హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర జూలై 17 న, హర్యానా, చండీగఢ్ మరియు పంజాబ్‌లలో తన పర్యటన సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.25,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్‌తో సహా 75 పునరాభివృద్ధి చేయబడిన రైల్వే స్టేషన్లను నరేంద్ర మోదీ (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) ప్రారంభించనున్నారు. ఈ సంధర్భంగా, హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో కూడా నిర్వహించబడనున్న ఒక కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారు.
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేయబడిన 75 అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం మరో ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. రూ.1,570 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన ఈ స్టేషన్లు ప్రయాణికులకు అత్యాధునిక, సౌకర్యవంతమైన, ప్రయాణికుల అవసరాలకు అనుగుణమైన సదుపాయాలను అందించేలా రూపుదిద్దుకున్నాయి. ‘వారసత్వం కూడా , వికాసం కూడా ‘అనే భావనకు అనుగుణంగా పునరాభివృద్ధి చేపట్టబడిన ఈ స్టేషన్లు, ఆయా ప్రాంతాల స్థానిక సంస్కృతి, వారసత్వం, సాంప్రదాయ నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా అభివృద్ధి చేయబడ్డాయి.
తెలంగాణలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సుమారు రూ.26 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధిచేయబడి, సమకాలీన వాస్తుశిల్పం, విమానాశ్రయాన్ని తలపించే విశాలమైన ప్రయాణికుల సౌకర్యాలు, అత్యాధునిక రూపకల్పనతో సరికొత్త రూపును సంతరించుకుంది. పునరాభివృద్ధి చేయబడిన తరువాత ఈ స్టేషన్ విశాలమైన, సాంకేతికత ఆధారిత, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నవాతావరణాన్నిఅందిస్తూ, హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌కు సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ప్రవేశ ద్వారంగా నిలుస్తోంది. తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి కోసం ఎంపికచేయబడిన 40 రైల్వే స్టేషన్లలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఒకటి.
Also Read-
ప్రధానమంత్రి జింద్–సోనిపట్ మధ్య భారతదేశపు తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, పర్యావరణహితమైన మరియు సుస్థిర రవాణా వ్యవస్థను ప్రోత్సహించే దిశగా ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ హైడ్రోజన్ రైలు పూర్తిగా భారతదేశంలోనే రూపకల్పన, ఇంజినీరింగ్, సమీకరణ (ఇంటిగ్రేషన్) చేయబడిన స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడింది. ఆధునిక రైల్వే ఇంజినీరింగ్ రంగంలో భారతదేశం సాధించిన సాంకేతిక సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
దీని ప్రవేశంతో, హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న కొన్ని దేశాల సరసన భారతదేశం కూడా చేరనుంది. భారతదేశపు హైడ్రోజన్ ఆధారిత రైలు 10 కోచ్‌లతో రూపొందించబడిన అత్యాధునిక రైలు కాగా, ప్రపంచంలో ఇప్పటివరకు అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఆధారిత ప్రయాణికుల రైళ్లలో అత్యంత పొడవైన రైళ్లలో ఒకటిగా నిలువనుంది. అంతేకాకుండా 3,200 హార్స్‌పవర్ (ఎచ్.పి ) సామర్థ్యంతో కూడిన శక్తివంతమైన ప్రొపల్షన్ వ్యవస్థతో నడిచే ఈ రైలు, ప్రస్తుతం సేవల్లో ఉన్న హైడ్రోజన్ ఆధారిత రైలు వ్యవస్థల్లో అత్యంత శక్తివంతమైన రైలు సెట్లలో ఒకటిగా నిలుస్తుంది.
