హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి, తెలంగాణలోని జానకంపెట్ గూడ్స్ షెడ్‌ను ఈ రోజు అనగా 2026 జూలై 9న జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ డి .ఎస్. రామారావు, దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ. శ్రీధర్, హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అనిరుధ్ పమార్, హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్/(కో-ఆర్డినేషన్) పి.టి.వి.దుర్గా ప్రసాద్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైలు వ్యవస్థ భారీ మౌలిక సదుపాయాల మరియు ప్రయాణికుల అనుకూల అభివృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. 2014 సంవత్సరం నుండి రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ కేటాయింపులు 20 రెట్లకు పైగా పెరిగి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) రూ.5,454 కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. గత 12 ఏళ్లలో 340 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం, అలాగే 562 కిలోమీటర్ల మేర డబుల్ లైన్, మూడవ మరియు నాల్గవ లైన్ల నిర్మాణం జరిగిందని, తెలంగాణలోని మొత్తం రైలు నెట్‌వర్క్ విద్యుదీకరణ (మనోహరాబాద్ – సిద్దిపేట లైన్ మినహా) పూర్తయిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ రైల్వే ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ. 42,000 కోట్లు అని ఆయన తెలిపారు.

జానకంపెట్లో నూతనంగా ప్రారంభించబడిన గూడ్స్ షెడ్ ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన మైలురాయి అని అర్వింద్ అభిప్రాయపడ్డారు. ఈ గూడ్స్ షెడ్ దేశంలోని వివిధ ప్రాంతాలకు స్థానిక సరుకుల రవాణాను సులభతరం చేస్తుందని, రైతులు, వ్యాపారులు, వర్తకులు మరియు వ్యాపార వర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రాంతంలో సరుకు రవాణా మరియు వస్తువుల నిర్వహణ సౌకర్యాలను మరింత విస్తరించడానికి జానకంపెట్ గూడ్స్ షెడ్ను రూ. 9 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారని ఎంపీ తెలిపారు. ప్రస్తుతం ఈ గూడ్స్ షెడ్లో ప్రధానంగా బియ్యం, మొక్కజొన్న, జొన్నలను లోడ్ చేస్తుండగా, ఎరువులు మరియు సిమెంట్ను అన్లోడ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ గూడ్స్ షెడ్‌లో సరుకు రవాణా రైళ్లు మరియు సరుకుల నిర్వహణ మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.
Also Read-

అర్వింద్ ధర్మపురి, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.58 కోట్ల వ్యయంతో నిజామాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి, కవచ్ రక్షణ వ్యవస్థ 4.0 అమలు, నిజామాబాద్ స్టేషన్లో యార్డ్ పునర్నిర్మాణ పనులు, నిజామాబాద్ నియోజకవర్గంలో మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం మొదలైన వాటితో సహా ఈ ప్రాంతంలో చేపట్టిన వివిధ రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల గురించి వివరించారు.

అంతకుముందు, అదనపు డీఆర్ఎం డి. ఎస్. రామారావు స్వాగతోపన్యాసం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణీకుల సేవలు వంటి వివిధ అంశాలకు సహకారం అందించడం ద్వారా జోన్ అభివృద్ధి పథంలో హైదరాబాద్ డివిజన్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. జానకంపెట్ గూడ్స్ షెడ్ జోన్ యొక్క సరుకు రవాణా పరిధిని మరింత మెరుగుపరుస్తుందని మరియు స్థానిక వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు వాహనాల సులభ రాకపోకల కోసం గూడ్స్ షెడ్‌ను విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియాతో అభివృద్ధి చేశారని, అలాగే ప్రధాన రహదారికి సులభంగా చేరుకునేలా అనుసంధాన రహదారులను కూడా అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా, దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ. శ్రీధర్ మాట్లాడుతూ కొత్త గూడ్స్ షెడ్ను ప్రారంభించడం వల్ల నిజామాబాద్ ప్రజలకు ఈ రోజు ఒక ముఖ్యమైన సందర్భమని పేర్కొన్నారు. జానకంపెట్ గూడ్స్ షెడ్ ఈ ప్రాంతంలో సరుకు రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుందని, సులభమైన సరుకు రవాణా కార్యకలాపాలకు వీలు కల్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ గూడ్స్ షెడ్‌లో లోడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, తగినంత లైటింగ్ సౌకర్యం, అనుసంధాన రహదారి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. హమల్ రూమ్, మర్చంట్ రూమ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గూడ్స్ షెడ్ ప్రాంగణంలో పచ్చదనాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎంపీ అర్వింద్ ధర్మపురి రైల్వే అధికారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
