మిధాని లో “లోహ పరిశ్రమల AI ప్రయాణానికి డేటా వ్యూహం“ అంశంపై కృత్రిమ మేధస్సు కార్యశాల నిర్వహణ

హైదరాబాద్ : రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) హైదరాబాద్‌లో “లోహ పరిశ్రమల AI ప్రయాణానికి డేటా వ్యూహం“ (Data Strategy for Metallurgical Industry’s AI Journey) అనే అంశంపై కృత్రిమ మేధస్సు (AI) కార్యశాలను నిర్వహించింది. ఈ కార్యశాలలో ప్రభుత్వం, విద్యా సంస్థలు, పరిశ్రమలు మరియు రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రముఖ నిపుణులు పాల్గొని, లోహశాస్త్రం మరియు తయారీ రంగాలలో AI, డేటా అనలిటిక్స్ మరియు డిజిటల్ సాంకేతికతల రూపాంతరాత్మక పాత్రపై చర్చించారు. ఈ కార్యశాలను మిధాని ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎస్.వి.ఎస్. నారాయణ మూర్తి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ ESD కమిషనర్ టి. రవి కిరణ్, IFoS ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మిధాని డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీమతి కె. మధుబాల, డైరెక్టర్ (ప్రొడక్షన్ & మార్కెటింగ్) పి. బాబు మరియు ముఖ్య విజిలెన్స్ అధికారి శ్రీమతి స్పూర్తి రెడ్డి, IRS పాల్గొన్నారు. దీప ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమై, అనంతరం AI అంశంపై వీడియో ప్రదర్శన, AGM (IT) శ్రీ ఎ.కె. తివారి స్వాగత ప్రసంగం మరియు CMD ప్రారంభోపన్యాసం నిర్వహించబడ్డాయి.

ముఖ్యోపన్యాసం చేసిన టి. రవి కిరణ్, IFos, AI మరియు డేటా ఆధారిత సాంకేతికతలు భవిష్యత్‌కు సిద్ధమైన పరిశ్రమల నిర్మాణంలో మరియు భారతదేశ సాంకేతిక ఆత్మనిర్భరత సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. జనన నమోదు, ప్రభుత్వ పాఠశాలలు, బిల్లులు, పన్నులు మరియు వైద్య రికార్డుల వంటి రంగాలలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న డేటా కార్యక్రమాలను వివరించారు. అదేవిధంగా, డేటా భాగస్వామ్యం మరియు AI ఆవిష్కరణల కోసం రూపొందించబడిన భారతదేశపు తొలి రాష్ట్ర స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయిన తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ (TGDeX) గురించి వివరించారు.

డా. ఎస్.వి.ఎస్. నారాయణ మూర్తి తన ప్రసంగంలో లోహశాస్త్రం కళారూపం నుంచి లోహ తయారీ ప్రక్రియల డిజిటల్ ట్విన్ రూపకల్పన వరకు ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు. అలాగే, ప్రక్రియల ఆప్టిమైజేషన్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ మరియు అల్లాయ్ రూపకల్పనలో AI వినియోగ ప్రాముఖ్యతను వివరించారు. వ్యూహాత్మక తయారీ రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించడం మరియు నవీనత ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు.

Also Read-

డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీమతి కె. మధుబాల వివిధ వనరుల నుంచి డేటా సేకరణ, విశ్లేషణ మరియు అంతర్దృష్టుల ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, సరఫరా శృంఖల సామర్థ్యాలను పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. డైరెక్టర్ (ప్రొడక్షన్ & మార్కెటింగ్) పి. బాబు లోహ తయారీ పరిశ్రమల్లో AI స్వీకరణ మరియు వివిధ ప్రక్రియల్లో కీలక నిర్ణయాలను తీసుకోవడంలో డేటా అనలిటిక్స్ పాత్రను నొక్కిచెప్పారు. ముఖ్య విజిలెన్స్ అధికారి శ్రీమతి స్పూర్తి రెడ్డి ప్రక్రియలకు సంబంధించిన డేటాతో పాటు ఆర్థిక, కొనుగోలు, మార్కెటింగ్, మానవ వనరులు మరియు ఇతర సహాయక విభాగాలలో డేటా డిజిటలైజేషన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

సాంకేతిక సమావేశాలలో ప్రముఖ నిపుణులు IIT మద్రాస్‌కు చెందిన డా. జి. ఫణి కుమార్, IIT బాంబేకు చెందిన డా. అలంకార్ అలంకార్, గూగుల్ ఇండియాకు చెందిన డా. అభిరామి సుకుమారన్ మరియు DYSL-SM కు చెందిన శాస్త్రవేత్త-సి శ్రీ కె.ఎన్.ఎస్. పవన్ కుమార్ పాల్గొని, ప్రభుత్వం మరియు రక్షణ సంస్థల కోసం అధునాతన డేటా అనలిటిక్స్ మరియు AI, శక్తి సామర్థ్యంతో కూడిన సురక్షిత AI వ్యూహాలు, మెటీరియల్స్ మరియు తయారీ రంగాలలో AI మరియు మెషిన్ లెర్నింగ్ అనువర్తనాలు, భారీ ప్రక్రియ డేటా వినియోగం మరియు రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలలో AI అమలు వ్యూహాలపై తమ అనుభవాలను పంచుకున్నారు.

“కోర్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్‌లో AI“ అనే అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఉత్పాదకత, నాణ్యత, కార్యనిర్వహణ సామర్థ్యం మరియు తయారీ రంగంలో నవీనతను పెంపొందించడానికి AI వినియోగంపై సార్థక చర్చ జరిగింది. మిధాని యొక్క ఈ AI కార్యక్రమం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించడం మరియు బలమైన డేటా ఆధారిత కార్యసంస్కృతిని పెంపొందించడం ద్వారా భారతదేశ వ్యూహాత్మక లోహశాస్త్ర సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలనే సంస్థ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. “డేటా నుండి ఆవిష్కరణ వరకు – నవీనత నుండి జాతీయ ప్రభావం వరకు“ (From Data to Discovery, From Innovation to Impact) అనే సందేశం ఈ కార్యశాల స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, డేటాను విలువైన అంతర్దృష్టులుగా మరియు నవీనతను జాతీయ అభివృద్ధికి మార్గదర్శకంగా మలచాలనే మిధాని సంకల్పాన్ని తెలియజేస్తుంది.

ఈ కార్యక్రమాన్ని మిధాని సీనియర్ మేనేజర్ (ఐటీ) శ్రీమతి మానాలి హింగ్రాజియా సమర్థవంతంగా సమన్వయం చేశారు. రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలలో AI అంశంపై నిర్వహించిన సాంకేతిక సదస్సులో భాగంగా మిధాని మేనేజర్ (ఐటీ) శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మిధాని యొక్క AI ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియోను ప్రదర్శించారు. ఈ కార్యశాల విజయవంతమైన నిర్వహణలో ఐటీ విభాగం బృందం కీలకమైన మరియు ప్రశంసనీయమైన పాత్ర పోషించింది. కార్యక్రమం చివరగా మిధాని ఉప మహా ప్రబంధకురాలు (ఐటీ) శ్రీమతి శ్రావతి చిటికేసి చేసిన ధన్యవాద ప్రసంగంతో ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X