తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు
హైదరాబాద్ : ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న బూర్జువా పార్టీలను వదిలేసి కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్న జాగృతిలో చేరాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు రాథోడ్ బాపూరావు ఆదివారం తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన నాయకులంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
2007లో కుటుంబంతో సహా తాను బోథ్ కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించానని గుర్తు చేసుకున్నారు. వాన పడితే ఆదివాసీ గూడాలు, మన్నెం జ్వర పీడితులతో నిండి ఉండేదని.. ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలనే తెలంగాణ సాధించుకోవాలని అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తు చేశారు. ఏ స్పిరిట్ తో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించామో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పని చేయాల్సి ఉందన్నారు.

బాపూరావు తెలంగాణ జాగృతి నుంచే బీఆర్ఎస్ లో చేరి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరుతున్నారని అన్నారు. కొత్త పార్టీలో చేరడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ముందుకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందన్నారు. సిరిసిల్ల జిల్లా నుంచి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నాయకులు ఈరోజు జాగృతిలో చేరారని అన్నారు.
Also Read-
తెలంగాణ రాష్ట్రానికి కవిత ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్లు మంత్రులు అయ్యారని, తనకు మూడోసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ లో చేరినా తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్నారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చోడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని అన్నారు.

జనగణనలో ఆదావాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ జాతీయ అధ్యక్షుడు, ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు జాగృతి కార్యాలయంలో కవితతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను చందా లింగయ్య దొర ఈ సందర్భంగా వివరించారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెసా చట్టానికి తూట్లూ పొడుస్తూ ఆదివాసీల హక్కులను హరిస్తోందని అన్నారు. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లలో ఆదివాసీలకు ఉన్న రక్షణలను తొలగిస్తోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని, తిరిగి వారికి అడవిలో అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదని, తో ఆదివాసీలు తామ మతాన్ని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడమేనని మండిపడ్డారు. ఆదివాసీలు తమ మతం చెప్పుకునేలా జనగణనలో ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల భాష ‘‘కోయతూర్’’ ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు.
దేశంలోని 12 కోట్ల మంది ఆదివాసీలు నిజమైన భారత దేశ సంస్కృతికి ప్రతినిధులని వారి గౌరవాన్ని కాపాడేలా తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ఉంటుందని ప్రకటించారు. సమావేశంలో ఆదివాసీ జేఏసీ ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవ, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ఆదివాసీ జాగృతి అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.
