“రైతుల భవిష్యత్ ను ఆగం చేసే ‘ఈ’ ప్రపోజల్ ను ఈఆర్సీ రిజెక్ట్ చేయాలి”

హైదరాబాద్ : రైతు డిస్కం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచే కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతులు అడగకుండానే విద్యుత్ సంస్కరణల పేరుతో చేపట్టిన ఈ చర్య రైతుల పాలిట శాపంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిస్కమ్ ఏర్పాటు వ్యవసాయంపై ఎండ్రిన్ చల్లడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు డిస్కమ్ ఏర్పాటుపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ శుక్రవారం ఎర్రగడ్డలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ లో కవిత పాల్గొని మాట్లాడారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతులకు మంచి చేసే ఆలోచనలో ఉంటే ఆరు నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు దాచి ఉంచిందో చెప్పాలన్నారు. యావత్ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసే ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే 1999 నాటి కాల్పుల ఘటనను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని హెచ్చరించారు. తెలంగాణ రైతుల భవితవ్యాన్ని నిర్ణయించే ఈ అంశంపై 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఏ విధంగానూ వయిబుల్ కాని ఈ ప్రపోజల్ ను తిరస్కరించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు.

1999 నాటి కాల్పుల ఘటన కొని తెచ్చుకోవద్దు

రైతు డిస్కమ్ పేరుతో ఈ ప్రభుత్వం పచ్చిదగా చేస్తోందని కవిత అన్నారు. ఈ నిర్ణయం మంచిదే అయితే ఆరు నెలల నుంచి ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని సీక్రెట్ గా ఉంచిందో చెప్పాలన్నారు. ఈఆర్సీ కారణంగా ఈ అంశం బయటకు వచ్చిందే తప్ప ప్రభుత్వం బయటపెట్టలేదని గుర్తు చేశారు. నిజానికి ఇంతటి కీలకమైన అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అసెంబ్లీ లో చర్చ పెట్టాలన్నారు. కానీ సీక్రెట్ గా ఇదంతా చేస్తుందంటేనే కచ్చితంగా ఇందులో దురుద్దేశం ఉందన్నది అర్థమవుతుందని కవిత చెప్పారు. రైతులు ఎవరు అడగకుండానే రైతు డిస్కం అవసరమేమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. అసలే డిస్కమ్ ల పరిస్థితి బాగాలేని సమయంలో రూ. 25 వేల కోట్ల నష్టంతో ఉన్న డిస్కమ్ ను కంపెనీ పేరుతో ఎలా రిజస్టర్ చేస్తారని ఆమె నిలదీశారు.

రైతులకు ఇచ్చే ఫ్రీ కరెంట్, ఉచిత విద్యుత్ స్కీం, లిఫ్ట్ ఇరిగేషన్ కోసం వాడే పవర్ కు ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఈ సంస్థ ఏ విధంగా లాభాల్లో ఉంటుందో చెప్పాలన్నారు. కేవలం రైతులకు నష్టం చేసేందుకు ఈ పిచ్చి పనిచేస్తున్నారని కవిత విమర్శించారు. రైతులకు అన్యాయం చేస్తే 1999 నాటి కాల్పుల ఘటన పునరావృతం అయ్యే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. అలాంటి సంఘటనలు కొని తెచ్చుకోవద్దంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read-

రైతులకు నష్టమే

రైతు డిస్కం కారణంగా మేలు జరగకపోగా రైతులకు మరింత నష్టం వాటిల్లుతుందని కవిత అన్నారు. కొత్త డిస్కం కు 42 శాతం లోడ్ ట్రాన్ ఫర్ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని… కానీ అందుకు తగిన విధంగా ఉద్యోగులను మాత్రం కేటాయించటం లేదన్నారు. మొత్తం డిస్కం లలో 45 వేల మంది ఉద్యోగులు ఉంటే కొత్త డిస్కం కుి 2 వేల మంది ఉద్యోగులను మాత్రమే ట్రాన్స్ ఫర్ చేస్తామంటున్నారన్నారు. దీని కారణంగా ట్రాన్స్ ఫార్మర్లు రిపేర్ వస్తే రెండు నెలల పాటు ఎదురుచూసే పరిస్థితి ఉంటుందన్నారు. పైగా ఇంతకు ముందు నియోజకవర్గ కేంద్రంలో ట్రాన్ ఫార్మర్ రిపేర్ సెంటర్ ఉంటే ఇప్పుడు అది తాలుకాకు మారే పరిస్థితి ఉంటుందన్నారు. దీంతో రైతులకు నష్టం జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో 29 లక్షల బోర్లు ఉన్నాయని ఈ కొత్త డిస్కం కారణంగా ఆయా బోర్ల పరిస్థితి డోలాయామనంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వమే దోషి

డిస్కమ్ ల పరిస్థితి బాగాలేదని ప్రభుత్వమే చెబుతోందని కవిత గుర్తు చేశారు. మన డిస్కమ్ లకు మైనస్ సీ రేటింగ్ ఉందని అంటున్నారని కానీ దానికి ఈ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. డిస్కం ల బకాయిలు రూ. 69 వేల కోట్లు ఉంటే అందులో 54 వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచే రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తే మన డిస్కమ్ లు మంచి రేటింగ్ లలోకి వస్తాయని చెప్పారు. పైగా కొత్త డిస్కం కు యూనిట్ 6 రూపాయలు ఖర్చయ్యే థర్మల్ విద్యుత్ ను కేటాయిస్తున్నారని చెప్పారు. దీనికి తోడు కొత్త డిస్కం లో వీలింగ్ ఛార్జీలు కూడా యాడ్ చేస్తామంటున్నారన్నారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్, లిఫ్ట్ ఇరిగేషన్ విద్యుత్, రైతులకు ఇచ్చే విద్యుత్ కు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే రూ. 54 వేల కోట్లు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం కొత్త డిస్కమ్ కు ఎక్కడ నుంచి డబ్బులు ఇస్తుందని ప్రశ్నించారు. ఈ లెక్కన రైతు డిస్కం ఏ విధంగా లాభాల్లో ఉంటుందో చెప్పాలన్నారు. డిస్కంల నష్టాలను సాకుగా చూపి ఒక డిస్కం ను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. అటు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పి ఇప్పుడు మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వ వైఖరి కనిపిస్తుందన్నారు. విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన అన్ని కండిషన్స్ ఒప్పుకునే విధంగా రేవంత్ సర్కార్ చర్యలు చేపడుతోందని కవిత విమర్శించారు.

33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి

తెలంగాణ రైతాంగం భవిష్యత్ ను నిర్ణయించే ఈ అంశాన్ని ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయించటం సరికాదని కవిత అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని ఈఆర్సీని కోరారు. ఈఆర్సీ నుంచి ఎలాంటి అనుమతి రాకుండానే జూన్ 2 నుంచి కొత్త డిస్కం పని ప్రారంభమవుతుందని సీఎం మాట్లాడటం సరికాదని చెప్పారు. రైతు డిస్కం విషయంలో ముందు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని కోరారు. గతంలో ఎనర్జీ అడిట్ స్కీమ్ లు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదని కవిత గుర్తు చేశారు. అందుకే ముందు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలన్నారు. లేదంటే పెద్ద మొత్తంలో ఉన్న రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. కొత్త డిస్కమ్ కారణంగా కొత్తగా ఎక్కువ గంటలు కరెంట్ ఇస్తారా? ఇప్పుడున్న డిస్కమ్ లో సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోయేదానికి ఎందుకు కొత్త డిస్కమ్ అని కవిత ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో వాయెబుల్ కానీ ఈ ప్రపోజల్ ను ఈఆర్సీ రిజెక్ట్ చేయాలని కవిత కోరారు.

ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం వద్దు

రైతు డిస్కం వద్దే వద్దంటే అందులో ఆంధ్రా ఉద్యోగులకు పెత్తనం కట్టేబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కవిత అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ వచ్చేందుకు తెలంగాణ ఉద్యోగులు కష్టపడితే వారికే కష్టమొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 వందల మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు నష్టం చేశారని చెప్పారు. అదే సమయంలో ఆంధ్రా నుంచి మన వద్దకు వచ్చిన 17 వందల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చారన్నారు. విభజన చట్టాలను పక్కన పెట్టి ఫోర్స్ ఫుల్ గా ఆంధ్రా ఉద్యోగులను మనకు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే జెన్ కో, రెడ్ కో, సదరన్ డిస్కమ్ ఇలా అన్నింట్లో ఆంధ్రావాళ్ల పెత్తనమే ఉందన్నారు. తెలంగాణ డిస్కమ్ లలో ఆంధ్రావాళ్ల పెత్తనం ఉండొద్దని కవిత కోరారు. రైతు డిస్కం తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తే అందులో తెలంగాణ వాళ్లే ఉండాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X