కంచు కంఠంతో ప్రజల్లో చైతన్యం, దొరల అరాచకాన్ని ఎదిరించిన పద్మ పద్మ, ఎన్కౌంటర్కు 20 ఏళ్లు

హుజురాబాద్, అరుణ కిరణాలు, ఉద్యమ కాలంలో తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ జిల్లా పేరు వింటేనే ఒళ్ళు పులకరించేది. అనన్య త్యాగాలతో కత్తుల లాంటి యువతను నూతన ప్రజాస్వామ్యక విప్లవం వైపు నడిపించిన రోజులవి. భూస్వాములకు చెమటలు పట్టించి పీడిత ప్రజల పక్షాన నిలబడిన పోరుగడ్డ ఇది. ఈ గడ్డమీద పుట్టిన బిడ్డలకు నిర్బంధాలు, కల్లోలాలు, నిషేధాలు, పోలీస్ కవాతులు, వర్గ పోరాటాలు కొత్త కాదు. విప్లవ పరిమళాలు వెదజల్లే జిల్లాలోని హుజురాబాద్ మండలం కణుకులగిద్ద గ్రామానికి చెందిన పంజాల శాంతమ్మ, సాయిలుకు జన్మించిన మూడో బిడ్డ సరోజన. 20 ఏళ్లు జననాట్యమండలిలో కీలక పాత్ర పోషించి ఎంతో మందిని చైతన్యపరిచారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సరోజనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఆమె ఆట పాటలకు ఆకర్షితులై యువతులను ఎంతోమంది విప్లవోద్యమంలోకి వెళ్లినట్లు సమాచారం. తన కంచు కంఠంతో జానపదాలను అలవోకగా పాడే సరోజన సహజమైన కళాకారిని. గ్రామంలో కుటుంబం అత్యంత పేదరికంతో బతికేది. పెళ్లికి ఎదిగిన ఆడపిల్లల బరువు దించుకునేందుకు తల్లిదండ్రులు ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించారు. మూడవ కూతురైన సరోజన భర్త మధ్యానికి బానిస కావడంతో ఇంటివద్దనే ఉండిపోయింది. కాయకష్టం చేసే తల్లితో కూలి పనులకు వెళ్లి ఇంటి వద్ద ఉంటు గేదెపాలు పితుకుతూ జీవనం కొనసాగించేది. తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ దూర ప్రాంతాలకు వెళ్లి పాలు విక్రయించేది సరోజన. ఇంటి వద్దనే ఉంటూ ఈ ప్రాంతంలో జరిగే భూస్వామ్య వ్యతిరేక, రైతాంగ పోరాటాల్లో సరోజన తరచు పాల్గొనేది. దీంతో ఈ ప్రాంత భూస్వాముల కంట్లో నలుసుగా మారింది. ఏలాగైనా సరోజనను లొంగదీసుకుని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని ఈ ప్రాంతంలోని భూస్వాములు కక్ష కట్టారు. ఒకరోజు అర్ధరాత్రి సరోజనను ఎత్తుకుపోవాలని భూస్వాములు పథకం పనినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. సరోజన వారి పథకాన్ని గుర్తించడంతో పారిపోయారు. అలాగే తరచూ సరోజనను ఇబ్బంది పెట్టే వారు. ఈ గ్రామంలో ఉండటం వల్ల భూస్వాముల ఇబ్బందులు తట్టుకోలేక బతికుంటే బలిసాకు పసరుతిని బతకచ నే భయంతో వీరి కుటుంబం కమలాపూర్ మండలం బావుపేటకు వలస వెళ్లింది. వీరు నివసించే ఇల్లు శిథిలావస్థకు చేరింది.

విషయాన్ని గుర్తించిన అప్పటి పీపుల్స్ వారు పార్టీ నాయకులు సరోజన కుటుంబాన్ని గ్రామానికి రావాలని తాము అండగా ఉంటామని సమాచారం ఇవ్వడంతో వారి అండతో తిరిగి వీరి కుటుంబం గ్రామానికి చేరుకుంది. అప్పటికే పీపుల్స్ వార్ పార్టీ నాయకులతో సరోజనకు సంబంధాలు ఏర్పడ్డాయి. తరచుగా వ్యవసాయ పనుల వద్ద పాటలు వాడే సరోజనకు పాటలంటే చాలా ఇష్టం. దీంతో పార్టీ వాళ్ళతో ఏర్పాడ్డ సంబంధంతో సరోజన పాడిన పాటలను గుర్తించిన పార్టీ ఆమెను పూర్తిస్థాయి సభ్యురాలుగా పార్టీలోకి తీసుకున్నట్లు సమాచారం. అప్పటినుండి భూమి, భుక్తి, విముక్తి కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవంలో పోరాడేందుకు పూర్తిస్థాయి సభ్యురాలుగా కొనసాగింది. తన మధురమైన పాటలతో ఎందరినో పద్మ ఆకర్షించింది. సహజ సిద్ధమైన కళాకారుని కావడంతో జన జననాట్యమండలిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు సరోజనను పార్టీ హైదరాబాద్ పంపించినట్లు తెలిసింది. అప్పటి పీపుల్స్ వార్ నాయకులు సాయిని ప్రభాకర్, రమణారెడ్డిల ప్రోత్సాహంతో 1981లో హైదరాబాదులోని గద్దర్ గృహానికి వెళ్లి జననాట్యమండలి పద్మగా మారిపోయింది. అక్కడ శిక్షణ తీసుకుంటూనే వ్యవసాయ పనులకు సైతం వెళ్లేదని సమాచారం.

చదువురాని పద్మ తాను ఉద్యమ ఎదుగుదలకు ఇబ్బంది అవుతుందని పట్టుదలతో చదువు నేర్చుకున్నట్లు తెలిసింది. చదువుతో పాటే విప్లవ పాటలు పాడడం కూడా చేసేది. భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా పాటలను చాలా అద్భుతంగా పాడేది. కటిక దరిద్రంలో తన కుటుంబంలో పడ్డ బాధలు ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ భావద్వే కంతో పద్మ పాటలు పాడేదని పేర్కొంటున్నారు. జననాట్యమండలి పాటల అభివృద్ధిలో “మదన సుందారి… మదన సుందారి… అనే బానిని ఇచ్చి పద్మ తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. అలాగే “నీ ఇంటి ముందుకొస్తా… నీ ఇంటి మూల కాస్త చిన్నంగా సీటు కొడతా మెల్లంగా లేచి రావమ్మో నల్లరాగులమ్మ… అనే పాట ప్రజలను ఉర్రుతలుగించింది. ఇదే బానిలో జననాట్యమండలి కళాకారులు ఎన్నో పాటలను రచించినట్లు తెలిసింది. పేదోళ్ల ముద్దుబిడ్డ… రేసుపల్లి రేచుక్క… కత్తి మీద సాము నీవు… కథనాన దుంకినావు… నీకు చావు లేదన్నో… కైరి గంగన్న అనే పాటను ఇదే బానిలో ఎన్నో పాటలు వచ్చాయి. పద్మ నోటి వెంట పల్లె పదాల గని లాగా పాటలు జాలువారేది. సాయూద దళంలో చేరి ప్రజలను తిప్పల పెడుతున్న దొరల భరతం పట్టాలని ప్రజలను దోపిడీ, పీడల నుండి విముక్తి చేయాలని తనకు ఆకాంక్ష ఉండేదని తెలిసింది. పార్టీ బాధ్యులు కలిసినప్పుడల్లా తాను దళంలో చేరుతానని విషయాన్ని తెలియజేసేది. దీనికి స్పందించిన వారు జేఎన్ఎమ్లోనే ఇంకా కొంతకాలం కొనసాగాలని చెప్పేవారని సమాచారం.

రాజకీయంగా, సాంస్కృతికంగా ఎదుగుతూ జె ఎన్ ఎం లోని పద్మ కొనసాగింది. జేఎన్ ఎం బృందంలో పనిచేసే సంజీవ్ ను పెళ్లి చేసుకోవాలని ఆకాంక్షను పార్టీకి తెలియజేసింది. సంజీవ్ కు సైతం పద్మను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండటంతో పార్టీ వారికి 1982లో వివాహం జరిపించినట్లు తెలిసింది. 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో ఆదివాసులపై జరిగిన హత్యాకాండను నాటక రూపంలో పద్మనే పోషించినట్లు తెలిసింది. రగల్ జెండా అని నాటకంలో గోండు మహిళ పాత్ర పోషించినట్లు సమాచారం. “గొర్లు బోయినయ్” అనే నాటకంలో గొర్ల కాపరి కొమరయ్య భార్యగా తన పాత్రను అద్భుతంగా పోషించినట్లు తెలిసింది. కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కోడవళ్ళు చేతపట్టవే చెల్లెమ్మ” అని పాడుతూ రైతాంగ మహిళలను చైతన్యపరిచింది. ఆయారే మే డే.. లా లాల్ జెండా హై… అనే నృత్య రూపంలో కార్మిక వర్గాన్ని చైతన్య పరచడంలో భాగస్వామ్యం అయింది. 1981 నుండి 84 వరకు జననాట్యమండలిలో రాష్ట్రవ్యాప్తంగా తిరిగి కళా ప్రదర్శనలు ఇచ్చింది. పీడిత ప్రజల అభిమానాన్ని చూరుకుంటూ విప్లవ సాంస్కృతిక సేనానిగా నిలిచిపోయింది. 1983లో కరీంనగర్ లో జరిగిన విప్లవ రైతు కూలి సంఘం సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో ప్రదర్శనలు ఇచ్చింది పద్మ. తన సొంత జిల్లాలో ప్రదర్శనలు ఇవ్వడంతో తన గ్రామస్తులు అక్కడికి వచ్చి కొందరు పద్మను కలుసుకున్నట్లు తెలిసింది. వివాహనంతరం ఖాళీ సమయాల్లో వెంకటాపురం ప్రాంతంలో నివాసము ఉంటూ అక్కడి వ్యవసాయ పనులకు పద్మ వెళ్లేదని సమాచారం. 1983లో పద్మ ఒక కొడుకు జన్మనిచ్చిందని అప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఉద్యమాన్ని వదలకుండా ఉన్నట్లు తెలిసింది.

1984 నుండి తీవ్ర నిర్బంధం ఏర్పడడంతో భార్యాభర్తలిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. 1986 వరకు అజ్ఞాతంలో ఉంటూ హిందీ, గుజరాతి, తమిళం భాషలను కూడా పద్మ నేర్చుకున్నట్లు తెలిసింది. ఇలా 1990 వరకు ఇరువురు అజ్ఞాత జీవితం గడిపినట్లు తెలిసింది. ఐదు సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపిన దంపతులిద్దరికీ 1990 మార్చిలో వచ్చిన బహిరంగ అవకాశం తో మళ్లీ రెట్టింపు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని హైదరాబాద్కు చేరుకున్నట్లు తెలిసింది. ఒగ్గు కథలో కథకురాలిగా నాలుగు సంవత్సరాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. సాంస్కృతిక ఉద్యమం అభివృద్ధి చెందాలంటే తాను పాడడమే కాదు కళాకారులను కూడా తయారు చేయాలని ఉద్దేశంతో నిజామాబాదులో ఏర్పాటుచేసిన జననాట్యమండలి శిక్షణ శిబిరంలో టీచర్గా పనిచేసింది. సాంస్కృతిక కళాకారునిగా విప్లవ కార్యకర్తగా తన ప్రయాణాన్ని నీళ్లలో చేపలాగా కొనసాగించి తన ఆట, పాట మాటలతో పీడిత ప్రజలను చైతన్యపరిచి ప్రజల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. 1996లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. నవంబర్ 17 ,2002 సంవత్సరంలో వరంగల్లోని ఐలాపూర్ అడవుల్లో జేఎన్ఎం పద్మ ఎన్కౌంటర్లో మరణించింది. 1981 నుండి రెండు దశాబ్దాల తన సుదీర్ఘ విప్లవ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని తన ఆశ, శ్వాస ,ధ్యాస సర్వం పీడిత ప్రజల విముక్తి కోసం సాంస్కృత ఉద్యమ సేనానిగా భూమి, భుక్తి విముక్తి కోసం విప్లవ సాంస్కృతిక నిర్మాణం కోసం పోరాడి ప్రాణాలర్పించిది.

– from social media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X