హైదరాబాద్ : నాణ్యమైన విద్యను అందించడానికి, విద్యావేత్తలు నాణ్యమైన పరిశోధన చేసి, దానిని తమ పాఠ్యప్రణాళికలో అంతర్భాగంగా చేర్చాలని వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో “ఇన్‌ఫ్లిబ్‌నెట్ (INFLIBNET) పరిశోధన సేవలు” అనే అంశంపై పరిశోధక విద్యార్ధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లడుతూ నాణ్యమైన విద్యను అందించాలంటే, విద్యావేత్తలు ఉన్నత స్థాయి పరిశోధనలు నిర్వహించి, వాటిని పాఠ్యప్రణాళికలో పొందుపరచాలని సూచించారు. నాణ్యమైన పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇన్‌ఫ్లిబ్‌నెట్ సహాయాన్ని తీసుకోవాలని, ఇన్‌ఫ్లిబ్‌నెట్ ఆధ్వర్యంలో అనేక పరిశోధన టూల్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో పరిశోధనా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పరిశోధకులకు అవకాశాలు, మార్గాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని, దీనిని సాధించడానికి పరిశోధన ఆధారిత జ్ఞానం, నైపుణ్యాలు, విలువ ఆధారిత విద్య, జవాబుదారీతనం వంటి అంశాలతో కూడిన కొత్త మార్గాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మరే ఇతర విశ్వవిద్యాలయంతో పోల్చినా పరిశోధనలు చాలా సమగ్రంగా, పద్ధతి ప్రకారం జరుగుతాయని, ఇతర యూనివర్సిటీల అధ్యాపకులే ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకాడమిక్ ఇంచార్జ్ డైరెక్టర్ ప్రొ. ఇ. సుధా రాణి అధ్యక్షత వహించారు. ఆమే మాట్లాడుతూ పరిశోధక విద్యార్ధులకు అనేక కార్యశాలలను నిర్వహించి, తద్వారా ఉత్తమమైన పరిశోధన పత్రాలు వచ్చేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్‌ఫ్లిబ్‌నెట్ డైరెక్టర్ ప్రొ. దేవికా పి. మాడల్లి ఆన్ లైన్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. పరిశోధకులు చేసే పరిశోధనలు ఎలాంటి కాపీ రైట్ ఇబ్బందులు రాకుండా, పరిశోధన సమయంలో విద్యార్ధులకు ఉపయోగపడే సమాచారం, డేటా ఎలా సేకరించాలి తదితర అంశాలను, ఇన్‌ఫ్లిబ్‌నెట్ అందిస్తున్న సేవలను వివరించారు. డిజిటల్ లెర్నింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి యూనివర్సిటీ అనేక చర్యలు చేపడుతూ ముందడుగు వేస్తోందని సీఎస్టీడి డైరెక్టర్ ప్రొ. కె. శ్రీదేవి పేర్కొన్నారు. ఆమె ఈ కార్యశాల నిర్వహణా ఆవశ్యకతను వివరించారు.
Also Read-

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పరిశోధక విభాగం కో- ఆర్డినేటర్ ప్రొ.సి. వెంకటయ్య, వర్క్ షాప్ కో- ఆర్డినేటర్ ప్రొ.ఏఆర్డీ ప్రసాద్, హాజరై ప్రసంగించారు. అనంతరం నిర్వహించిన టెక్నికల్ సెషన్స్ లో ఇన్‌ఫ్లిబ్‌నెట్ సైంటిస్ట్ లు డా. అభిషేక్ కుమార్, శోద్ చక్ర గురించి, కె. మనోజ్ కుమార్, శోద్ గంగా గురించి, డా. సుర్బి, శోద్ శుద్ధి గురించి, పల్లభ్ ప్రాధాన్, ఐ.ఆర్.ఐ.ఎన్.ఎస్. గురించి సగ్రంగా వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, డీన్లు, అన్ని విభాగాల పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
