డిసెంబర్ 5లోగా బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి
త్వరలో ఎంపీటీసీ పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలు
గ్రామాల వారీగా ప్రభుత్వ పథకాల లబ్దిదారుల జాబితా సిద్ధం చేసుకోవాలి
పెండింగ్ పనులను గుర్తించి పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలి
పాలకుర్తి నియోజకవర్గ నాయకుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రాతినిధ్యం వహించే పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ బాధ్యులు, యువ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, కార్మిక, రైతు మరియు సోషల్ మీడియా ఇతర సంఘాల నాయకులతో నేడు పర్వతగిరి, మంత్రిగారి నివాసంలో సమావేశం నిర్వహించారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించినట్లు పార్టీ ప్రజా ప్రతినిధులు, బాధ్యులు, ముఖ్యులు అంతా నిత్యం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ… వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి ఫలాలను చేరవేయాలని, వాటి గురించి వివరించాలని చెప్పారు. బూత్ కమిటీలను బలోపేతం చేయడంలో భాగంగా 150 మందికి ముగ్గురు ఇంచార్జ్ లను నియమించాలని అందులో ఒకరు పార్టీ కార్యకర్త మరొకరు మహిళ ఇంకొకరు యువత విభాగం నుంచి ఉండాలని చెప్పారు.
డిసెంబర్ 5వ తేదీ నాటికి ఈ బూత్ కమిటీల బాధ్యులను నియమించాలన్నారు. మండలాల వారిగా బూత్ కమిటీ కోఆర్డినేటర్లను నియమించారు. బూత్ కమిటీలలో సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కమిటీని చేర్చ వద్దన్నారు. సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలను కమిటీల్లో వేయాలన్నారు. బూత్ కమిటీలను పటిష్టం చేయాలని, పార్టీ నిర్మాణం దృఢంగా జరపాలని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాల వారిగా ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాల లబ్ధిదారులను గుర్తించి వారితో అనుసంధానం చేయాలన్నారు.
ప్రతి గ్రామానికి, ఇంటింటికీ వ్యక్తిగతంగా అందిన ప్రభుత్వ పథకాల జాబితా గ్రామ బాధ్యుల వద్ద ఉండాలని, అవసరం అయితే కర పత్రాలు ముద్రించి, పంపిణీ చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రేణులంతా పనిచేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు. త్వరలో ఎంపీటీసీల పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటామన్నారు. డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పర్యటన మహబూబాబాద్ లో ఉండే అవకాశం ఉందని, పాలకుర్తి నియోజక వర్గం నుంచి సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లు,రైతు బంధు, దళిత బంధు, పెన్షన్ల వంటి పెండింగ్ జాబితాలు రూపొందించి, అర్హులకు వచ్చే విధంగా సమన్వయం చేయాలన్నారు. కుల సంఘాల భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు నిర్మిస్తామని, ఇందుకోసం తగిన కార్యాచరణ చేయాలన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరవేయడం.. ఒక్కో ఇంటికి ఈ ప్రభుత్వంలో జరిగిన లబ్దిని వివరించడం.. పెండింగ్ అంశాలను,పనులను గుర్తించి వాటిని పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఆదేశాల మేరకు పార్టీని పటిష్టం చేస్తూ.. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరించాలని మంత్రి దయాకర్ రావు గారు పార్టీ నాయకులను కోరారు.