హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గతంలో పాలించిన బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కలిసి ఎంఐఎం (మజ్లిస్) పార్టీ కనుసన్నల్లో నడుస్తూ హైదరాబాద్ నగర ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూకట్‌పల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, నగరంలోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల తీరును ఎండగట్టారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో గరీబోళ్లను నిలువునా ముంచితే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు’ అంటూ అదే తరహాలో ప్రజలను నమ్మించి వంచిస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం కట్టిన కొన్ని అరకొర ఇళ్లనే ఇప్పుడు చూపించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. నివేదికల పేరుతో కాలయాపన చేస్తూ, రెండు పార్టీలు కూడా హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని విభజించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకురావాలనే ఆలోచన కేవలం మజ్లిస్ పార్టీ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. మూడు భాగాలుగా విడగొడితే తప్ప మజ్లిస్ గెలవలేని పరిస్థితి ఉందని, అందుకే వారికి జీహెచ్ఎంసీని అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించారని, అందులో ఒక భాగాన్ని దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జిల్లాల విభజనలో ఒకే అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల్లోకి పోయేలా గందరగోళం సృష్టించారని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందన్నారు. అధికారులను మ్యాప్ అడిగితే వారి వద్ద ఎలాంటి స్పష్టత లేదని, ఎక్కడ ఏ సరిహద్దు వస్తుందో తెలియకుండానే నగరాన్ని ముక్కలు చేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read-
నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా పడకేసిందని రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రోహిణి కార్తె ముగుస్తున్నా, జూన్ 12న వానాకాలం ముంచుకొస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు నీటి ఎద్దడిని నివారించలేకపోయిందన్నారు. మూడు, నాలుగు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రాక ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని, జలమండలి తీవ్రంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. మరోవైపు వర్షం వస్తే బస్తీలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉందని, గత బీఆర్ఎస్ హయాంలో వరదలు వస్తే ఇళ్లల్లో నీళ్లు చేరిన వారిలో కొంతమందికి ఇచ్చిన రూ. 10,000 సాయం కూడా బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి పోయిందని గుర్తు చేశారు. నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు.
