హైదరాబాద్ : మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరుకావడం లేదని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. రేవంత్‌కు కూడా కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని ధ్వజమెత్తారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదు.. అయినప్పటికీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా గత మూడేండ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందని తెలియజేశారు.
ఈ వేడుకలకు గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ముఖ్య అతిథిగా పాల్గొని, తెలంగాణ విమోచన దినం చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి, అమరవీరుల పోరాటగాథలను కళ్లకుకట్టే విధంగా అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించామని గుర్తుచేశారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా సెస్టెంబరు 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈనేపథ్యంలో భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో రిహార్సల్స్‌తో పాటు కవాతు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డా. లక్ష్మణ్‌తో పాటు మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ విమోచన వేడులకు సీఎం రేవంత్ రెడ్డి రాకపోవడంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ మాదిరిగానే దారుస్సలాం ఆదేశాలకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందిపోయి.. కేవలం మజ్లిస్ కు లొంగిపోయి, వారి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడాన్ని ప్రజలు క్షమించరని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read-
ప్రజాపాలన దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని లక్ష్మణ్ దుయ్యబట్టారు. నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల చరిత్రను, అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేసేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుకోవడం ఇది మూడోసారి అన్నారు. హైదరాబాద్ సంస్థానం నిజాం నుంచి విముక్తి పొందినప్పటికీ కమ్యూనిస్టులు ఎందుకు పోరాటం చేశారో చెప్పాలన్నారు. కేవలం రష్యాతో అనుబంధంగా ఎర్రరాజ్యంగా మార్చడం కోసమే రజాకార్లకు వ్యతిరేకంగా మిలటరీతో యుద్ధానికి దిగారంటూ లక్ష్మణ్ మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరుచుకుని, తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవం కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించామన్నారు. మజ్లిస్ ఒత్తిడి కి తలొగ్గి అయన రావడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా మజ్లిస్ మెప్పుకోసం పని చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ గారు మాట్లాడిన ముఖ్యాంశాలు:
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి, ప్రజలంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారు.
అయితే, నిజాం నవాబు ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలు మాత్రం స్వేచ్ఛ వాయువులకు నోచుకోకపోవడంతో పాటు రజాకార్ల ఆగడాలకు బలై, బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.
నాడు నిజాం ఆధీనంలో హైదరాబాద్ సంస్థానంలోని 16 జిల్లాలు ఉంటే.. నేటి తెలంగాణకు సంబంధించిన 8 జిల్లాలు.. 5 జిల్లాలు మహారాష్ట్రలో… కర్ణాటకలో 3 జిల్లాలు కలిశాయి.
ఆనాడు రజాకార్లతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అరాచకాలకు, అణిచివేత చర్యలకు పాల్పడ్డాడు. దీంతో 13 మాసాల పాటు ప్రజలు తిరుగుబాటు చేసి పోరాటం చేశారు.
మహిళలను అవమానపర్చి, మానభంగాలకు పాల్పడుతూ, మతమార్పిడులకు ఒడిగట్టాడు.
నాడు ఆర్యసమాజ్, ఆంధ్రమహాసభ నాయకులు పోరాటంలో భాగస్వామ్యమయ్యారు.
గ్రామాల్లో రజాకార్లను ఎదుర్కొనేందుకు ప్రజలు ఎక్కడికక్కడ గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకున్నారు.
నాడు నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం కాబోమని, ప్రత్యేక ఇస్లాం రాజ్యాంగానే కొనసాగిస్తామని నిరంకుశత్వంగా వ్యవహరించాడు.
నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన పోరుగడ్డ పరకాల… జలియన్ వాలాబాగ్ ఘటనను తలపించేలా, పరకాల లో జరిగిన మారణ హోమం, పోరుగడ్డ మీద పరకాల వీరులు చిందించారు.
నాడు సెప్టెంబర్ 2వ తేదీన పరకాల సమీప గ్రామాల నుండి వెయ్యి మందికి పైగా ప్రజలు భారత జెండాను ఎగురవేయడానికి వచ్చారు. అయితే, అక్కడికి వచ్చిన రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు.
మహిళల్ని వివస్త్రల్ని చేసి.. చనిపోయినవారి చుట్టూ బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందారు.
ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో, ఆపరేషన్ పోలో చర్యతో 1948 సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగిపోవడంతో తెలంగాణకు స్వాతంత్ర్యం లభించింది.
కొమురం భీం, షోయాబుల్లా ఖాన్, తుర్రేబాజ్ ఖాన్, షేక్ బందగీ వంటి జాతీయవాదులతో పాటు ప్రముఖ జర్నలిస్టు, ఇమ్రోజు పత్రిక స్థాపకుడు షోయబుల్లా ఖాన్ లాంటి వారు అనేక మంది నైజాం వ్యతిరేక పోరులో ప్రాణాలు వదిలారు.
ఇలా మనం స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి కారకులైన వీరులను స్మరిస్తూ తెలంగాణ విమోచన దినం ఘనంగా జరుపుకోవాల్సి ఉంది.
1948 నుండి, హైదరాబాద్ విలీనం అయినప్పటి నుండి, మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాంతాలు స్వాతంత్ర్య వేడుకలైన సెప్టెంబర్ 17ని “విమోచన దినం”గా జరుపుకుంటున్నాయి.
అయితే, సమైక్య పాలన నుంచి నేటి వరకు తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీలు మజ్లిస్ ఒత్తిళ్లకు లొంగిపోయి, ఓట్ల కక్కుర్తితో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు.
అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్… ఉద్యమ సమయంలో ‘విమోచన దినోత్సవం’ ఎందుకు నిర్వహించరని అప్పటి ఉమ్మడి పాలకులను నిలదీసిన ఆయనే.. ఆ తర్వాత స్వయంగా సీఎం అయినా… మజ్లిస్ కు భయపడి అధికారికంగా నిర్వహించలేదు.
విమోచన దినోత్సవాలు నిర్వహించాలని బిజేపి అనేక పోరాటాలు చేసింది. నాడు విద్యాసాగర్ రావు గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం నెలకొల్పడం జరిగింది.
నేను గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం అధికారిక వేడుకల కోసం ‘తెలంగాణ విమోచన యాత్ర’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఉద్యమాల్లో పాల్గొన్నా. అనేక ప్రాంతాలను సందర్శించి, పోరాటయోధుల త్యాగాలను స్మరించుకున్నాం.
అయితే, కొంతమంది కుహనా లౌకిక వాదులు విలీనమని, విద్రోహమంటూ అనేక వక్రీకరణలతో ప్రజల్లో అయోమయం సృష్టించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు మాత్రం ఆయుధాలు సమర్పించకుండా, తెలంగాణకు విముక్తి కల్పించేందుకు వచ్చిన మిలటరీ కి వ్యతిరేకంగా పోరాటం చేసి రష్యాకు అనుబంధంగా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కుట్ర చేశారు.
ఘన చరిత్ర కలిగిన విమోచన దినోత్సవాన్ని మజ్లిస్ కు లొంగిపోయి గతంలో మాజీ సీఎం సమైక్యతా దినోత్సవంగా, నేటి ముఖ్యమంత్రి సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవంగా జరుపుతామంటూ చెబుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఇప్పటి కాంగ్రెస్ సర్కారు తెలంగాణ విమోచన దినోత్సవం చరిత్రను కనుమరుగు చేసేలా, తెలంగాణతో వల్లభాయ్ పటేల్ గారికి ఉన్న అనుబంధాన్ని తుంచివేసేలా వ్యవహరిస్తున్నాయి.
అందుకే, సెప్టెంబరు 17 ఘన చరిత్రను, నాటి పోరాట యోధుల గాథలను ప్రపంచానికి తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది.
ఇప్పటికైనా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పోరాటయోధుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చడంతో పాటు, బైరాన్ పల్లి నుంచి మొదలు పరకాల వంటి పోరాట కేంద్రాలను స్ఫూర్తి కేంద్రాలుగా, మ్యూజియంలుగా తీర్చిదిద్దే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది