర్వహించుకుంటూనే విద్యను సులభంగా కొనసాగించవచ్చని, కృత్రిమ మేధస్సు ఆధారిత సొంతంగా చదువుకోవడం ద్వారా విద్య మరింత అందుబాటులోకి వచ్చిందని, విద్యార్థి – కేంద్రంగా మారిందని డా. బి.శడ్రక్ పేర్కొన్నారు.

డిజిటల్ ODL సంప్రదాయ విశ్వవిద్యాలయాల భౌతిక పరిమితులను అధిగమించి, అంబేద్కర్ విశ్వవిద్యాలయం వంటి విద్యా సంస్థలు నాణ్యమైన ఉన్నత విద్యను విస్తృత స్థాయిలో అందించడానికి, ఒక్కో విద్యార్థిపై వ్యయాన్ని తగ్గించడానికి, కోర్సు కంటెంట్‌ను నిరంతరం మార్చుకోవడానికి వీలు కల్పిస్తోందని వివరించారు. డిజిటల్ యుగంలో దూర విద్య ఇకపై సంప్రదాయ విద్యకు ద్వితీయ ప్రత్యామ్నాయం కాదని, ప్రపంచవ్యాప్తంగా జీవితాంతం అభ్యసించే విద్యకు ప్రధాన చోదక శక్తిగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. సాంకేతికతను సరైన లక్ష్యం, దూరదృష్టి, బాబాసాహెబ్ డా. బి. ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో వినియోగించినట్లయితే విద్యా అసమానతలను తగ్గించేందుకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ టీవీ ద్వారా (దృశ్య ప్రసారాలు), హై-బ్రౌ (డిజిటల్ రేడియో) ద్వారా సాధారణ మొబైల్ పరికరాల్లో (ఆడియో స్ట్రీమింగ్), ఐ – బుక్స్ ద్వారా ఆఫ్‌లైన్‌లో చదువుకునే సౌకర్యం కల్పిస్తుందని, సమగ్ర డిజిటల్ లైబ్రరీ వంటి సదుపాయాలతో విశ్వవిద్యాలయం బహుళ మాధ్యమాల ద్వారా విద్యను అందుబాటులోకి తెచ్చిందని ఆయన వివరించారు. విద్యార్థులు ఎక్కడ ఉన్నా, ఏ పరికరాన్ని ఉపయోగిస్తున్నా, ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా వారికి విద్య చేరేలా ఈ బహుళ-మాధ్యమ వ్యూహం దోహదపడుతోందని శడ్రక్ వివరించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమ్మిళిత విద్య అనే లక్ష్యాలకు అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు విశ్వవిద్యాలయం తమ విద్యా విధానాలను నిరంతరం అభివృద్ధి చేసుకుంటోందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు, తద్వారా వచ్చిన మార్పులు, యూజీసి నుంచి కొత్తగా అనుమతి పొందిన కోర్సులు, డిజిటల్ విద్యా విధానం వైపు యూనివర్సిటీ ప్రయాణాన్ని ఆమె వివరించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి కార్యక్రమ ఆవశ్యకతను వివరించి, ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు.

అంతకుముందు విశ్వవిద్యాలయ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారత రత్న డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, దేశంలో దూర విద్యను తొలిసారిగా ప్రవేశపెట్టిన దూర విద్యా పితామహుడు ప్రొ. జి. రామ్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రొ. డి. రాబింద్రనాథ్ సోలమన్; ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ. శ్రీదేవి, ప్రొ. వెంకట రమణ, ప్రొ. బోజు శ్రీనివాస్, ప్రొ. మాధురి, కృష్ణా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ. వెంకయ్య, మాజీ అధ్యాపకులు ప్రొ. కుప్పు స్వామి రావు, ప్రొ. హయత్, ప్రొ. రాజశేఖర్ రెడ్డి, ప్రొ. వెంకటయ్య, డా. సంతోష్ రెడ్డి, డా. మల్లా రెడ్డి, అన్ని విభాగాల అధిపతులు, డీన్లు, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X