తెలంగాణలో బెంగాల్ తరహా పరిస్థితులు వచ్చే ప్రమాదం
జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కార్ దే బాధ్యత
రేపటి మజ్లిస్ సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రాం
రేవంత్ ఆర్ధిక సహకారంతోనే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ ఆందోళన చేస్తోంది
ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ దూరంగా ఉండాలని రాహుల్ చెప్పడం పెద్ద జోక్
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటేసి చిత్తశుద్ధి నిరూపించుకుంటారా?
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లారా….మీ అంతరాత్మ ప్రకారమే ఓటేయండి
ఓటింగ్ కు దూరంగా ఉంటే హైదరాబాద్ ప్రజలు మిమ్ముల్ని క్షమించబోరు
వక్ఫ్ ఆస్తులను ఒవైసీలాంటి కుటుంబాలు ఆక్రమించుకుని లబ్ది పొందుతున్నాయి
వక్ఫ్ ఆస్తులు, ఆదాయంతో పేద ముస్లింలకు నయాపైసా ప్రయోజనం లేకుండా చేశారు
కాంగ్రెస్ పాలనలో చేసిన వక్ఫ్ చట్టం అత్యంత ఘోరమైనది
టైటిల్ ఉన్న వాళ్ల భూములను కూడా వక్ఫ్ కు ధారాదత్తమయ్యాయి
ఆలయాల, గురుద్వారా, క్రైస్తవ మత్సకారుల, లింగాయత్ సాగు భూమలను కూడా వక్ఫ్ పేరుతో ఆక్రమించుకున్నారు
ఆఖరుకు పార్లమెంట్ కూడా వక్ఫ్ పరిధిలో ఉందంటూ అవాకులు పేలుతున్నారు
సీఎంకు దమ్ముంటే…తెలంగాణలోని వక్ఫ్ భూములు, ఆస్తులు, ఆదాయంపై హైడ్రాతో విచారణ చేయించాలి
వక్ఫ్ ఆస్తులు, ఆదాయ, వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి
డూప్లికేట్ గాంధీ కుటుంబానికి భారతీయ చట్టాలు వర్తించవా?
రాజ్యాంగానికి అతీతులని అనుకుంటున్నారా?
యూపీఏ హయాంలోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి
అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్న నిందితులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ
ఇందులో బీజేపీ, మోదీ పాత్ర ఏముంది?
కాంగ్రెస్ కార్యకర్తలారా….నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్లో మీ వాటా ఉంది
మీరు ధర్నా చేయాల్సింది…. టెన్ జన్ పథ్ సోనియా ఇంటి ముందు
తప్పు చేస్తే సోనియాసహా అందరూ జైలుకు వెళ్లక తప్పదు
రాహుల్ స్పూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఫోర్త్ సిటీకి చెందిన 50 వేల కోట్ల ఆస్తులను కాజేసే కుట్ర
సుబ్రమణ్యస్వామి కేసులతో బీజేపీకి ఏం సంబంధం?
బూతులు మాట్లాడితే చప్పట్లు కొడుతుంటే నివారించాల్సింది పోయి సమర్ధిస్తారా?
దావోస్ పెట్టుబడులు ఎటు పోయాయ్?…జపాన్ పర్యటన కూడా అంతే
కాంగ్రెస్, బీఆర్ఎస్ జాన్ జబ్బలు…. బీఆర్ఎస్ అవినీతి కేసులన్నీ నీరుగార్చడమే నిదర్శనం
విద్యుత్ కొనుగోళ్ల స్కాంపై నివేదిక ఇచ్చినా కేసీఆర్ కు కనీసం నోటీసు ఎందుకు ఇవ్వలేదు?
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్….
హైదరాబాద్ : వక్ఫ్ భూములు, నేషనల్ హెరాల్డ్ ఆస్తులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లో నిర్వహించబోతున్న బహిరంగ సభకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్ధిక సహకారం అందిస్తోందని వ్యాఖ్యానించారు. సభలు, సమావేశాలు, ఆందోళనల పేరుతో అల్లర్లకు కుట్ర చేస్తున్నాయని చెప్పారు. ఇదే జరిగితే హైదరాబాద్ లో బెంగాల్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీకి ఏం సంబంధమని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను కాజేసేందుకు యంగ్ ఇండియా ట్రస్ట్ పేరుతో డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర చేసింది. దానవీరశూర కర్ణ సినిమాను మించి పాత్రలను పోషించింది డూప్లికేట్ గాంధీ కుటుంబమే. నేషనల్ హెరాల్డ్ పత్రికకు వాళ్లే డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీకి వాళ్లే అధినేతలు, యంగ్ ఇండియా ట్రస్టుకు వాళ్లే డైరెక్టర్లు. పత్రిక ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకునేందుకు చేసిన కుట్ర కోణంపై 2012లో కేసు వేశారు. దీనిపై 2013లో కోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ విచారణకు ఆదేశించింది.
అరెస్ట్ కాకుండా బెయిల్ పై ఉన్న నిందితులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు… ఆ కేసుతో మోదీ ప్రభుత్వానికి ఏం సంబంధం’’ అని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో 5 వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు వాటాదారులుగా ఉన్నారని, ఆ ఆస్తుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం వాటా ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలంతా ధర్నా చేయాల్సింది ఈడీ ఆఫీస్ ముందు కాదని, ఆ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేసిన సోనియాగాంధీ నివాసం ఎదుట అని సూచించారు.
Also Read-
ఈరోజు సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, కార్యదర్శులు ఎస్.ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధులు విఠల్, రాణి రుద్రమాదేవి, ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే… నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తోంది. నిన్న హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు చేసింది బూతు ధర్నా. ప్రధానిని, కేంద్ర మంత్రిపట్ల గౌరవం లేకుండా బూతులు మాట్లాడిన కాంగ్రెస్ నేతలను ఏమనుకోవాలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి సమాధానం చెప్పాలే. వాళ్లు మాట్లాడిన బూతులను మీరు సమర్ధిస్తున్నారా?
నేషనల్ హెరాల్డ్ కేసును చూస్తే దానవీరశుర్ణ లెక్క సినిమా కన్పించింది. నేషనల్ హెరాల్డ్ కేసు కూడా అట్లనే ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్లదే. నేషనల్ హెరాల్డ్ పేపర్ వాళ్లదే, యంగ్ ఇండియా ట్రస్ట్ వాళ్లదే. నష్టాల పేరుతో 90 కోట్లు ఇచ్చింది వాళ్లే. యంగ్ ఇండియా ట్రస్ట్ పెట్టి ఆ ఆస్తులను కొట్టేయాలనుకుంది వాళ్లే. దీనిపై కేసు విచారణ స్టార్ట్ అయ్యింది యూపీఏ హయాంలోనే… కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంది వాళ్లే…ఇందులో మోదీ పాత్ర ఏముంది? బీజేపీకి ఏం సంబంధం?
1938లో జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను స్థాపించారు. 5 వేల మంది స్వాతంత్య ఉద్యమకారులు ఇందులో భాగస్వాములు(షేర్ హోల్డర్స్). అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థ పేరుతో ప్రచురిస్తుంది. AJL సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా 2008లో నేషనల్ హెరాల్డ్ పత్రికను మూసివేశారు.
2010లో సోనియాగాంధీ కుటుంబం యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (YIL) కంపెనీ స్థాపించారు. ఇందులో సోనియా గాంధీ 38 శాతం, రాహుల్ గాంధీ శాతం వాటా కలిగి ఉన్నారు. వీరితోపాటు కాంగ్రెస్ నేతలు మోతీలాల్ హోరా, శ్యాంపిట్రోడా, సుమన్ దుబేలు మిగిలిన 24 శాతం వాటాలను కలిగి ఉన్నారు.
నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విలువ 2,000 కోట్లకు పైమాటే. యంగ్ ఇండియా సంస్థ కేవలం 50 లక్షలు చెల్లించి నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వాటాలను కొనుగోలు చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే యంగ్ ఇండియా సంస్థను స్థాపించి నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేశారని, ఇది అతిపెద్ద అవినీతి అని పేర్కొంటూ 2012లో సుబ్రమణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ కేసు దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం (రౌస్ ఎవిన్యూ కోర్ట్) దీనిపై నోటీసులు జారీ చేసింది. 2013లో సీబీఐ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకుని బయట ఉన్న నిందితులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలే. 2023, నవంబర్ లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) యొక్క ₹661 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అట్లాగే YIL సంస్థకు చెందిన మొత్తం ₹751.9 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నది.
ఈ కేసు విచారణను పూర్తి చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2025 ఏప్రిల్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టుకు సమర్పించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా పేర్కొన్నది. ప్రైవేట్ వ్యక్తులైన సోనియాగాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ నిధులను వాణిజ్య అవసరాల కోసం వాడుకుని మనీ లాండరింగ్ కు పాల్పడిందని అందులో పేర్కొంది. దాదాపు 998 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగినట్లు పేర్కొంది. ఈ అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. ఏప్రిల్ 25న ఈడీ చార్జ్ షీట్ పై విచారణ చేయాలా? వద్దా? అనే అంశంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోబోతోంది.
ఇప్పుడు మీరు చెప్పండి… ఇందులో కక్ష సాధింపు ఏముంది? అసలు ఈ కేసుకు, మోదీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి ఏం సంబంధం? 2012లో ఈ కేసు దాఖలైంది. ఈ కేసుపై న్యాయస్థానం విచారణ చేస్తోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ కేసులో ముద్దాయిలు. బెయిల్ తీసుకున్న నిందితులు. ఇందులో బీజేపీ పాత్ర ఏముంది? బీజేపీని తిట్టుపోసుడేంది?
ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం ఏమైనా రాజ్యాంగానికి అతీతులా? ఇటలీ మూలాలున్నయ్ కాబట్టి భారతీయ చట్టాలు వర్తించవనుకుంటున్నారా? ఒక చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతారు? ఇంకో చేత్తో మేం రాజ్యాంగానికి అతీతులమని చెబుతూ ధర్నాలు, ఆందోళనలు చేయిస్తూ రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తారా?
నిన్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడుతున్నారు? అసలు సభ్యత ఉన్నోళ్లు మాట్లాడే భాషేనా అది? ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం కాంగ్రెస్ నేతలకు ఇచ్చే ట్రైనింగ్ ఇదేనా? ప్రధాని, కేంద్ర మంత్రులమీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడాలని ట్రైనింగ్ ఇస్తున్నారా? గాంధీ వారసులమని చెప్పుకుంటూ 50 ఏళ్లపాటు ఈ దేశాన్ని దోచుకున్నది చాలదా? చేసిన తప్పులను ఎత్తి చూపి విచారణ చేస్తుంటే ధర్నాలు, ఆందోళనలతో అడ్డుకోవాలని చూస్తారా?
ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి డూప్లికేట్ గాంధీ కుటుంబమే స్పూర్తిగా తీసుకుని ‘యంగ్ ఇండియా’ బ్రాండ్ నినాదంతో ముందుకు పోతోంది. యంగ్ ఇండియా పేరుతో డూప్లికేట్ గాంధీ కుటుంబం 5 వేల మంది స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన 2 వేల కోట్ల విలువైన ఆస్తులను దోచుకుని మనీ లాండరింగ్ పాల్పడితే… ఇక్కడ కాంగ్రెస్ నేతలు యంగ్ ఇండియా బ్రాండ్… ఫోర్త్ సిటీ పేరుతో వేలాది ఎకరాల విలువైన భూములను స్వాధీనం చేసుకుంటూ 50 వేల కోట్లను దోచుకునేందుకు సిద్ధమైంది. ప్రజలు వాస్తవాలు ఆలోచించాలని కోరుతున్నా…
సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ (సీడబ్ల్యూసీ) నివేదిక ప్రకారం దేశంలో 8 లక్షల ఎకరాలకుపైగా వక్ఫ్ ఆస్తులున్నాయి. వీటి విలువ 10 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. వీటిపై ఏటా 12 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ సొమ్మును ఏం చేస్తున్నారు? దీనికి లెక్కా పత్రం జమ లేదు. ఆడిటింగ్ ఉండదు. ముస్లింలలో కోట్ల మంది పేదలున్నారు. కనీసం వాళ్ల ప్రయోజనాల కోసమైనా ఖర్చు చేయడం లేదు? ఆ సొమ్మునంతా బడా ముస్లిం సంపన్నులు, ఎంఐఎం నాయకులు, ఒవైసీ కుటుంబం దోచుకుంటోంది. వక్ఫ్ ఆస్తులను కూడా వాళ్లే వాడుకుంటున్నరు. ఒక్క తమిళనాడులోనే వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతంపై హైకోర్టు ఆదేశం మేరకు విచారణ చేస్తే 2 వేల కోట్ల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని తేలింది.
ఇంకా బాధాకరమేందంటే స్యాతంత్ర్య సమరయోధుల స్వారక చిహ్నాలను, మందిరాలను, గురుద్వారా భూములను కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ ఆక్రమించుకుంటున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని తిరుచెందురాల్, కడ్లకురిచి గ్రామాలను, ఆ గ్రామాల్లోని 15 వందల ఏళ్ల నాటి పురాతన చంద్రశేఖర ఆలయ భూములను కూడా వక్ఫ్ భూములను పేర్కొంటూ క్లెయిమ్ చేసుకుంది. హర్యానాలోని జత్లానా గ్రామంలో గురుద్వారా భూమిని ఆక్రమించుకున్నారు. కర్నాటకలో లింగాయత్ లకు చెందిన వ్యవసాయ భూమిని, కేరళలలోని మునంబమ్ లో నివసిస్తున్న క్రైస్తవ మత్స్యకారుల భూములను కూడా వక్ఫ్ భూములని క్లెయిమ్ చేసుకుంది. ఇదెక్కడి న్యాయం? వక్ఫ్ బోర్డు పేరుతో ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? పోనీ వక్ఫ్ ఆస్తులను పేద ముస్లింలకు పంచకుండా, వారి సంక్షేమానికి వినియోగించుకుండా సంపదనంతా ఎంఐఎం నేతలు దోచుకుంటే చూస్తూ ఊరుకోవాలా?
అంతెందుకు అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 77 వేల ఎకరాల వక్ఫ్ లాండ్స్ ఉన్నాయి. వీటిలో కేవలం 20 శాతం అంటే 16వేల ఎకరాల భూములు మాత్రమే దర్గాలు, మసీదులు ఆధీనంలో ఉన్నాయి. మిగిలిన 80శాతం లాండ్స్ ఎవరి చేతిలో ఉన్నాయనుకుంటున్నారు? ఓవైసీ లాంటి వారు అక్రమించుకున్నారు. ఆసుపత్రులు, ఆఫీసులు, వ్యాపారాలు చేసుకుంటూ సంపద పెంచుకుంటున్నారు తప్ప పేద ముస్లింలకు ఏనాడైనా సాయం చేశారా? వాళ్ల ఆసుపత్రుల్లోనైనా ఫీజు తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారా? దమ్ముంటే చెప్పమనండి. వక్ఫ్ ఆస్తులంతే ఒవైసీ తాత సొమ్మనుకుంటున్నారా?
77వేల ఎకరాల్లో ఒక్క గజం కూడా పేదముస్లీంలు అనుభించే పరిస్థితిలో లేరు… వక్ఫ్ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో ఒక్క పేదింటి ముస్లీం ఆడపిల్ల పెళ్లి అయినా చేశారా? చాలా వక్ఫ్ లాండ్ కబ్జా కేసుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్, ఎంఐఎం నాయకలు ఉండడంతో కేసులు ఓడిపోయి వక్ప్ భూములు కోల్పోయింది… అక్కడ వక్ఫ్ భూములన్నీ కబ్జాలోకి వెళ్లిపోయాయి ఇంకా కేంద్రం తెచ్చే కొత్త చట్టంతో భూముల యాజమాన్య హక్కులను లాక్కుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న వక్ప్ ఆస్తుల విలువ సుమారు 5లక్షల కోట్ల రూపాయలు. ఇంత పెద్దం మొత్తం ఆస్థి కలిగి ఉన్నప్పటికీ, పెద్ద ఎత్తున వీటిని ద్వారా ఆదాయం వస్తున్నా వాటికి లెక్కా పత్రం లేదు. ఈ సొమ్ముతో ఒక్క పేద ముస్లిం జీవితాన్ని బాగుచేయలేదు.
పైగా వక్ఫ్ ఆస్తులపై అనేక వివాదాలున్నాయి. కోర్టుల్లో 4వేలకుపైగా కేసులున్నయ్. కనీసం కౌంటర్ ఫైల్ చేయకుండా వక్ఫ్ బోర్డు కావాలనే ఆలస్యం చేస్తోంది… కేసులు రోజురోజుకు పెరుగుతున్నా వక్ఫ్ బోర్డు మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా ఉంది. ధరణి సమయంలో కూడా వేలాది ఎకకరాల వక్ఫ్ భూములు చేతులు మారాయి.
ఇవన్నీ మాట్లాడుతుంటే వక్ఫ్ ఆస్తుల్లో హిందువుల జోక్యమా? అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. అరే వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇంతవరకు ఏ ఒక్క పేద ముస్లిం జీవితాన్నైనా బాగు చేశారా? అంతెందుకు ఇక్కడ హైడ్రాను ఏర్పాటు చేశారు కదా? వక్ఫ్ ఆస్తులపై సర్వే చేయించే దమ్ముందా? తక్షణమే విచారణ జరిపించి ఎన్ని భూములు ఆక్రమణకు గురయ్యాయి? వక్ఫ్ ఆస్తులపై ఏటా ఎంత ఆధాయం వస్తోంది? ఆ సొమ్మును వేటి కోసం ఖర్చు చేస్తున్నారు? పేదల సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేశారనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా? కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే శ్వేత యో వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
