న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఇచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పిలుపు స్ఫూర్తితో, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రకృతిని కాపాడటం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం మనందరి కర్తవ్యమని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, అది తల్లిపట్ల గౌరవాన్ని వ్యక్తపరుస్తూనే ప్రకృతిని కాపాడుకోడం పట్ల సమాజంలో అవగాహన పెంపొందించే ఒక మహత్తర ప్రజా ఉద్యమమని తెలిపారు. ప్రకృతి పరిరక్షణ, వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నివారణ, జీవవైవిధ్య సంరక్షణ (బయోడైవర్సిటీ) కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు స్పందించాలని కోరారు.
Also Read-
పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సుస్థిరాభివృద్ధి, హరిత అభివృద్ధి (గ్రీన్ గ్రోత్) లక్ష్యాలతో దేశం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగస్వాములై, హరిత భారత నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని జి. కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
