Hyderabad: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత పాదయాత్ర రేపు ప్రారంభం కావాల్సి ఉండగా శాంతి భద్రతల దృష్ట్యా ఈ పాదయాత్రకు అనుమతి ఇచ్చేందుకు అటు నిర్మల్ పోలీసులు ససేమిరా అంటున్నారు. మరోవైపు బండి సంజయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు భైంసాకు వెళ్లి తీరుతా అని శపథం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కరీంనగర్ నుంచి భైంసా వెళ్తుండగా బండి సంజయ్‌ను కోరుట్ల సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. మరోవైపు కార్యకర్తలు సైతం ఆందోళన చేయటంతో తెలంగాణ మొత్తం ఉద్రిక్త నెలకొంది.
కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి లో టీఆరెస్ సర్కార్ పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైటాయించిన కార్యకర్తలు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలుపుతున్న కార్యకర్తలు. సీఎం, పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె సంగప్ప.
డా కే. లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ప్రకటన-
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా అనుమతి తీసుకుని నిర్వహించే భైంసా సభకు అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రేపు సభ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని ఈ రోజు నిర్మల్ పోకుండా అడ్డుకోవడం ఏమిటి. ఆయన ఒక గౌరవ లోక్ సభ సభ్యుడు, ఆయనకు రాష్ట్రంలో తిరిగే స్వేచ్చ లేదా? భైంసా సభను అడ్డుకోవడం వెనుక కేసీఆర్ కుట్ర ఉంది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల చూసి కేసీఆర్ కు భయం పట్టుకుంది.
అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేనట్లే, కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రం లో బీజేపీని ఆపలేరు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రం లో ఏ పార్టీ అయిన సభలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం తనకు తాను నయా నిజాం అనుకుంటున్నాడు. నిజాం మెడలు వంచినట్లే కేసీఆర్ నిరంకుశ పాలనకు అంతం పలికే రోజు దగ్గర్లోనే ఉంది.